తీగలేని రాగం సాగే సుదీర్ఘం: - డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871


 1
ఒక అద్భుత మాయా దీపం
పిలుస్తది నిరంతరం 
వేళాపాళా లేక ఏడ్చే పసికూనలా 
2
ఉరుములు మెరుపులు మోసుకొస్తది
ఉండదు పాపం ఓ స్వార్థ చింతన
భాష వేషాల అంచులు దాటి విశ్వ వీధుల విహరించు
స్వేచ్ఛ రెక్కల ధ్వనిలో అదృష్య కవి మనసుతో
3
హలో అనడంతో
అటువైపు హలో అనడంలో దిట్ట
తెగిన సంకేతాలు అగిన సందేశాలు
ధ్వని ప్రతిధ్వనులకే పెద్ద ఆనకట్ట
నీళ్ళులేని వాగులో చేప పిల్లల ఆట
గాలి ఆడని గదిలో
జీవుల ఆశలు తలకిందులు
4
సంకేతాల టవర్ పేలిందా
ఇక చూడు
ప్రపంచం ఆగమాగం 
అందంగా అరచేతిలో బందీ సెల్ ప్రపంచం
 5
వార్తాహరుల వేదికలన్నీ
అజాతశత్రువు చుట్టాలే పైకి
కాలాన్ని కాల్చేసే కరెంట్ తీగలు లోలోన
6
ప్రతిక్షణం వెలుగులేని సూర్యుడు
చీకటిలో నిద్రలేని రాత్రులు 
ఎంతగా మనిషిని లొంగదీసుకుందో మరి
మడి కట్టుకున్న దడిలోనూ కుదురుగా కూకోనీయదు 
7
మరేమత్తూ అక్కర్లేదు 
ఆ నషాలను మించిన సరికొత్త సాంకేతిక నిషా రాణి
అన్ని చేతుల విచార వదనం
మాటల సంచారానికి సంకెలతో ఆ సెల్ ఫోన్ 
8
సామాన్యుని సమాచార నేస్తం పోస్టు కార్డు ఒకనాడు
అవసరానికి,అత్యవసరానికి,
వాడే ఫోన్ పిలుపే భాగ్యం 
ఈనాడు
సమాచార విప్లవం కళ్లలో 
సామాజిక విస్ఫోటనం గుండెల్లో
9
సరదాకు పిల్లలకూ వీడియో వ్యసనం
విచక్షణ కోల్పోతే పెద్దలకు ఇన్సోమ్నియా 
ఎఫ్ బి, వాట్సాప్,జిమేయిల్, ఇన్స్టాగ్రామ్,టెలిగ్రామ్,
తదితర సమస్త మెస్సింజర్స్ వాకిట్లోనే తిష్ట.
10
టూల్స్ అలిసినా స్థంభించినా 
పని దూరం నిద్ర భారం
ప్రక్కన మనిషిని పట్టించుకోలేని దుస్థితి
మానవీయత యాంత్రిక ఉచ్చులో బలి
11
మనిషనే వాడిని గుర్తించే కొల
చేతిలో ఈదే, చెవిలో ఊదే రాగమాల
పుట్టిన ప్రతి మనిషిలో
బతుకు నడిపే తొవ్వ
లింగ,వయసు బేధంలేదు
చరవాణి గుండె గొంతుకలోన
కరచాలనం
ఆట పాట సినిమా సీరియల్ గా 
నిను వీడని నీడ 
12
జాగరూకత లోపిస్తే వదలని పీడ
కరోనా,కరోనా ఎక్ దమ్ ఫోన్ అనేవాడికి 
చుక్కలు చూపే కరోనా కవాతు
అభివర్ణించలేని అనామిక మానసిక దౌర్బల్య సిండ్రోమ్ 
వర్ణ వర్ణింత అభిసారిక చికిత్సకందని మాహా వ్యాధి...
కామెంట్‌లు