అడుగుతాను (గజల్): - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


నీ జాడలు తెలిసేమో మేఘాలను అడుగుతాను,
నీ వార్తలు వినెనేమో తారకలను అడుగుతాను॥

వెన్నెలంత వెలుగునిచ్చే నీ రూపమెక్కడుందో,
నీ గురించిన సంగతికై కిరణాలను అడుగుతాను॥

అంతులేని నీలిమలో కనిపించక దాగినపుడు,
నీ దారిని చూపునేమో గాలులను అడుగుతాను॥

నీ స్పర్శను దాచుకున్న జ్ఞాపకాల జాడలకై,
మౌనంగా నిలిచియున్న వృక్షాలను అడుగుతాను॥

నీ నవ్వుల సుగంధాలు ఇంకెక్కడ విరిసాయో,
మధురంగా వికసించిన పుష్పాలను అడుగుతాను॥

నీ పలుకుల ప్రతిధ్వనులు వినిపించు వేళలో,
కొమ్మలపై కూయుచున్న కోయిలలను అడుగుతాను॥

నీ అడుగుల సవ్వడేదో అలలలో వినిపించగా,
తీరాలను తాకివచ్చే కెరటాలను అడుగుతాను॥

అన్నిచోట్ల ఉన్నావని ఆత్మసాక్షి చెబుతున్నా,
నిజమేదో చూపమంటూ బాటలను అడుగుతాను॥

కాలమెంత గడిచినా నీ ఆచూకి దొరకకున్న 
చిట్టచివర చేతులెత్తి దేవతలను అడుగుతాను॥

కామెంట్‌లు