దోసకాయల దొంగ నక్క : - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212


 ఒకూర్లో ఒక రైతున్నాడు. ఆయన పొలంలో దోసకాయ విత్తనాలు వేసినాడు. వానలు బాగా పడడంతో కొన్ని రోజుల్లోనే తోటలో దోసకాయలు బాగా కాసినాయి. అది చూసి రైతు ఎంతో సంబరపడినాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలబల్లేదు.
ఆ ఊరిని ఆనుకుని ఒక పెద్ద అడవి వుంది. ఆ అడవిలో ఒక నక్కుంది. దానికి దోసకాయలంటే చానా ఇష్టం. రోజూ రాత్రి చీకటి పడగానే దొంగచాటుగా తోటలోనికి పోయి మంచి మంచి దోసకాయల్ని కడుపు నిండా తిని, తన పెండ్లాం, బిడ్డల కోసం మిగతావన్నీ కోసుకోని ఒక సంచి నిండా వేసుకోని వెళ్ళిపోయేది.
పొద్దున్నే రైతు వచ్చి చూస్తే ఇంకేముంది. తోటలో ఒక్క దోసకాయ గూడా కనబడేది కాదు. ప్రతిరోజూ అంతే... కాసిన కాయలు కాసినట్టు నక్క ఎత్తుకోని పోయేది. దాంతో రైతు కట్టె తీసుకోని రాత్రిపూట చేనుకి కాపలా కాయడం మొదలు పెట్టినాడు. కానీ పాపం ఎంతసేపని మేలుకోగలడు. ఏదో ఒక సమయంలో నిద్ర వచ్చి కళ్ళు మూసుకొని పోతాయి గదా. అంతే... అందుకోసమే ఎదురుచూస్తా వున్న ఆ దొంగనక్క ఠక్కున లోపలికి దూకి రైతు మళ్ళా కళ్ళు తెరిచేసరికి కాయలన్నీ మాయం చేసేది.
ఇక ఇట్లాగైతే లాభం లేదనుకున్న రైతు బాగా ఆలోచించి చివరకు చిన్న చిన్న కత్తులు తీసుకోనొచ్చి, దోసకాయల చుట్టూ పెట్టి అవి కనబడకుండా ఎండుగడ్డి కప్పినాడు. మామూలుగానే ఆరోజు రాత్రిగూడా నక్క హుషారుగా ఈల వేసుకుంటా తోటకాడికి వచ్చింది. చూస్తే రైతు యాడా కనబడలేదు. ఈరోజు రైతు ఇంకా రాలేదేమో...వచ్చేలోగా అన్నీ తినేయాలనుకోని ఎగిరి తోటలోనికి దుంకింది. అంతే... కత్తులు సర్రున లోపలికి దిగబడినాయి. పాపం నక్క బాధతో విలవిలలాడిపోతా కుయ్మో.... మొర్రో.... అని ఏడుస్తా బెరబెరా తోట దాటి అడవిలోనికి ఉరికింది. దానికి కత్తులు గుచ్చుకున్నాయి గదా.. ఒళ్ళంతా ఒగటే రక్తం కారిపోసాగింది. నడవలేక... నడవలేక నడవసాగింది. అట్లా కొంతదూరం పోగానే దానికి బాగా నీరసమొచ్చి ఒక బండ మీద కూలబడి అట్లాగే నిద్రపోయింది.
రక్తం ఎట్లుంటాది. ఎర్రగా... బంక బంకగా వుంటాది గదా. నక్క బండ మీద పడుకున్న కాసేపటికి రక్తం బాగా ఎండిపోయి దాని కడుపు బండకు అట్లనే అతుక్కోనిపోయింది. పొద్దున్నే నక్కకు మెలకువ వచ్చి లేద్దామంటే... ఇంకేముంది... అతుక్కోనిపోయింది గదా. లేవలేక పోయింది. ఎంత గింజుకులాడినా లాభం లేకపోయింది.
దాంతో ఇక లాభం లేదనుకోని ఆ నక్క కళ్ళనీళ్ళు పెట్టుకోని వానదేవున్ని తలచుకుంటా "భగవంతుడా... బుద్ధి గడ్డి తిని మంది సొమ్ముకు ఆశ పడినాను. ఇంకెప్పుడూ దొంగతనం చేయను. ఈ ఒక్కసారికి నన్ను కాపాడినావంటే ఏడు రాత్రులు మేలుకొని నీకు భజన చేస్తాను" అని మొక్కుకోనింది. అది విన్న వానదేవుడు సరేనని పెద్ద వాన కురిపించినాడు. నీళ్ళు బాగా తగిలీ తగిలీ రక్తమంతా కరిగిపోయింది. దాంతో ఆ నక్క బైటపడి బతుకుజీవుడా అనుకుంటా పరుగెత్తుకొని ఇంటికి చేరుకోనింది.
పెండ్లాం బిడ్డలకు జరిగిందంతా చెప్పి మొక్కు తీర్చుకోకుంటే దేవునికి కోపమొస్తాది, ఎట్లాగైనా మొక్కు తీర్చుకోవాల అనింది. పెండ్లాం
బిడ్డలు కూడా సరే అన్నాయి. కానీ భజన చేయాలంటే తాళాలు కావాలి గదా. తాళాలంటే ఇంటికి వేసేవి కాదు. దేవుని దగ్గర ఒకడు పాడుతావుంటే పక్కనే కూర్చోని ఇంకొకడు పాటకు తగ్గట్లు రెండు చేతుల్తోనూ పట్టుకొని టప్... టప్.. అని కొడతావుంటాడు చూడు అవి. ఆ తాళాలు దాన్ల దగ్గర లేవు. చుట్టుపక్కల ఎవరిని అడిగినా మా దగ్గర లేవంటే మా దగ్గర లేవన్నారు. మరి ఎట్టాగబ్బా అని ఆలోచించీ... ఆలోచించీ... చివరకు ఒక ఉపాయం పన్నినాయి.
అడవిలో నక్క నక్క పెండ్లాం దారి పక్కన ఒక పొదలమాటున కూచోని వచ్చే పోయే జనాలను బాగా గమనించసాగినాయి. కాసేపటికి ఒకడు పక్క ఊరిలో భజన చేసి తాళాలు పట్టుకోని వస్తా కనబన్నాడు. వెంటనే ఒక నక్క దారిలో వానికి కనబడేటట్లుగా ఒకచోట చచ్చిందానీ మాదిరి పడిపోయింది. వాడు వస్తా వస్తా ఆ నక్కను చూచి "ఇదేదో ఇప్పుడే చచ్చినట్లుంది. వెంటనే తీస్కోని పోయి నేనూ, నా పెండ్లాం బిడ్డలు బాగా కూర వండుకోని తినొచ్చు" అనుకోని లొట్టలేసుకుంటా తాళాలు కింద పెట్టి దాని దగ్గరకు పోయినాడు.
వాడు తాళాలు కింద పెట్టి అట్లా వెళ్ళడం ఆలస్యం నక్క పెండ్లాం వెనుకనుండి ఎగిరి దుంకి దాన్లను నోట కరచుకోని "వూ" అంటూ ఈల వేస్తా పారిపోయింది. ఆ అరుపు వినబడగానే అంతవరకూ చచ్చిందానిలెక్క గమ్మున పడున్న నక్క ఛటుక్కున పైకి లేచి పారిపోయింది. వాడు ఆచ్చర్యపోయి తిరిగి చూస్తే ఇంగేముంది. తాళాలు గూడా లేవు. దాంతో వాడు లబోదిబోమని ఏడుస్తా ఇంటికి వెళ్ళిపోయినాడు.
నక్క నక్క పెండ్లాం దేవునికి మొక్కుకున్నట్లుగా గుడికి పోయి వరుసగా ఏడు రాత్రులు భజన చేసి, తమ మొక్కును చెల్లించుకున్నాయి. ఆ తరువాత తాళాలు తీసుకొని పోయి మరలా వాటి యజమాని గుమ్మం ముందు పెట్టి, తలుపు టకటకా కొట్టి వచ్చేశాయి.
**********
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు: --ఎం బిందుమాధవి
చిత్రం