వర్షం తగ్గిన తర్వాత కూడా కృష్ణుడు ఆకాశం వైపు చూస్తూనే ఉన్నాడు. నల్లటి మబ్బులు మెల్లగా కదులుతున్నాయి. ప్రతి క్షణం అవి రకరకాల రూపాలు దాల్చుతున్నాయి.
ఒక మబ్బు పెద్ద ఏనుగులా వచ్చింది.
అది చూసి కృష్ణుడు చప్పట్లు కొడుతూ నవ్వాడు.
“అమ్మా... ఏనుగు పరుగెడుతోంది చూడు...” అన్నాడు కృష్ణుడు.
తర్వాతి మబ్బు పొడవుగా చుట్టుకుని కొండలా మారింది.
“అమ్మా అదిగో పెద్ద కొండ...” అని అరిచాడు.
మరి కొన్ని క్షణాలకు ఒక మబ్బు పెద్ద శంఖంలా కనిపించింది.
అది చూసి కృష్ణుడు కళ్లు పెద్దవి చేశాడు.
“అమ్మా... ఇది శంఖం ఊదబోతోంది...” అన్నాడు.
ఆ మాటలకు యశోద నవ్వుతూ, "అవున్రా కృష్ణా... నీ కోసమే మబ్బులన్నీ వేషాలు వేసుకుని వస్తున్నాయి...” అంది.
కృష్ణుడు అది వినగానే ఇంకా ఉత్సాహపడిపోయాడు.
ప్రతి మబ్బుకూ అతనే పేర్లు పెట్టడం మొదలుపెట్టాడు.
“ఇది దూడ...”
“అది కోతి...”
“ఇదిగో వెన్న ముద్ద...”
“అదిగో బలరామన్న...”
అని ఆగకుండా చెబుతున్నాడు.
ఇంతలో ఒక మబ్బు హఠాత్తుగా గుండ్రంగా చుట్టుకుంది.
“అమ్మా... ఇది వెన్న కుండ!” అని అరిచాడు.
యశోద నవ్వి "దాన్ని పగలగొట్టబోతున్నావా?” అని అడిగింది.
“లేదు... ముందు తినాలి...” అన్నాడు కృష్ణుడు.
అది వినగానే యశోదకు ఇంకా నవ్వు వచ్చింది.
కొంతసేపటి తర్వాత మబ్బులు ఇంకా పైకి కదిలాయి.
అప్పుడు ఒక పెద్ద నల్లమబ్బు మెల్లగా నెమలి పింఛం విప్పినట్లు ఆకాశమంతా పరుచుకుంది.
అది చూసి కృష్ణుడు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయాడు.
అతని కళ్లలో ఒక విభిన్నమైన మెరుపు కనిపించింది.
ఎక్కడో చూసిన పాత స్నేహితుడిని చూసినట్లు ఆ మబ్బు వైపే చూస్తూ ఉండిపోయాడు కృష్ణుడు.
ఇతర మబ్బులను చూసినప్పుడు నవ్వినవాడు, ఇప్పుడు మాత్రం అస్సలు మాట్లాడలేదు.
ఆ నెమలి ఆకారపు మబ్బు ఆకాశంలో మెల్లగా కదులుతోంది.
కృష్ణుడి చూపు కూడా దాన్నే వెంబడించింది.
ఒక క్షణం...
యశోదకు తన ఒడిలో ఉన్న బిడ్డ ఎక్కడో చాలా దూరానికి వెళ్ళిపోయినట్లు అనిపించింది.
అతని ముఖంలో ఒక వింతైన ప్రశాంతత.
ఒక పాత జ్ఞాపకం.
ఒక పాత స్నేహం.
ఒక పాత ప్రపంచం.
తర్వాతి క్షణంలోనే ఆ మబ్బు విడి పోయి వేరే రూపంలోకి మారిపోయిం ది.
కృష్ణుడు కూడా మళ్ళీ చిన్న పిల్లాడైపోయాడు.
“అమ్మా... ఆ మబ్బు నాకు కావాలి...” అని చేయి చాపాడు.
యశోద నవ్వుకుంటూ అతడిని ఎత్తుకుంది.
“దాన్ని ఎలా పట్టుకోవాలిరా?” అని అడిగింది.
కృష్ణుడు వెంటనే ఆమె బుగ్గలు పట్టుకుని,
“నువ్వు పట్టిస్తావు...” అన్నాడు.
ఆ మబ్బును ఎలా పట్టివ్వాలో తెలియక యశోద అయోమయంలో పడింది.
కొంతసేపు ఆలోచించింది.
ఆ తర్వాత అతని ముక్కు పట్టుకుని ఊపుతూ,
“కృష్ణా... నువ్వే ఒక మబ్బులా ఉంటావు...” అంది.
“నిజంగానా?”
“అవును. అది కూడా కారుమబ్బు...”
కృష్ణుడు వెంటనే ఆకాశం వైపు చూశాడు.
ఆ తర్వాత తన చేతులను కూడా చూసుకున్నాడు.
దేన్నో పోల్చి చూసుకున్నట్లు ఉంది ఆ సన్నివేశం.
యశోద నవ్వుకుంటూ, "వర్షం రాబోతోంది. రా లోపలికి వెళ్దాం...” అంది.
కృష్ణుడు వెంటనే "అలాగైతే మరి వెన్న ఇస్తావా?” అని అడిగాడు.
యశోద నవ్వేసింది.
ఇంతసేపు మబ్బుల గురించి మాట్లాడినవాడు, మళ్లీ వెన్న దగ్గరికే వచ్చేశాడు.
“ఇస్తాను... రా...” అంది.
అంతే.
కృష్ణుడు సంతోషంగా ఆమెను కౌగిలించుకున్నాడు.
యశోద అతనిని ఎత్తుకుని ఇంట్లోకి నడిచింది.
వాకిలి దాటడానికి ముందు కృష్ణుడు ఇంకోసారి వెనక్కి తిరిగి చూశాడు.
ఆకాశంలో మబ్బులు ఇంకా కదులుతూనే ఉన్నాయి.
వాటిలో ఒకటి మాత్రం కృష్ణుడిని చూసి నవ్వుతున్నట్లు అనిపించింది.
కృష్ణుడు కూడా దాన్ని చూసి నవ్వాడు.
భక్తుల హృదయంలా పవిత్రంగా, సరికొత్తగా ఉండే తాజా వెన్న పేరు చెప్పగానే సమస్తాన్ని మరచిపోయి అలాగే కరిగిపోతాడు చిన్నారి కృష్ణుడు.
కృష్ణుడిని దారికి తెచ్చుకునే ఈ రహస్యం యశోదకు బాగా తెలుసు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి