అక్కచెల్లెళ్ల మధ్య అసూయ:: -మెరుగు సుచిప్రియ, 8వ తరగతి, ప్రాథమికోన్నత పాఠశాల అంబం (వై), ఎడపల్లి, జిల్లా: నిజామాబాద్.
  

అనగానగా సూర్యాపేట అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక రైతు కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉండేవారు. పెద్ద అక్క పేరు శశి, చిన్న చెల్లెలు పేరు రిషి. శశి, రిషి ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. కానీ వాళ్లిద్దరికీ ఎప్పుడూ ఒకరంటే ఒకరికి ఓపిక ఉండేది కాదు. చిన్న విషయం జరిగినా వెంటనే గొడవ పడేవారు. ఎవరి పని బాగుంటే, మరొకరు చూసి ఓర్చుకోలేకపోయేవారు. ఇలా రోజూ గొడవలు పడుతుండటంతో వాళ్ల అమ్మానాన్నలు చాలా బాధపడేవారు. ఇలా ఉంటే ఇంట్లో శాంతి ఉండదు. పెళ్లి చేస్తే అయినా మారతారేమో అని అనుకుని, ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. కొన్ని రోజులకు ఇద్దరు అబ్బాయిలు శశి, రిషిలను చూడడానికి వచ్చారు. పెద్ద అబ్బాయికి శశి నచ్చింది. చిన్న అబ్బాయికి రిషి నచ్చింది. పెద్దలంతా కలిసి మాట్లాడుకుని, ఇద్దరి పెళ్లిళ్లు ఒకే నెలలో ఘనంగా చేశారు.
పెళ్లి అయిపోయిన తర్వాత శశి తన భర్తతో కలిసి అత్తగారింటికి వెళ్లింది. రిషి కూడా తన భర్తతో కలిసి అత్తగారింటికి వెళ్లింది. మొదట్లో ఇద్దరూ బాగానే ఉన్నారు. కానీ మనసులో ఉన్న పాత అసూయ మాత్రం పోలేదు.
కొన్ని రోజుల తర్వాత సంక్రాంతి పండుగ వచ్చింది. వాళ్ల అమ్మానాన్నలు ఇద్దరికీ ఫోన్ చేసి, పండుగకు తప్పకుండా ఇంటికి రండి అని చెప్పారు. శశి, రిషి తమ తమ భర్తలతో కలిసి పుట్టింటికి వచ్చారు. పండుగ కావడంతో ఇంట్లో సందడి, సందడిగా ఉంది. కానీ శశి మాత్రం రిషితో సరిగా మాట్లాడలేదు. ఏదైనా మాట అన్నా వంకరగా మాట్లాడేది. అది చూసిన రిషి, అక్కా, పెళ్లయ్యాక అయినా నువ్వు మారతావనుకున్నాను. కానీ ఇంకా అలాగే 
ఉన్నావే” అని చెప్పింది. వాళ్ల అమ్మ వెంటనే, చాలు! పండుగ రోజు గొడవలు వద్దు అని మందలించింది. 
మరుసటి రోజు తెల్లవారుజామునే రిషి లేచింది. తలస్నానం చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసింది. పూలు, చుక్కలు పెట్టి చాలా అందంగా వేసింది. పక్కింటి వాల్లు కూడా ఆగి చూసారు. కానీ శశి ఇంకా నిద్రలోనే ఉంది. అది చూసిన శశి భర్తకు కోపం వచ్చింది. నీ చెల్లెలు ఎంత తెలివిగా ఉంది చూడు. లేచి పనులు అన్నీ చేసింది. నువ్వు మాత్రం ఇంకా లేవలేదు అని అన్నాడు. ఆ మాటలు శశి మనసుకు బాగా తగిలాయి. నా చెల్లెలు కన్నా నేనే గొప్పగా ఉండాలి అని అనుకుంది. వెంటనే లేచి ముగ్గులు వేయడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి శశి ముగ్గులు వేసింది. కానీ రిషి వేసిన ముగ్గు మాత్రం ఇంకా బాగుంది. అది చూసి శశికి కోపం కట్టలు తెంచుకుంది. రిషిని పిలిచి, నిన్ను నాన్నగారు పిలుస్తున్నారు అని అబద్ధం చెప్పింది. రిషి నమ్మి ఇంట్లోకి వెళ్లింది. అవకాశం చూసుకుని శశి రిషి వేసిన ముగ్గును కాలితో చెరిపేసింది. కొద్దిసేపటికి రిషి బయటికి వచ్చి ముగ్గు చెరిగిపోయిందని చూసింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అక్కా, నువ్వే ఇలా చేసావా? అని బాధగా అడిగింది. అప్పుడే వాళ్ల అమ్మానాన్నలు వచ్చారు. విషయం తెలిసి శశిని బాగా మందలించారు. అసూయతో ఇలా చేస్తే ఎవరికీ మంచిది కాదు అని చెప్పారు.
శశికి తన తప్పు అర్థమైంది. రిషి దగ్గరకు వచ్చి, చెల్లి, నన్ను క్షమించు. ఇక మీదట ఇలా చేయను అని చెప్పింది. అప్పటి నుంచి ఇద్దరూ కలిసిమెలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.
నీతి: అసూయ, అహంకారం మనల్ని తప్పు మార్గంలో నడిపిస్తాయి. ప్రేమగా, సహనంగా ఉంటేనే కుటుంబంలో ఆనందం 
ఉంటుంది.
కామెంట్‌లు