కురుక్షేత్ర యుద్ధం ముగిసిన సమయం. ధృతరాష్ట్రుడు కృష్ణుడి దగ్గరకు వచ్చి, "కృష్ణా! నేను గ్రుడ్డివాడినైనా, విదురుడి మాటలు వింటూ ధర్మబద్ధంగానే పరిపాలన చేశాను. అలాంటప్పుడు ఒక్కరు కూడా మిగలకుండా నా వంద మంది బిడ్డలు చనిపోవడానికి కారణం ఏమిటి?" అని అడిగాడు.
అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, "నీకు ఒక కథ చెప్తాను. దానికి సమాధానం చెప్తే, నీ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది" అంటూ కథ చెప్పడం ప్రారంభించాడు.
ఒకానొక రాజ్యంలో నీతి తప్పకుండా పాలించే రాజు ఉండేవాడు. ఆయన వద్దకు ఒక పేదవాడు వంటవాడిగా చేరాడు. చాలా రుచిగా వండటం , రాజును ప్రత్యేకంగా చూసుకోవడం వల్ల అతడు త్వరగానే ప్రధాన వంటవాడిగా ఎదిగాడు.
రాజుకు ఏదైనా విభిన్నమైన రుచిని చూపించి బహుమతి పొందాలని ఆ వంటవాడికి ఒక విపరీతమైన ఆలోచన వచ్చింది. దాని ప్రకారం, రాజభవనంలోని కోనేరులో ఉన్న ఒక హంస పిల్లను రహస్యంగా పట్టుకుని, వండి రాజుకు వడ్డించాడు. తాను తినేది ఏమిటో తెలియకపోయినా, ఆ రుచికి ముగ్ధుడైన రాజు దాన్ని ఎంతో ఇష్టంగా తిన్నాడు. అంతేకాదు, తరచూ దాన్నే వండాలని ఆజ్ఞాపిస్తూ వంటవాడికి పెద్ద ఎత్తున బహుమతులు కూడా ఇచ్చాడు.
కథను ఇక్కడితో ఆపి, "ధృతరాష్ట్రా! ఇప్పుడు చెప్పు, ఆ రాజు, వంటవాడు.. వీరిద్దరిలో ఎక్కువ తప్పు చేసిన వారెవరు?" అని కృష్ణుడు అడిగాడు.
దానికి ధృతరాష్ట్రుడు ఆలోచించి, "వశిష్ఠుడికి వంటవాడు తనకు తెలియ కుండానే అతనికి మాంసాహారం వడ్డించాడు. అయినా వశిష్ఠుడు అతడికి శాపం ఇచ్చాడు. ఆ రాజుకు శాపం ఇచ్చాడు. ఆ జాగ్రత్త ఈ రాజుకు లేదు కదా! వంటవాడు డబ్బు, బహుమతుల ఆశతో తప్పు చేశాడు, కాబట్టి అతని తప్పు జరిగింది.
అప్పుడు కృష్ణుడు నవ్వి, "ధృతరాష్ట్రా! నువ్వు రాజువైనా సరే, తప్పకుండా రాజుదే తప్పు అని చెప్పావు. నీలో ఉన్న నీతి గుణమే నిన్ను భీష్ముడు, ద్రోణుడు వంటి పెద్దలు ఉన్న సభలో కూర్చోబెట్టింది. మంచి భార్యను, వంద మంది పిల్లలను ఇచ్చి మంచి జీవితాన్ని ప్రసాదించింది.
కానీ, నేను చెప్పిన కథ మరెవరిదో కాదు.. నీ గురించే! పోయిన జన్మలో నువ్వే ఆ రాజువు. నీ నిర్లక్ష్యం వల్ల వంద హంస పిల్లలను ఆహారంగా తిన్నావు. ఆ పిల్లలు, వారి తల్లి ఎంతటి వేదనను అనుభవించాయో.. ఇప్పుడు నీ వంద మంది బిడ్డలను కోల్పోయి నువ్వు తెలుసుకుంటున్నావు.
అంతేకాదు, రోజూ తింటున్నా నీకు శాకాహారానికి, మాంసాహారానికి మధ్య తేడా తెలియలేదు. అలాంటప్పుడు నీకు కళ్ళు ఎందుకు? అందుకే ఈ జన్మలో గ్రుడ్డివాడివి అయ్యావు. దేవుడి సన్నిధిలో ఎప్పుడూ న్యాయం తప్పదు. ఎవరి కర్మలకు తగినట్లు వారి జీవితం ఉంటుంది!" అన్నాడు.
తన కర్మలే తనను చుట్టుముట్టాయని గ్రహించిన ధృతరాష్ట్రుడు నోట మాట రాక నిశ్చేష్టుడయ్యాడు.
గమనిక: మనం చేసే తప్పులు మన పిల్లలను కూడా చుట్టుముడతాయనే నిజాన్ని గుర్తుంచుకుందాం. మంచిదే ఆలోచిద్దాం, మంచిదే చేద్దాం!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి