సోయాకూర సోకులాడి: - డా.. కందేపి రాణీప్రసాద్
 

పిల్లలూ! ఈ సోకులాడిని ఎలా తయారు చేశానో తెలుసా! వంటింట్లో కూరలు వండుకునే కూరగాయలన్నింటిని వేసి తయారు చేశాను. కూరగాయలతో కూరలు వండకుండా అమ్మాయిల్ని వండుతున్నాను. నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు, బీన్స్, కాలిఫ్లవర్, కారట్, కరివేపాకు కొత్తిమీర సోయాకూర - ఇన్ని కూరగాయలతో అమ్మాయిని వండేశాను. సోయా ఆకుతో పప్పు వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని సోంపు ఆకు, డీల్ లీవ్స్ అని కూడా పిలుస్తారు. బాగా సువాసన కలిగి ఉంటుంది. దీన్ని తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుందని అంటారు. సోయా కూరతో పప్పు వండుకోవడమే కాదు ఫ్రైలు, పకోడీలు కూరలు కూడా చేస్తారు. బిరియానీలో వేస్తే మంచి వాసననిస్తూ నోరూరిస్తుంది ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పుష్కలంగా కలిగిన కూర. దీనిలో కాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కూరలలో వేసుకుంటే అద్భుతమైన రుచిని ఇస్తుంది.
నేను సోయా కూరతో అందమైన పావడాను కుట్టాను. పచ్చని ముఖం కోసం బాగా పండిన నిమ్మకాయను పెట్టాను. కళ్ళు, ముక్కు నోరులను స్కెచ్ పెన్ తో గీశాను. పొట్ట కోసం దొండకాయను పెట్టాను. చేతులకు పచ్చిమిరపకాయలను పెట్టాను. ఎవరైనా ఏమైనా అంటే కారంగా ఘాటుగా సమాధానం చెప్తుందని అలా పెట్టాను. జుట్టు కొప్పులను టీ పొడితో నల్లగా అద్దాను. ఈమె కూరగాయలమ్ముకునే మహిళ కాబట్టి నెత్తిమీద గంపను పెట్టాను. గంప కోసం బీన్స్ ను ఉపయోగించాను. గంపలో కూరగాయలు పెట్టాను. కాలి ఫ్లవర్, కారెట్లు కూరగాయలుగా పెట్టాను. చెవులకు కొత్తిమీర కాడల్ని వేలాడదీశాను. ఈ సోయా కూర సోకులాడి బాగుందా!
కామెంట్‌లు