సామెత -256 - ఆకలైనోనికి అన్నమే బ్రహ్మము అన్నట్లు
***
"ఏందో అవ్వా! గాయిన శాదత్తం గాకపోతే గాడు నాకు రావు మొర్రో అని గుడ్లు తేలేత్తున్నా! ఆగడే! గీ పుట్క బుట్టి రావంటే ఎట్ల అన్కుంట కూస బెట్టిండు. గా పెద్దమ్మేమో వాడొచ్చింది దేనికి, నువ్వు జెప్పేదేంటి? అన్న సుత ఆగుమంటే ఆగడే."
"ఎవలు శెల్లె! మన శారి యాయ్య ముచ్చెటినేనా? అబ్బో గాయిన శాదత్తం అంతింత గాదు. శిన్నప్పుడైతే బరిగె బట్కొని ఏమన పజ్జాలు,సుమతి పజ్జాలు సద్విచ్చి సూడకుండ శెప్పమనేటోడు. మా ఈడు పొల్లగాండ్లమైతే యాయ్యున్న యీదిల నడ్వడానికే అద్రుకునేటోల్లం. అయిన సరే అర్గు మీద కూసోని గద్దలెక్క పశిగట్టి పిల్శి కూసబెట్టి శెప్పేటోడు. మన యాయ్య వొల్లనే నాతో దోత్తానం జెయ్యడాన్కి ఎవ్వలూ ముందుకొచ్చేటోళ్ళు గాదు.
"అవునవ్వా! గీ వొయిసుల ఎందుకు శెప్పు. గిప్పటోళ్ళు తాలు సద్వు సద్వుతుర్రు. ఓ ఏమన పజ్జమో, సుమతి పజ్జమో శెప్పమంటే తల్కాయ నేలకేత్తుర్రు. గందుకే నా రందంత అంటడు.గా సద్వుల్లనే దేవుడుంటడు. గదొత్తె యాడికి బొయ్యినా బువ్వ దొరుకుద్ది అంటడు. గట్ల ఎవలొచ్చినా ఒకటో రెండో పజ్జాలు నేర్సుకుని నోటికి శెప్పే దన్క ఊకోడు. గట్ల ఇయ్యాల ఓ పొల్లగాడు వొచ్చి గీయన శేతుల్ల బలైండవ్వా!"
"అయ్యో! గంత మాటంటివి ఏమైంది శెల్లే! ఎవలికన్న ఏమన్న ఆపతొచ్చిందా ఏంది? మన యాయ్య యిష్యం తల్సుకుంటెనే బయమేత్తుంది."
"అవ్వా! నువ్వు బయపడ్డట్టే అయ్యింది. పక్కూరి నుంచి ఓ పొల్లగాడు గిక్కడ సుట్టపోల్లు ఉండ్రని వొచ్చిండు. తీరా గీడికొచ్చినంక గాళ్ళు లేరని, ఎప్పుడొత్తరో అడ్గుదామని మన పెద్దమ్మ తానికి వచ్చిండు. యాయ్య గాన్ని పట్కొని సద్వు యిష్యాలు అడుగుడు షురూ జేసి పజ్జాల ముచ్చటి అడిగే తల్కి తెల్ల మొహం ఏశిండట. ఇంగేముంది.గాన్ని పట్కొని గీ పజ్జాలల్ల పరమాత్తుడుండు అన్కుంట పజ్జాల వొయ్యి శేతుల బెట్టి పజ్జాలు నేర్పిచ్చుడు షురూ జేసిండట."
"గాని ఆలకం సూశే బాగ ఆకలిగుండని పెద్దమ్మ "ఆటెంక నేర్సుకుంటడు తీ ముందుగాల గాన్ని తిననియ్యమంటే పెద్దమ్మని గుడ్లుర్ముకుంట సూశి గా పజ్జాలు నోటికి అప్పజెప్పినంక తింటల్లే అని గానెదురుగ్గనే కూసుండట."
"ఆటెంక ఏమైంది శెల్లే?"
"గాడు ఆకల్తో గిలగిల్లాడుకుంట బెహోష్ అయ్యిండట."
గప్పుడన్న యాయ్యకి బుద్దొచ్చిందా శెల్లే?"
"బయంతో గజ్జున వొణుక్కుంట మొకాన నీళ్ళు జల్లి లేపి సొయంగ ఇత్తారేశి అన్నం బెట్టిచ్చి తినేదన్క గానికి తనేస్కున్న పై కండువతో గాలిసురుకుంట కూసుండంట. గదేదో ముందే జేత్తే మంచిగుండుగద! ఆకల్తో ఉన్నోడికి ఏమన్న తల్కాయలకి ఎక్కుతయా శెప్పవ్వా? "
" గప్పుడు గా పొల్ల గాడు కడ్పునిండ తిని గా పజ్జాలల్ల ఏమోగని గీ అన్నంల దేవుడు కన్పిచ్చిండయ్యా! గిప్పుడు శెప్పుండ్రి ఒక్క పజ్జమన్న అప్పజెప్పి పోత అన్నడంట."
శెల్లే! గీ లెక్కన గాడు మంచోడే తిన్నంక మల్ల మొగం సూడకుండ ఉర్కలే. అయిన గని శెల్లే "ఆకలైనోనికి అన్నమే బ్రహ్మము" గని గా పజ్జాలు గా సయిమంల కడ్పు నింపుతయా? గవ్వీటి గొప్ప తెలుత్తదా?"
మన యాయ్య ఓ మంచి పన్కి గిట్ల జేశిండు గని, కొంతమందిరి ఆకలై గింత ముద్దపెట్టుమని అడ్గినోళ్ళతో ముందుగాల గొడ్డు శాకిరి శేయిచ్చుకొని శివరాకరికి సద్దో ,బొద్దో పెట్టుడు నా కండ్ల తోటి సూశినవ్వా!"
"అవును శెల్లే!గట్ల జేసుడు పాపం గద! ఆకలై వొచ్చినోళ్ళని గట్ల ఉక్కుష్ట బెట్టొద్దు. ముందుగాల గింత బెట్టి గాళ్ళ కడ్పు సల్లబర్శినంక ఏదన్న శెప్పాలె. గా అన్నంల పెట్టినోళ్ళు పుట్టిచ్చిన బమ్మ దేవుని లెక్క అగుపిత్తరు. గా అన్నంల సుత దేవుడే అంటే గా బమ్మే అగుపిత్తడు."
అవునవ్వా! గదే ముచ్చెటి నేను పెద్దమ్మ అన్కున్నం.ఇగ యాయ్య జల్మల గట్ల ఎవల్ని బాద పెట్టడు.తెల్శొచ్చింది అని సుత అన్కున్నం."
గదండీ సంగతి! "ఆకలైనోడికి అన్నమే బ్రహ్మము" అంటే గిదే మరి. గా సయిమంల ఏం జెప్పినా ఎక్కవు.ముందుగాల ఆకలి తీర్శి ఇంగేమన్న గప్పుడు శెప్పాలె."


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి