శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ :- - 166
 

వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
144. నిత్యముక్తా (చతురక్క్షరీ)
145. నిర్వికారా (చతురక్క్షరీ)
నూట నలభైఐదవ నామ మంత్రము:
ఓం నిర్వికారాయై నమః
నిర్వికారా = మహదాది 23 వికారములకూ అతీతమైనది
ఏ వికారము చేతనూ మార్పుకు లోను కానిది తానేనని తెలుపుతూ, ప్రకటితమైన పరాత్పరిని చూసి వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "నిర్వికారా" అని కీర్తించారు. తాను ఏ వికారములు చెందకుండా, మనలోని వికారములను దూరం చేయగల శ్రీమహారాజ్ఞి అయిన జగన్మాతకు నమస్కారము.
ఏ వికారములు కలగాలన్నా / ఉండాలన్నా భౌతికమైన శరీరధారణ జరగాలి. అంటే, పాంచభౌతిక శరీరానికే వికారాలు ఉంటాయి. కలుగుతాయి. కానీ, పరమేశ్వరి నిరాధారా, నిరంజన, నిర్లేపా, నిర్మలా, నిత్యా మరియు నిరాకార కదా! పరబ్రహ్మ తత్వం కూడా కదా!! అందువల్లనే అమ్మ "నిర్వికారా" అయ్యింది.
పాంచభౌతిక శరీరము లో మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు, పంచప్రాణాలు, పంచేంద్రియాలు అనే సప్త తత్వాలు ఉంటాయి. వీటి కారణంగానే, అన్ని వికారాలు జీవునికి కలుగుతుంటాయి, నిద్రాణంగా ఉన్న జ్ఞానం కారణంగా. ఇక్కడ చెప్పబడిన సప్త తత్వాలు, నిరాకారా, నిర్లేప అయిన శ్రీమాతకు ఆపాదించలేము. కనుకనే, పరాత్పరి "నిర్వికారా" అనబడింది.
తన సృష్టి లోని సకల జీవాలకు తానే ఆత్మ రూపంలో ఉన్న పరమేశ్వరి కి, బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్య దశలు లేవు. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు శరీరము లతో వచ్చే వికారములు కూడా జగన్మాత కు అంటవు. కానీ, తామరాకు మీద నీటి బిందువు లాగా, తన సృష్టి లోని జీవులకు అంటిన ఈ వికారములను అన్నింటినీ తన అనుగ్రహంతో తొలగించివేస్తుంది, శ్రీమాత.
ప్రతీ సాధకుడూ కూడా, పరమగురువు యొక్క దివ్య ఉపదేశముతో, తనలో ఉన్న అన్ని, అవలక్షణాలను / వికారాలనూ పోగొట్టగలిగేది, ఈ చరాచర జగత్తుకు జీవం, ఆధారం అయిన శ్రీమాతయే, అని తెలుసుకుని, తనను, అఖిలాండేశ్వరి, ని పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం నిర్వికారాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు