ఉసిరికాయలు: - - యామిజాల జగదీశ్
 


ఉసిరికాయ‌లు మ‌న‌కు శీతాకాలంలో ఎక్కువ‌గా ల‌భిస్తాయి. స‌హ‌జంగానే ఈ సీజ‌న్‌లో చాలా మందికి ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం, శ్వాస కోశ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే ఆయా స‌మ‌స్య‌ల‌కు ఉసిరికాయ‌లు మ‌న‌కు చ‌క్క‌ని ప‌రిష్కారాన్ని చూపుతాయి. ఉసిరి కాయ‌ల వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.
ఉసిరి ఫిలాంథిసియా కుటుంబానికి చెందిన వృక్షం. ఉసిరికాయ శాస్త్రీయనామం ఫిలాంథస్‌ ఎంబ్లికా. ఉసిరి కాయను ఇంగ్లీషులో గూస్ బెర్రీ అని, హిందీలో ఆమ్ల అనీ, సంస్కృతంలో ఆమలక అనీ అంటారు. ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు. ముఖ్యంగా చ్యవన ప్రాశలో దీనిని వాడుతారు. మలబద్ధకానికి ఉసిరి కాయ దివ్యౌషధం. షాంపూలో కూడా ఉసిరి కాయను వాడతారు. ఉసిరి చెట్టు సుమారుగా 8 నుంచి 18 అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఈ చెట్టు ఆకులు చిన్నవిగా, ఆకుపచ్చ రంగులో ఉండి, కొమ్మలు విస్తరించి ఉంటాయి. దీని పువ్వులు పసుపు, ఆకుపచ్చ రంగుల సమ్మేళనంతో కూడి ఉంటాయి. దీని కాయలూ అదే రంగులో ఉంటాయి. ప్రతి కొమ్మకి అధిక సంఖ్యలో ఉసిరి కాయలు కాస్తాయి. వైద్యపరంగా ఎన్నో ఔషధగుణాలున్న వృక్షం. జుట్టు రాలడం, తెల్లబడటం, చుండ్రులాంటివి రాకుండా కాపాడుతుంది. తల భారాన్ని, తలపోటుని నిరోధించి, నెదడుకి చల్లదనాన్ని ఇచ్చే ఉసిరి కాయకు రక్తంలో హిమోగ్లోబిన్‌, ఎర్రరక్త కణాలను వృద్ధి చేసి, రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. గొంతు నొప్పి, దగ్గు ఉంటే ఒక టీస్పూన్‌ ఉసిరికాయ రసానికి, అర టీస్పూన్ తేనె, అర టీస్పూన్ అల్లం రసం కలిపి తాగాలి. చాలా తక్కువ సమయంలో ఉపశమనం కలుగుతుంది. రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించే ఔషధగుణాలు ఇందులో ఉన్నాయి. చక్కెరవ్యాధి ఉన్నవారు రోజూ ఉసిరికాయ జ్యూస్‌ను తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది.
ఉసిరిలో నీరూ, పీచుశాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ రెండూ జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. అంతేకాదు కడుపు ఉబ్బరం, అజీర్తిని కూడా అరికడ‌తాయి. అలాగే విటమిన్‌ సి అధికంగా ఉండే ఉసిరికాయ‌ల‌ను ఆహారంలో చేర్చుకుంటే, జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడకుండా ఉంటాయి. యాంటీయాక్సిడెంట్లూ, విటమిన్లూ సమృద్ధిగా ఉండే ఉసిరికాయను ప్రతీరోజూ ఆహారంలో తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకల‌ ఆరోగ్యానికి ఇందులోని కాల్షియం తోడ్పడుతుంది. హృద్రోగాలకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ శాతాన్ని పెంచడంలో ఉసిరికాయ‌లు కీలకంగా పని చేస్తాయి. అంతేకాదు, గుండెలోని రక్తనాళాల గోడలు దృఢంగా మారకుండా ఉసిరికాయ‌లు కాపాడుతాయి. దీంతో హృద్రోగాల బారిన ప‌డ‌కుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌చ్చు. ఉప్పు రుచి మినహా మిగిలిన ఐదు రుచులను కలిగి ఉన్న ఉసిరికాయలో రసాయనికంగా నారింజలోకంటే ఇరవై రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. కనుక సుగుణాల ఉసిరిని తరచూ తినడం ఆరోగ్యానికి మంచిది. 
కామెంట్‌లు