ఒకరోజు శ్రీకృష్ణుడు, అర్జునుడు కలిసి వెళ్తున్నారు. దారిలో అర్జునుడు ఒక వ్యక్తిని చూశాడు. ఆయన ఎండిపోయిన గడ్డిని తింటున్నాడు. ఆయన నడుముకు ఒక పదునైన కత్తి వేలాడుతోంది.
ఆయన్ను చూడగానే గొప్ప విష్ణుభక్తుడని అర్జునుడికి అర్థమైంది. ఆయన ఏ జీవికీ కీడు చేయడు. ప్రాణం ఉన్న పచ్చ గడ్డిని కూడా తుంచడు. అందుకే ఎండిపోయిన గడ్డిని మాత్రమే తింటున్నాడు.
అంత దయ గల వ్యక్తి నడుముకు కత్తి ఎందుకు పెట్టుకున్నాడో అర్జునుడికి అర్థం కాలేదు. మనసులో అనుమానం వచ్చింది.
అర్జునుడు కృష్ణుడిని అడిగాడు.
కృష్ణుడు నవ్వుతూ, "నువ్వే అతడిని అడిగి తెలుసుకో" అన్నాడు.
అర్జునుడు ఆ భక్తుడి దగ్గరకు వెళ్లాడు.
"స్వామీ! మీరు ఏ ప్రాణికీ హాని చేయరు కదా. మరి ఈ కత్తి ఎందుకు?" అని అడిగాడు.
ఆ భక్తుడు ఇలా సమాధానం చెప్పాడు:
"నలుగురు పాపులను శిక్షించడానికి ఈ కత్తి ఉంచాను!"
అర్జునుడు ఆశ్చర్యపోయాడు.
"ఆ నలుగురు ఎవరు?" అని అడిగాడు.
భక్తుడు చెప్పాడు :
"మొదటి తప్పు చేసినవాడు నారదుడు."
అర్జునుడు దిగ్భ్రాంతి చెందాడు.
"నారదుడా? ఆయన ఏం తప్పు చేశాడు?"
భక్తుడు అన్నాడు :
"ఆయన నా కృష్ణుడికి ఒక్క క్షణం కూడా విశ్రాంతి ఇవ్వడు. ఎప్పుడూ 'నారాయణ... నారాయణ...' అంటూ పాడుతుంటాడు. నా స్వామి నిద్రను పాడుచేస్తున్నాడు!"
"రెండో వ్యక్తి ద్రౌపది."
"ఆమె ఏం తప్పు చేసింది?"
"నా భగవంతుడు అన్నం తినే సమయంలో ఆమె పిలిచింది. పాండవులను కాపాడమని కోరింది. దాంతో ఆయన భోజనం వదిలేసి కామ్యక వనానికి పరిగెత్తాడు. ఆమె తిని వదిలేసిన విస్తరాకులోని అన్నాన్ని నా స్వామికి పెట్టింది. అంతటితో ఆగలేదు, భీష్ముడిని కలవడానికి వెళ్లేటప్పుడు నా కృష్ణుడి చేత మోయించింది!"
"మూడో వాడు ప్రహ్లాదుడు."
"ఆ చిన్నవాడు నా నరసింహుడిని మరుగుతున్న నూనెలోకి, మంటల్లోకి లాగాడు. వజ్రం లాంటి స్తంభాన్ని బద్దలు కొట్టుకుని వచ్చేలా చేశాడు!"
ఆ తర్వాత భక్తుడు ఇలా అన్నాడు :
"ఇక నాలుగో వాడు... మహాపాపి అర్జునుడు!"
అర్జునుడు కంగుతిన్నాడు.
"అతడు ఏం చేశాడు?"
భక్తుడు ఎంతో ఆవేదనతో చెప్పాడు:
"నా పరమాత్ముడిని తన రథానికి సారథిగా నిలబెట్టాడు. లోకాలను ఏలే పరమేశ్వరుడితో రథాన్ని నడిపిం చాడు. ఇది అతడు చేసిన అన్నిటికన్నా పెద్ద నేరం!"
ఈ మాటలు వినగానే అర్జునుడి గర్వం ఒక్క క్షణంలో కరిగిపోయింది.
"భగవంతుడిని ప్రేమించడం అంటే ఇది! ఆయనకు చిన్న కష్టం కూడా రాకూడదు అనుకునే హృదయమే నిజమైన భక్తి" అని అర్జునుడు తెలుసుకున్నాడు.
ఆ భక్తుడి పవిత్రమైన ప్రేమను చూసి, "నేనే గొప్ప భక్తుడిని" అనే అహాన్ని అర్జునుడు పూర్తిగా వదిలేశాడు.
భక్తి అంటే దేవుడిని ఏదో ఒకటి అడగడం కాదు... భగవంతుడికి ఒక చిన్న ఇబ్బంది కూడా కలగకూడదు అని తపించే హృదయమే నిజమైన భక్తి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి