జపాన్ లోని ఒక ఊరిలో ఒక ముసలాయన, ముసలామె ఉన్నారు. ఇద్దరూ చిన్న గొడవలు కూడా లేకుండా హాయిగా కలసిమెలసి ఉండేవాళ్లు. వాళ్లది ఒకటే మాట ఒకటే బాట. కానీ వాళ్లకు పిల్లలు లేరు. ఎంతోమంది దేవుళ్లకు మొక్కుకున్నారు, ఎన్నో గుడులు గోపురాలు తిరిగారు, సంపాదించిందంతా మంచి పనులకు ఖర్చు చేశారు... కానీ పిల్లలు మాత్రం పుట్టలేదు. "సరే... దేవునికి మన మీద దయ లేదు ఏం చేద్దాం" అనుకొని తమ పనిలో తాము మునిగిపోయారు.
ఒకసారి ఆ ముసలామె బట్టలమూట తీసుకొని ఉతుక్కోడానికి ఊరి బయట వున్న ఒక నదికి పోయింది. బట్టలు ఉతుకుతా వుంటే దూరంగా నదిలో ఒక పెద్ద పండు కొట్టుకొని వస్తూ కనపడింది. పక్కనే వున్న ఒక కట్టె తీసుకొని ఆ పండును నెమ్మదిగా బయటికి లాగింది. అది చాలా చాలా పెద్దగా ఉంది. అంత పెద్ద పండును ఆమె చూడడం అదే మొదటిసారి. జాగ్రత్తగా దాన్ని బుట్టలో పెట్టుకొని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటా ఇంటికి చేరుకుంది.
ఇంటి వద్ద ముసలాయన లేడు. పశువులకు గడ్డి కోసం పక్కనే వున్న కొండమీదకు పోయాడు. ఆమె ముసలాయన ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురుచూడసాగింది. ముసలాయన పెద్ద గడ్డిమోపు కోసుకొని సాయంకాలం ఇంటికి రాగానే ఎదురొచ్చి "నీకు ఒక వింతైన బహుమతి తీసుకొచ్చా తెలుసా" అంది సంబరంగా. ఆ ముసలాయన "ఏముందబ్బా" అని ఆలోచించుకుంటా ఇంటిలోకి పోయి ఆ పెద్ద పుచ్చకాయను చూసి ఆశ్చర్యపోయాడు. "అబ్బ... ఎంత లావుగుందీ పండు. రెండు రోజులు కమ్మగా కడుపునిండా కోసుకొని తినొచ్చు" అన్నాడు. ఇద్దరూ ఆ పండును శుభ్రంగా కడిగి నెమ్మదిగా మధ్యకు కోశారు.
అలా కోసి చూస్తే ఇంకేముంది... పండు మధ్యలో ఎర్రని కండ బదులు చిరునవ్వులు నవ్వుతా వున్న చిన్న పిల్లోడు కనపడ్డాడు. ఆ పిల్లోన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. వాళ్లకు పిల్లలు లేరు కదా... దాంతో ఆ దేవుడే స్వర్గం నుండి ఈ పిల్లోడిని తమకు కానుకగా పంపించాడు అనుకొని సంబరంతో మురిసిపోయారు. వాళ్లు ఆ పిల్లోనికి "పుచ్చకాయ పిల్లోడు" అని పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకోసాగారు.
ఆ పిల్లోడు నెమ్మదిగా పెరిగి పెద్దగ కాసాగాడు. వానికి ఐదు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆ ముసలాయన కట్టెల కోసం ఇంటి ముందున్న ఎండిపోయిన చెట్టు నరకడానికి కష్టపడతావుంటే ఆ పిల్లోడు వచ్చి గొడ్డలి తీసుకుని ఒక్క వేటుతో ఆ చెట్టును నరికివేశాడు. పది నిమిషాల్లో దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి ముసలాయన ముందు పెట్టాడు. అదిచూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత చిన్నప్పుడే వీనికి ఇంత బలం ఉందంటే వీడు పెద్దదైనాక కొండల్ని కూడా పిండి కొట్టగలడు అనుకున్నారు వాళ్ళు. అనుకున్నట్లే ఆ పిల్లోడు రోజురోజుకీ మరింత బలంగా తయారు కాసాగాడు. దాంతో వానికి కర్రసాము, గుర్రం స్వారీ, కత్తి విద్య అన్నీ నేర్పించసాగారు.
చిరుత పులి లాగా వేగంగా సర్రున దూసుకుపోవడం, కోతి లాగా చలాకీగా గబగబా చెట్లు ఎక్కడం, ఏనుగు లాగా బరువైన వస్తువులను అవలీలగా పైకి ఎత్తడం చేసేవాడు. వాని శక్తి చూసి ఊర్లో అందరూ "నీలాంటోన్ని ఇంతకుముందు ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. ఇదే మొదటిసారి. నువ్వు మామూలోనివి కాదురా... ఏదో ఒకరోజు ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని పని చేస్తావు" అని మెచ్చుకునేవారు.
ఆ ఊరికి ఈశాన్య దిశలో ఒక పెద్ద సముద్రం ఉంది. అందులో ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో ఒక పెద్ద గజదొంగ ఉన్నాడు. వాడు మామూలోడు కాదు. చుట్టుపక్కల గ్రామాల మీద దాడి చేసి అక్కడి సంపదలన్నీ దోచుకొని ఆ దీవికి తరలించేవాడు. వాని పేరు చెబితే చాలు పాలు తాగే పసిపిల్లల నుంచి కాటికి కాళ్లు చాపుకున్న పండు ముసలోళ్ల వరకు అందరూ భయంతో వణికి పోతారు. ఎప్పుడు.. ఎక్కడ... ఎలా దాడి చేస్తాడో తెలియదు. ఎవరిని చంపుతాడో తెలియదు. అందుకే అందరూ ఆ ద్వీపాన్ని 'దయ్యాల ద్వీపం' అని పిలుచుకునేవాళ్ళు. పొరపాటున కూడా ఆ ద్వీపం వైపు ఎవరూ పోయేవాళ్ళు కాదు. పోయినా బ్రతికి వచ్చేవాళ్ళు కాదు.
ఆ పుచ్చకాయ పిల్లోనికి ఆ ద్వీపం గురించి తెలిసింది. దొంగలు దోచుకొచ్చిన సొమ్మంతా ఆ ద్వీపంలోనే వుంది కదా... ఆ సంపదను గనుక తిరిగి తీసుకొని వస్తే తమ ఊరు మొత్తం బాగుపడుతుంది అనుకున్నాడు. అంతేకాకుండా ఆ దొంగల పీడ కూడా శాశ్వతంగా తొలగించి, పదిమందికి మేలు చేయాలి అనుకున్నాడు.
దాంతో ఒకరోజు వాళ్ళ అమ్మానాన్నల దగ్గరికి పోయి "అమ్మా... నన్ను ఆశీర్వదించు. కళ్ళముందు జనాల్ని ఇలా దోచుకుంటా వుంటే చూడలేకుంటున్నా... ఇంత బలం వుండి ఏం లాభం. తుప్పు పట్టిన కత్తిలాగా, పంజా ఎత్తని సిం హం లాగా నేను బతకలేను. ఇప్పుడేపోయి ఆ దొంగల్ని పట్టి ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఎదుర్కొంటున్న సమస్యను తొలగించడమే కాక అక్కడి సంపదలని తెచ్చి ఊరంతా బాగు చేస్తా" అన్నాడు.
ఆమెకు ఆ పిల్లోని బలం తెలుసు కదా... దాంతో "అలాగే నాయనా... ఆ దయ్యాల ద్వీపం వైపు ఎవరూ కన్నెత్తి చూడరు. పన్నెత్తి మాట్లాడరు. ఢీకొట్టబోయేది ఎలాంటి వాడినో తెలుసు కదా... రాక్షసుని లాంటి దొంగల రాజుని. జాగ్రత్తగా వెళ్ళు. విజయంతో తిరిగి రా. ఆకాశలో చందమామలా నీ కీర్తి ఎప్పటికీ నిలిచి వుంటుంది" అంది.
పోయేముందు దారిలో ఆకలేస్తే తినడానికి ఆ ముసలామె తీయని నేతి గారెలు ఒక సంచీ నిండా చేసి ఇచ్చింది. అవన్నీ మూటగట్టుకుని ఆ యువకుడు బయలుదేరాడు. అట్లా పోతావుంటే దారిలో ఒక పెద్ద కుక్క ఎదురొచ్చింది. చూడ్డానికి ఆది చాలా భయంకరంగా వుంది. దెబ్బకు పదిమందినైనా సరే అవలీలగా చంపగలదు. సింహాన్ని కూడా ఎదిరించి నిలబెట్టగలదు. అటువంటి కుక్క ఆ యువకునికి ఎదురొచ్చి "ఓ పుచ్చకాయ పిల్లోడా... ఎక్కడికి ఈ అడవిలో ఒంటరిగా పోతావున్నావ్. ఆ మూటలో ఏముంది... కమ్మని వాసనకు మనసు లాగేస్తావుంది" అంది. దానికి వాడు నవ్వి "ఇవి మా అమ్మ చేసిన తియ్యని నేతి గారెలు. దయ్యాల ద్వీపానికి పోతావుంటే దారిలో తినడానికని ఇచ్చింది" అన్నాడు. ఆ కుక్క గారెల మూట వంక ఆశగా చూస్తూ "మిత్రమా... నాకు గనక కమ్మని గారెలు ఒక పది కడుపునిండా పెడితే నీ వెంబడే వచ్చి ఆ గజదొంగను పట్టుకోవడంలో సాయం చేస్తా. ఏం సరేనా" అంది. యువకుడు 'సరే' అంటూ ఓ పది గారెలు తీసి దాని ముందు పెట్టాడు. అది నాలుక చప్పరిస్తా ఒక్కొక్కటే తిని వానితో కలసి బయలుదేరింది.
అట్లా కొంతదూరం పోయేసరికి ఒక కోతి చెట్టుకొమ్మల మీద నుంచి చకచకా ఎగురుకుంటూ వాని ముందుకు దూకింది. అది వానితో "ఓ పుచ్చకాయ పిల్లోడా... ఈ అడవిలో ఇద్దరు కలసి ఎక్కడికి పోతావున్నారు. ఆ మూటలో ఏముంది. కమ్మని వాసనకు కాసేపుగూడా తట్టుకోలేక పోతున్నాను. నొట్లో నీళ్ళు సర్రున ఊరుతా వున్నాయి" అంది.
ఆ పిల్లోడు నవ్వి "ఇవి మా అమ్మ ప్రేమతో చేసిన నేతి గారెలు. దయ్యాల ద్వీపానికి పోతావుంటే దారిలో తినడానికని ఇచ్చింది" అన్నాడు. కోతి నాలుక చప్పరిస్తా "ఆ కమ్మని వాసనకు నాలుక గిలగిలా కొట్టుకుంటా వుంది. నాకు గనుక ఒక నాలుగు ఇస్తే నీ వెంబడే వచ్చి నీవు కోరుకున్న సాయం చేస్తా" అంది. ఆ యువకుడు 'సరే' అని దానికి నాలుగు గారెలు అందించాడు. కోతి సంబరంగా వాటిని తిని వాని వెంటే బయలుదేరింది.
కొంచెందూరం పోగానే ఒక పెద్ద నెమలి ఆకాశంలో ఎగురుకుంటా అక్కడికి వచ్చి వాలింది. అది ఆ యువకుని వంక చూస్తూ "ఓ పుచ్చకాయ పిల్లోడా... ఆ మూటలో ఏముంది. ఆకాశంలో ఎగురుతా వుంటే ఆ కమ్మని వాసన సర్రున కిందికి లాగేసింది" అని అడిగింది. దానికి ఆ యువకుడు నవ్వి "ఇవి మా అమ్మ చేసిన కమ్మని నేతి గారెలు. దయ్యాల ద్వీపానికి పోతావుంటే దారిలో తినడానికి ఇచ్చింది" అన్నాడు. ఆ నెమలి మూట వంకే ఆశగా చూస్తా "ఆ కమ్మని వాసనకు కాసేపు గూడా చూస్తూ ఆగలేకుంటున్నా. నాకు గనుక ఒక నాలుగు ఇస్తే నీ వెంబడే వచ్చి నీ ఋణం తీర్చుకుంటా" అంది. ఆ యువకుడు 'సరే' అని దానికి కూడా నాలుగు గారెలు అందించాడు. నెమలి సంబరంగా వాటిని తిని వాళ్ళ వెంట బయలుదేరింది.
అట్లా ఆ పుచ్చకాయ పిల్లోడు ఆ మూడింటితో కలసి నెమ్మదిగా ఆ అడవిని దాటి సముద్రాన్ని చేరుకున్నాడు. కనుచూపుమేరలో ఉత్త అలలు తప్ప ఎక్కడా భూమి కనబడడం లేదు. "ఈ నీళ్లలో ఆ ద్వీపాన్ని వెతుక్కుంటా ఎట్లా పోవాలబ్బా" అని ఆలోచిస్తూ "ఒక పడవ తయారు చేస్తే ఎలా ఉంటుంది" అన్నాడు వాటితో. వెంటనే కుక్క పోయి కట్టెలు తీసుకురావడం మొదలుపెట్టింది. నెమలి పోయి తీగలు తీసుకురాసాగింది. కోతి వాటిని ఒకదానితో ఒకటి తాడులాగా జాగ్రత్తగా కట్టసాగింది. కాసేపటికి అవన్నీ కలిసి నలుగురూ కూర్చునే ఒక పెద్ద బల్లకట్టు తయారుచేశాయి. అంతా దానిలోకి ఎక్కారు. ఆ యువకుడు ఒకవైపు తెడ్డు వేస్తావుంటే మరొకవైపు కుక్క, కోతి కూర్చొని వేగంగా తెడ్డు వేయసాగాయి. పడవ సర్రున నీళ్లలో సొరచేప మాదిరి దూసుకుపోసాగింది. అట్లా ఓ నాలుగు గంటలు పోయాక వాటికి దూరంగా 'దెయ్యాల ద్వీపం' కనపడింది. పడవ వేగం తగ్గించి నెమ్మదిగా తీరానికి చేరుకున్నారు.
ఆ ద్వీపం మధ్యలో ఒక పెద్ద కోట ఉంది. అందులోనే ఆ దొంగల ముఠా ఉండేది. ఆ కోట గోడ చాలా ఎత్తుగా ఉంది. వెంటనే ఆ యువకుడు నెమలిని పిలిచి "నీవు పోయి ఆ కోటలో ఎంతమంది దొంగలు ఎక్కడెక్కడ ఉన్నారో చూసి రా" అన్నాడు. నెమలి "సరే" అంటూ గాలిలోకి ఎగిరి కోటగోడపై వాలింది. లోపల ఎక్కడెక్కడ ఎవరెవరున్నారో, ఎంతమంది వున్నారో చూసి వచ్చి చెప్పింది.
ఆ యువకుడు కోతి వంక చూస్తూ "ఈ కోటకు లోపలికి పోయే ద్వారం ఎక్కడుందో, అక్కడ కాపలాగా ఎంతమంది ఉన్నారో కనిపెట్టు" అన్నాడు. కోతి చెట్టుమీదనుంచి చెట్టుమీదకు ఎగురుకుంటా సర్రున దూసుకుపోయింది. కోట చుట్టూ వెతుకుతావుంటే ఉత్తరం దిక్కులో ఒక పెద్ద గుమ్మం, దాని ముందు కాపలాగా పదిమంది దొంగలు కనపడ్డారు. వెంటనే వచ్చి విషయాన్ని వివరించింది. మరుక్షణం ఆ పెద్ద రాక్షసకుక్క అటువైపు దూసుకుపోయింది. గట్టిగా అరుస్తూ దొంగలపైకి ఎగిరి దుంకింది. వాళ్ళు అదిరిపడి లేచేలోగా దొరికినవాన్ని దొరికినట్టు పట్టుకొని కొరికి కొరికి పడేసింది. ఆ దెబ్బకు భయపడి వాళ్ళు తలా ఒక దిక్కు పారిపోయారు.
వెంటనే ఆ యువకుడు చేతిలో కత్తితో వాకిలి గుండా లోపలికి అడుగుపెట్టాడు. లోపల వున్న దొంగలు ఆ యువకున్ని చూశారు. వెంటనే కత్తులు తీసుకొని వానిమీదికి దుంకారు. కానీ ఆ యువకుడు అలాంటిలాంటి మామూలు యువకుడు కాదుకదా... దెబ్బకు ఒకేసారి పది చెట్లనయినా అవలీలగా నరకగలిగిన మొనగాడు. దాంతో కత్తి తీసుకొని ఎగిరి వాళ్ళ మీదకు దుంకాడు. వానితోబాటు కోతి, కుక్క, నెమలిగూడ దూసుకుపోయాయి. కుక్క వాళ్ళ మీద పడి కరుస్తావుంటే, కోతి వాళ్ళ ఆయుధాలు గుంజుకుంటా వుంటే, నెమలి ఆకాశంలో ఎగురుతూ వాడి అయిన గోళ్ళతో వాళ్ళ మొహాల మీద రక్కసాగింది. చూడ్డానికి నలుగురే ఉన్నా వందమందితో సమానంగా పోరాడసాగారు. దొంగలు దెబ్బకొకరు చొప్పున ప్రాణాలు వదలసాగారు. చూస్తుండగానే కాసేపటికి దొంగలందరూ చనిపోయి దొంగల నాయకుడు ఒక్కడే మిగిలాడు.
ఆ పుచ్చకాయ పిల్లోనికి, దొంగలనాయకునికి మధ్య భయంకరంగా పోరాటం జరిగింది. చివరికి ఆ దొంగల నాయకుడు ఓడిపోయాడు. యువకుడు కత్తి తీసుకొని వాన్ని చంపబోతావుంటే ఆ గజదొంగ కాళ్ళమీద పడి "నన్ను మన్నించు. ఇక నా జీవితంలో మరలా ఎప్పుడూ, ఎక్కడా దొంగతనాలు చేయను. ఇంతవరకు దోచుకున్న సంపదంతా తెచ్చి నీ కాళ్ళ ముందు పెడతా. కనికరించి వదిలేయి" అన్నాడు. ఆ యువకుడు సరేనని ఆ దొంగను చంపకుండా తాళ్లతో కట్టివేశాడు.
దొంగల నాయకుడు చెప్పిన చోట తవ్విచూస్తే వంద బళ్ళ బంగారం, వేయి బిందెల వజ్రాలు దొరికాయి. వాటన్నింటినీ దొంగల నాయకునికి వున్న పెద్ద పెద్ద పడవల్లో ఎక్కించి తన ఊరికి తీసుకొని వచ్చాడు. అదిచూసి ముసలోడు ముసలామె చాలా సంబరపడ్డారు. ఆ ధనంతో ఆ యువకుడు ఊరిలోని పేద వాళ్ళందరికీ చక్కని ఇండ్లు కట్టించాడు. ఊరినిండా మంచి బావులు తవ్వించాడు. చెరువులన్నీ బాగుచేయించాడు. దారులన్నీ సరిచేసి చెట్లు నాటించాడు. దాంతో అందరూ సంతోషపడి ఆ రోజు నుంచి ఆ పుచ్చకాయ పిల్లోన్నే తమ నాయకునిగా ఎన్నుకున్నారు.
**********

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి