శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ :- - 158
 

వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
136. నిత్యా (త్ర్యక్షరీ)
137. నిరాకారా (త్ర్యక్షరీ)
నూట ముప్పైఏడవ నామ మంత్రము:
ఓం నిరాకారాయై నమః
నిరాకారా = ఏ ఆకారమూ లేనిది.
సహస్రదళ పద్మము మధ్యలో, త్రికోణం మధ్యలో, బిందువు రూపంలో ఉన్న పరమేశ్వరి, ఏ ఆకారమూ లేనిదిగా కనిపుస్తూవుంటే చూసిన వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "నిరాకారా" అని కీర్తించారు. ఏ ఆకారమూ లేకపోయినా, అన్నింటా తానై ఉన్న పరమేశ్వరికి నమస్కారము.
సగుణ రూపము, పాంచభాతికమూ, కల్పితమూనూ. ఇది శాశ్వతముగా నిలిచి ఉండేది కాదు. జగన్మాత అయిన కాత్యాయిని, బ్రహ్మదేవుడు కాదు, రాక్షసుడు కాదు. స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కూడా కాదు. గాలి, నీరు మొదలైన పంచభూతాలు కాదు. సత్తు, అసత్తు కూడా కాదు. ఇలా చూస్తే, ఈ చరాచర జగత్తులో చర్మ చక్షువులకు కనిపించేది ఏదీ కూడా, పరమేశ్వరి కాదు. కానీ, అన్నింటా తానై ఉన్నది పరమేశ్వరి. ఈ అన్నింటా ఉన్న శ్రీమహారాజ్ఞి కంటికి కనిపించదు. అందుకనే, శ్రీమాత ను "నిరాకారా" అన్నారు వశిన్యాది వాగ్దేవతలు.
అమ్మని "నిరాకారా" అని పిలిచి, నేను నిన్ను దుర్గుణాలను తొలగించే "దుర్గ" గా చూడాలి అంటే దుర్గగా కనిపిస్తుంది. ప్రహ్లాద జనకుడు, హిరణ్యకశిపుడు స్థంభం లో చూడాలి అంటే, నృసింహుడుగా కనిపించింది. మార్కండేయుడిని, యమధర్మరాజు తీసుకు వెళ్తానంటే, పరమశివునిగా వచ్చి రక్షించింది. ఇలా మనం కోరిన రూపంలో కనిపించి, మోక్ష మార్గములో నడిపించే అమ్మకు, ఒక రూపం ఏమిటి, ఏ రూపమైనా ఆమే కదా, అమ్మే కదా!!. అందువల్లనే "నిరాకారా" అయ్యింది, చాముండేశ్వరి.
మానవ జన్మలో స్త్రీ మూర్తి, ముందుగా ముద్దులోలికే కూతురు, యుక్త వయస్సులో నెచ్చెలి. ప్రౌఢగా మగనాలి. బిడ్డలకు తల్లి. కోడలికి అత్తగారు. ఈ అవతారలలో ఉన్నది, "ఒకే స్త్రీ" కదా! మానవమాత్రృరాలు ఇంత చెయగలిగితే, సృష్టికారిణి "నిరాకారా " అవడం సహజమే కదా!
తారకాసురుని సంహరించడానికి, దేవతలు అమ్మ సహాయం కోరినప్పుడు, శ్రీమాత కోటి సూర్యుల కాంతితో "కాతిపుంజము" గా కనిపించింది. ఏ రూపమూ లేదు. అందుకనే శ్రీమాతను, "ఉద్యద్భానుసహస్రాభా" అన్నాము. సన్నటి మెరుపు తీగ లాగా అద్భుతమైన కాంతితో తళుక్కున మెరిసింది కనుక, "తటిల్లతాసమరుచీ" అని కూడా పిలుచుకున్నాము. కనుకనే, పరాత్పరి "నిరాకారా".
అన్నింటా తానై ఉన్న పరమేశ్వరియైన తనను "నిరాకారా" గా తెలుసుకుని, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం నిరాకారాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు