వృద్ధులు వ్యర్థులు కాదు: - అంకాల సోమయ్య -దేవరుప్పుల-జనగామ -9640748497


చూపు సరిగ్గా లేని
నడవలేని పెద్దలను
పలకరించాలని
ఎవరికుంది!
మూలగదిలో విసిరేయడం తప్ప!
పొలిమేరల్లో వదిలేయడమే గొప్ప!
మానవత్వం మరుగవుతున్న
నేటి సమాజంలో....

జీవితమంతా  కష్టపడ్డవారు 
అవసాన దశలో ఆదరించేవారులేక 
వృద్ధాశ్రమాల్లో తలదాచుకుంటున్నారు

కన్నతల్లిదండ్రులు నేడు కానివారయ్యారు
తన కడుపున నవమాసాలు మోసి 
కనిపెంచి పెద్ధజేసారన్న కనీస జ్ఞానం లేకుండా 
తల్లిదండ్రుల ఆస్తులను అనుభవిస్తూ 
ఆతల్లిదండ్రులనే తూలనాడుతున్నారు?
పుత్రుడు పున్నామ నరకం నుండి
 తప్పిస్తాడనేగదా!? ఆతల్లిదండ్రులు కన్నది

 బ్రతికుండగానే నరకం చూపిస్తున్నాడు
మున్ముందు కొడుకులు ఇలా అవుతారనుకుంటే
పురిట్లోనే నోట్లో వడ్లగింజేసిచంపేద్దురుగదా!
ఇంతగా ఈసడించే తన కొడుకులు 
రేపు వీరు వృద్ధులు కారా!?
చచ్చేదాకా ఇలా యవ్వనంగానే
ఉంటారా!?

మతిమరుపు వరమైన వయోవృద్ధులు 
వారి స్వీయానుభవాలే మన బ్రతుక్కు భగవద్గీత

మన బిడ్డల వలె ఆదరిస్తే
వారి బ్రతుకొక స్వర్గం 
కాదు కూడదు అంటే వారి బ్రతుకొక నరకం

ఓ కుమారులారా!?
రేపటి తండ్రులారా!?
నేడు పడుచుతనంతో 
దుడుకుస్వభావంతో
కన్ను మిన్నుకానక 
వయోవృద్ధులను దూషించకండి
వారికి చేయూత నివ్వండి 
వృద్ధాప్యం శాపం కాదు వరం అని నిరూపించండి
వృద్ధులు వ్యర్థులు కాదు ఇంటికి 
ఈశ్వరులు
ముంగిట కూర్చోబెడితే ఆ ఇంటికి 
మూలవిరాట్టులు

విల్లులా వంగిన దేహం 
ఏది రుచించని నాలుక
రోగాలతో నిత్యసహవాసం 
ఊరెప్పుడో పొమ్మన్న 
మృత్యువు పిలుపుకై ఎదురుచూపులు 

రెండో బాల్యమే ఈవార్థక్యం 
బిడ్డల ఆదరణే పరిష్కారం 

సమయానికి భోజనం 
ఆత్మీయపు పలకరింపు 
బ్రతుకు మీద కొండంత ఆశ
అదే లేని నాడు
కొండెక్కునిప్పుడే తన ప్రాణదీపం 

విలువలే మన మూలాలు 
అవే లేని నాడు సంఘం కాదిది
అమానవీయ జనారణ్యం

కామెంట్‌లు