వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
139. నిర్గుణా (త్ర్యక్క్షరీ)
140. నిష్కలా (త్ర్యక్క్షరీ)
నూట నలభైయవ నామ మంత్రము:
ఓం నిష్కలాయై నమః
సహస్రదళ పద్మము మధ్యలో, త్రికోణము మధ్యలో, బిందు రూపంలో ఉన్న స్వామివారిని కూడిన పరమేశ్వరి, ఏ అవయవములు లేకుండా దర్శనం ఇచ్చింది. అప్పుడు శ్రీమాతను చూసిన వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "నిష్కలా"అని కీర్తించారు. అవయవములు లేనిది అయినా జగజ్జనని సాధకులను అక్కున చేర్చుకుని అనుగ్హిస్తున్న చిదగ్నికుండసంభూతకు నమస్కారము.
ఏ విధమైన నిర్ధిష్ట రూపం లేని జగన్మాతకు అంగములు ఉండవు కదా!. ఎందుకంటే, కాండము నిలబడినప్పుడే, చెట్టుకు, కొమ్మలు, వాటికి ఆకులు, పూవులు, పండ్లు ఉంటాయి. శ్రీమాత నిరాకార కదా! కాబట్టి, చేతులు, కాళ్ళు, తల, మొండెము మొదలైన శరీర భాగాలు ఉండవు. అందువల్లనే, కాత్యాయనీ పరదేవత "నిష్కలా" అయ్యింది.
కలా అంటే అంశము, భాగము, అంగము అనే అర్థాలు ఉన్నాయి. శరీరము లోని భాగాలను అంగములు అంటాము. ఈ శరీర భాగాలు, సశరీరంగా ఉన్న జీవాత్మలకే ఉంటాయి. అమ్మ, శుద్ధమైన బ్రహ్మ స్వరూపిణి. చైతన్య స్వరూపురాలు. బ్రహ్మ పదార్ధానికి, చైతన్య శక్తికీ రూపము లేదు. కనుకనే పరాత్పరి "నిష్కలా" అని పిలువబడింది.
ధ్యానములో దృష్టి నిలిపవలసింది, శక్తి మీదనే. ఈ శక్తి నిరాధారము, నిరాశ్రయ అయినది. భాస్కర రాయలవారు ఇలా అన్నారు.....
ధ్యానం యా నిష్కలా చింతా నిరాధారా నిరాశ్రయా |
న తు ధ్యానం శరీరస్య ముఖహస్తాది కల్పనే ||
పరబ్రహ్మము నుండి వచ్చిన జీవసముదాయానికి అవయవములు ఉన్నాయి. కానీ, పరబ్రహ్మ అవయవరహితము. అలాగే, చిచ్ఛక్తి, ఆత్మ కూడా అవయవరహితలే అని దక్షిణామూర్తి అనుగ్రహంతో తెలుసుకుని, "నిష్కలా" అయిన తనను చేరాలని తపించే, పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం నిష్కలాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి