కష్టం - అదృష్టం : - కె.భవాని - తొమ్మిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్-మెదక్ జిల్లా-79892 52235
    

 అనగనగా రాజంపేట అనే ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో రాజు, రవి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరూ ఒకే పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. అయితే ఇద్దరి స్వభావాలు మాత్రం పూర్తిగా వేరువేరు.
                 రాజు ఎంతో బుద్ధిమంతుడు. సమయాన్ని వృధా చేయకుండా రాత్రింబవళ్లు కష్టపడి చదువుకునేవాడు. కానీ రవి మాత్రం చాలా సోమరిపోతూ, పుస్తకం ముట్టకుండా ఎప్పుడు ఆటలాడుతూ తిరిగేవాడు. 
              కొన్ని రోజులకు పదో తరగతి వార్షిక పరీక్షలు దగ్గర పడ్డాయి. రాజు మరింత కష్టపడి, ప్రతి విషయాన్ని శ్రద్ధగా చదువుకుంటూ పరీక్షలకు సిద్ధమయ్యాడు. రవి మాత్రం ఏ మాత్రం చదవలేదు. "నేనెందుకు కష్టపడాలి? పరీక్ష రోజు దేవుడికి దండం పెట్టుకుంటే ఆయనే నన్ను పాస్ చేయిస్తాడు" అని బద్ధకంగా అనుకున్నాడు. 
                 పరీక్ష రోజు రానే వచ్చింది. రాజు తాను చదువుకున్నవన్నీ గుర్తుతెచ్చుకుంటూ పరీక్షలు చాలా బాగా రాశాడు. రవి మాత్రం పరీక్ష హాల్లో కూర్చొని, ప్రశ్నలు అర్థం కాక దేవుడికి మొక్కుతూ కూర్చున్నాడు. దేవుడు వచ్చి రాస్తాడని అనుకున్నా రవికి నిరాశే ఎదురయింది.  కొద్ది రోజులలోనే పరీక్షల ఫలితాలు వచ్చాయి. రాజు గ్రామంలోనే అందరికంటే ఎక్కువ మార్కులతో మొదటి స్థానంలో మార్కులు పొందాడు. 
              ఊరివానంత రాజును ఎంతో మెచ్చుకున్నారు. కానీ రవి మాత్రం ఫెయిల్ అయ్యాడు. రవి ఏడుస్తూ దేవుని గదికి వెళ్లి, " నేను నిన్నే నమ్ముకున్నాను కదా, నన్ను ఎందుకు ఫెయిల్ చేశావు? " అని అడిగాడు. అప్పుడు తండ్రి రవి దగ్గరకు వచ్చి, " రవి దేవుడు మనకు తెలివితేటలను ఇచ్చాడు. వాటితోకష్టపడాలి కానీ, శ్రమ పడకుండా దేవుడికి మొక్కితే ఫలితం ఉండదు. కష్టపడే వారికే దేవుడు కూడా సహాయం చేస్తాడు " అని సర్ది చెప్పాడు. తండ్రి మాటలతో రవికి కష్టం విలువ తెలిసింది. తన సోమరితనాన్ని వదిలేసి, మరుసటి సంవత్సరం అన్నయ్య లాగే కష్టపడి చదివి మంచి మార్కులతో పాస్ అయ్యాడు. 
 నీతి : భగవంతుడు మనకు తెలివితేటలు, శక్తిని ఇచ్చాడు. వాటితో మనం కష్టపడాలి కానీ శ్రమ పడకుండా కేవలం దేవుడిపైనే భారం వేయకూడదు.


కామెంట్‌లు