తొందరపాటు తప్పు:- వై. గగనశ్రీ 8వ తరగతి, ప్రాథమికోన్నత పాఠశాల అంబం, ఎడపల్లి, జిల్లా: నిజామాబాద్.


 అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రవి అనే ఒక రైతు ఉండేవాడు. రవి చాలా కష్టపడే మనిషి. అతనికి పెద్దగా పొలాలు లేవు. కానీ అతని ఇంటి పక్కనే ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు చాలా తీయని పండ్లు ఇస్తుండేది.
ప్రతి సీజన్ వచ్చినప్పుడు రవి ఆ చెట్టుపై కాసిన పండ్లను జాగ్రత్తగా కోసి బజారుకు తీసుకెళ్లేవాడు. బజార్లో ఆ పండ్లకు మంచి ధర వచ్చేది. ఆ డబ్బుతో ఇంట్లో సరుకులు కొనేవాడు, పిల్లల ఖర్చులు చూసుకునేవాడు. రవికి ఆ చెట్టంటే చాలా ఇష్టం.
అలా రోజులు బాగా గడుస్తుండగా ఒక రోజు రవి ఆ చెట్టును గమనించాడు. ఆకులు వాడిపోతున్నాయి. కొమ్మలు ఎండిపోయినట్టు కనిపించాయి. ఏమయ్యిందో ఈ చెట్టుకు?అని రవి అనుకున్నాడు. నీళ్లు సరిగా పోయలేదేమో అని భావించి రోజూ 
ఉదయం, సాయంత్రం నీళ్లు పోశాడు. అయినా రెండు మÖడు రోజులు గడిచినా చెట్టు బాగుపడలేదు. ఇంకా మాడిపోతున్నట్టే కనిపించింది. ఇది చూసి రవికి కోపం వచ్చింది. ఇన్నాళ్లు నేను కంటికి రెప్పలా కాపాడుకున్న చెట్టు ఇదేనా? ఇప్పుడు ఇలా ఎందుకు అవుతుంది అని మనసులో అనుకున్నాడు.
ఒక రోజు రవి ఇక ఈ చెట్టుతో ఉపయోగం లేదు. నరికేసి కట్టెలు చేసేస్తాను అని అనుకుని గొడ్డలి కూడా తీసుకొచ్చాడు.
అదే సమయంలో ఆ దారిలో నుంచి గోపి అనే వ్యక్తి వెళ్తున్నాడు. గోపి ఆ చెట్టును చూసి ఆగాడు. రవి, ఈ చెట్టును ఎందుకు నరికేస్తున్నావు? అని అడిగాడు.రవి కోపంగా, ఇది మాడిపోయింది. పండ్లు కాయడం లేదు. నాకిప్పుడు పనికిరాదు” అన్నాడు.
గోపి కొంచెం ఆలోచించి, నువ్వు ఈ చెట్టును నాకు అమ్ముతావా? అని అడిగాడు. ఇది విని రవి మనసులో నవ్వుకున్నాడు.
ఇతను నిజంగానే పిచ్చివాడేమో. మాడిపోయిన చెట్టును ఎవరు కొంటారు? అని అనుకున్నాడు. బయటకు మాత్రం, సరే, రెండు వేల రూపాయలు ఇవ్వు. చెట్టును తీసుకెళ్లు అన్నాడు. గోపి ఒక్క మాట కూడా అనకుండా రవికి రెండు వేల రూపాయలు ఇచ్చాడు. మనుష్యులను పిలిపించి చెట్టును పెకిలించుకొని తన పొలానికి తీసుకెళ్లాడు.
రవి డబ్బు చూసుకుని సంతోషపడ్డాడు. పనికిరాని చెట్టుకు రెండు వేల రూపాయలు వచ్చాయి అని అనుకుని ఇంటికి వెళ్లిపోయాడు. గోపి మాత్రం ఆ చెట్టును చాలా శ్రద్ధగా చూసుకున్నాడు. రోజూ నీళ్లు పోశాడు. చెట్టు చుట్టూ ఉన్న మట్టిని సరిచేశాడు. మంచి ఎరువు వేసాడు. చెట్టుతో మాట్లాడినట్టే ఉండేవాడు. కొన్ని రోజులకు చెట్టులో చిన్న చిన్న ఆకులు వచ్చాయి. గోపి చాలా ఆనందించాడు. 
కొన్ని నెలల తర్వాత ఆ చెట్టు పూర్తిగా పచ్చగా మారింది. తరువాత కొంత కాలానికి ఆ చెట్టుకు బాగా పూత, పండ్లు కాసినవి. ఆ పండ్లు చాలా రుచిగా ఉండేవి. బజార్లో మంచి ధరకు అమ్ముడయ్యాయి. గోపి క్రమంగా డబ్బులు సంపాదించాడు. ఇల్లు బాగు చేసుకున్నాడు. పిల్లలను బాగా చదివించాడు. ఇదంతా చూసిన రవికి తన తప్పు అర్థమైంది. నేను ఓర్పుగా చూసుకోలేకపోయాను. తొందరపడి నిర్ణయం తీసుకున్నాను అని బాధపడ్డాడు.
అప్పటి నుంచి రవి ఏ పని చేసినా ఓర్పుగా ఆలోచించి చేయడం నేర్చుకున్నాడు.
నీతి:-ఓర్పు, శ్రద్ధ, విశ్వాసంతో చేసిన ప్రయత్నం ఎప్పటికైనా ఫలిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని తెస్తాయి.
కామెంట్‌లు