గత 50 సంవత్సరాలుగా ఎస్. జానకి గారి వీరాభిమాని నేను. జానకి గారు అంటే అభిమానం అనేకంటే పిచ్చి అని చెప్పొచ్చు. ఆమె దక్షిణ భారతదేశ భాషల్లో పాడిన అన్ని పాటలు విపరీతంగా వినేవాడిని. సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ యువవాణి అనుకుంటా దాంట్లో వరుసగా తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం నాలుగు భాషలలో పాటలు వేసేవారు.అందులో ఎక్కువగా ఇళయరాజా స్వరపరచి జానకి గారు పాడిన పాటలే ఎక్కువ ఉండేవి.
నేను ఆ టైంలో ఆఫీసులో ఉన్నా కూడా కామ్ గా పైన ఉన్న టెర్రస్ మీదకు పోయి నా వద్ద ఉన్న చిన్న రేడియో లో వినేవాడిని. అరగంటసేపు ఆ పాటలు అన్ని విన్న తరువాతనే కిందికి వచ్చేవాడిని. అప్పుడు కన్నడ భాష అయితే జానకి రాజ్ కుమార్ పాడిన పాటలు బాగా వచ్చేవి. స్వర్గీయ రాజ్ కుమార్ జానకీ తో కలిసి పాడిన ఎన్నో అద్భుతమైన
డ్యూయట్లు ఉన్నాయి. తమిళ పాటలు కన్నడ పాటలు, తెలుగు పాటలు ఏవైనా సరే ఇళయరాజా గారి సంగీతంలో జానకి పాడిన పాటలు అంటే నాకు ప్రాణం.
1978 లో ఒకసారి కోఠీకి వెళ్లి నాలుగు భాషలలో ఉన్న జానకి క్యాసెట్లు అన్నీ కొనుక్కొని నా దగ్గర ఉన్న ఒక పాత క్యాసెట్ రికార్డర్ లో వేసుకుని వినేవాడిని. 1981 లో నేను ఉద్యోగంలో ప్రవేశించిన కొత్తలో నా మొదటి జీతంతో ట్రూప్ బజార్ కు వెళ్లి మెయిన్ రోడ్డు దగ్గర సిద్ధార్థ హోటల్ దగ్గర
ఉన్న ఒక ఎలెక్ట్రానిక్ షాపులో
500 రూపాయలు పెట్టి ఒక కొత్త క్యాసెట్ రికార్డర్ కొన్నాను. అది పడుకోబెట్టినట్టు ఉండేది (చాలా ఓల్డ్ మోడల్.)
క్యాసెట్లని అరిగిపోయేదాకా వినేవాడిని. ఇప్పటికీ మా ఇంట్లో ఒక డబ్బా నిండా పాత క్యాసెట్లు ఉన్నాయి. వినటానికి రికార్డర్ లేదు.అవి పారెయ్యలేక సెంటిమెంట్ గా అలాగే దాచుకున్నాను. ఇప్పటి సీడీల కాలంలో క్యాసెట్లు కనుమరుగయ్యాయి. ప్లే చేయడానికి రికార్డర్ కూడా లేదు.
ఇక మళ్ళీ జానకి గారి విషయానికి వస్తే ...
1981 నుండి నాకు జానకి గారితో
అనుబంధం ఉంది.వారు నన్ను తమ్ముడు అని ఎంతో ప్రేమగా,ఆప్యాయంగా పిలిచేవారు. నేను అక్కయ్య గారూ అని పిలిచేవాడిని.
నేను ఒకసారి స్కెచ్ పెన్ తో ఒక లెటర్ రాసి మద్రాస్ పంపించాను. ఆమె ఈ కలర్లు ఏమిటి వీటిని ఏమంటారు అని అడిగారు. నేను ఇవి స్కెచ్ పెన్స్ అంటారు అని చెప్పి, ఒక సెట్ కలర్ స్కెచ్ పెన్సు పోస్టులో మద్రాసుకి పంపాను. ఆమె వెంటనే ఒక పెద్ద లెటర్ రాస్తూ ప్రతి 2 లైన్లకు ఒక పెన్ను చొప్పున 10 కలర్లు వాడుతూ ఒక లెటర్ పంపారు.జానకి అక్కయ్య ఎక్కడ ఉందని తెలిస్తే అక్కడికి వెళ్లి వాలిపోయేవాడిని. ఒకసారి లకిడికాపూల్ హోటల్ అశోకాలో, ఇంకొకసారి మినిస్టర్ రోడ్లో ఉన్న దక్కన్ కాంటినెంటల్ హోటల్లో, (ఇప్పుడిది KIMS గా మారింది) ఇలా చాలా సందర్భాలలో కలిశాను.
నేను ఆమెను కలిసినప్పుడల్లా ఎంతో ఆదరించి మంచి కాఫీ తాగించి పంపించేవారు.
***
ఒకసారి ఇలాగే మా పెళ్ళైన కొత్తలో 1987 లో మద్రాస్ లో అభిరామి స్ట్రీట్ లో ఉన్న వాళ్ళ స్వగృహానికి వెళ్ళాం. అప్పుడు వారి మామగారు డాక్టర్ ఫన్ చంద్రశేఖర్ గారు కూడా కలిశారు. వారు కూడా జగమెరిగిన కళా కారులు. భర్త V.రామ్ ప్రసాద్ గారు. కుమారుడు మురళి. జానకి గారు
తన పుట్టింటి పేరు
శిష్ట్లా తోనే జగత్ ప్రసిద్ధి చెందారు. వారింటికి వెళ్తే మమ్మల్ని ఎంతో సంతోషంగా ఆహ్వానించి గౌరవించారు.
*
ఇంకొక విషయం. జనవరి 1983 జనవరి 9th నాడు
గుంటూరులో ఎస్. జానకి గారి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ గుంటూరు హిందూ కాలేజీలో బ్రహ్మాండంగా జరిగింది. అప్పుడే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నేను ఉద్యోగంలోకి వచ్చి రెండేళ్లు అయింది. సెలవు పెట్టీ మరీ గుంటూరుకి వెళ్లి S.జానకి గారి సాహితీ రజతోత్సవం మరియు సినీ సంగీత విభావరిలో పాల్గొనే
అదృష్టం నాకు దక్కింది. అప్పుడు ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి.నా.రె. గారు వ్యవహరించారు. ఆనాటి ప్రముఖ నటీమణులు జయసుధ, జయప్రద, లత, మంజుల ఇలా అందరూ ప్రముఖ నటులు కూడా హాజరయ్యారు. దాదాపు 30 పాటలు జానకి గారు ఎస్పీ బాలు మరియు కొంతమంది సింగర్స్ తో కలిసి పాడారు.
ఆ తర్వాత తర్వాత
సంసారబంధంలో చిక్కుకొని,
రొటీన్ లైఫ్ లో పడిపోయిన నాకు క్రమంగా సినిమాలు,పాటలు అన్ని దూరమయ్యాయి.
(2006 నుండి ఇప్పటిదాకా గత 20 ఏళ్లుగా సినిమా థియేటర్ లో కాలు పెట్టలేదంటే మీరు నమ్మకపోవచ్చు. 2006 లో నేను చూసిన చివరి సినిమా "బొమ్మరిల్లు")
అయినా ఇప్పటికీ ఎప్పటికీ నా ఫేవరెట్ ప్లే బ్యాక్ సింగర్ మా జానకి అక్కయ్యనే.
అలాగే జానకి అక్కయ్యతో పాటు ఇళయరాజా గారన్నా నాకు ప్రాణం.ఇళయరాజా గారి సంగీత సారధ్యంలో వచ్చిన జానకి గారి ఏ పాట అయినా సరే అది నాకు అమృత తుల్యమే. వారి ఇద్దరి కాంబినేషన్ చాలా గొప్పది.వారి కాంబినేషన్ లో వచ్చిన జానకిపాట ఏదైనా చెవులకు వినపడితే చాలు
నా కాళ్లు అక్కడే యాంత్రికంగా ఆగిపోతాయి.
అయితే ఒక మాట...
ఎస్ జానకి అక్కయ్య పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించడం
నన్ను చాలా బాధించింది. ఆమెకు పద్మశ్రీ కాదు కదా ఇచ్చింది. భారతదేశ అత్యున్నత తృతీయ పురస్కారం. 55 సంవత్సరాల సుదీర్ఘ గాయక ప్రస్తానం తర్వాత ఈ పురస్కారం వచ్చిందని భారతదేశ అత్యున్నత పురస్కారం అయిన "భారత రత్న" కు తాను అర్హురాలనని ఆమె ప్రకటించారు.
ఆ మాటకొస్తే కొన్ని వేల చిత్రాలు గీసిన ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి 50 సంవత్సరాలు తెలుగు సినీ కళామతల్లికి సేవ చేసిన నా అభిమాన దర్శకుడు బొమ్మల బాపుకు 50 సంవత్సరాల తర్వాత గుర్తించి పద్మశ్రీ ఇస్తే చాలా సంతోషంగా స్వీకరించారు.
అలాగే ఈ మధ్య 50 సంవత్సరాలుగా సినీ రంగంలో ఉన్న మురళీమోహన్ గారికి పద్మశ్రీ స్వీకరించడం మనం చూశాం.
ఏది ఏమైనా...
నేను కూడా మా జానకి అక్కయ్యతో ఎంతో కొంత అనుబంధం ఉన్నందుకు సంతోషిస్తూ, గర్వపడుతూ భువి నుండి దివికేగిన మా శిష్ట్లా జానకి అక్కయ్య గారికి నా యొక్క అశ్రునివాళులు వినమ్రంగా సమర్పిస్తున్నాను.
NB:
(ఇప్పటికీ ఆమె కార్డుపై రాసి ఇచ్చిన ఆమె ఆటోగ్రాఫ్, ఆమె స్వయంగా గీసి ఇచ్చిన ఆమెస్వయం చిత్రం, అలాగే ఆమె స్కెచ్ పెన్ తో రాసిన ఉత్తరం ఇప్పటికీ నా సందుక ( ఇనుప పెట్టె ) లో భద్రంగా ఉన్నాయి.)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి