తేనెల ఊట! వెన్నెల కోట!: - డా పివిఎల్ సుబ్బారావు.- విజయనగరం.-సెల్:9441058797.

  

 ద్రావిడ భాషల ,
            మొదటి స్థానం!
 ప్రాచీన హోదా 
                   యశోతేజం! 
అజంతం, అభినందన,   
  ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్! 
కృష్ణరాయ హృదయ స్పందన,   
  దేశభాషలందు తెలుగు లెస్స! 
రెండు వేల నాలుగు వందల,
 సంవత్సరాల భాషగా ఘనత!!

కవిత్రయ మహాభారతం, 
సాహిత్య భాండాగారం! 
పోతన భాగవతం,
 భక్తి భావ సుధా భాండం!! 
త్యాగరాయ కృతులు,
 సంగీత అక్షర నిధులు! 
రామదాస ,క్షేత్రయ్య, 
పదబంధాలు ఆనందాలు! 
భువన విజయం ,
అష్టదిగ్గజాల అగ్రతాంబూలం!

శతకాల-వేమన, సుమతి,
   జనాల జిహ్వగ్రాలు!
వీర బ్రహ్మంగారి వాక్కులు ,
నేడు అక్షర సత్యాలు! 
నండూరి వారి ఎంకి పాటలు, 
ప్రేమలు పూసిన తోటలు! 
అన్నమయ్య కీర్తనలు ,
పారవశ్య కేతనాలు! 
 పలికేది వ్రాస్తాము,వ్రాసేది,
   పలుకుతాము, అదే తెలుగు!

విశ్వనాథ రామాయణ కల్పవృక్షం,
 తొలి తెలుగు జ్ఞానపీఠం!
గురజాడ అక్షర జాడ,
 దేశభక్తి గీతం!
 శ్రీ శ్రీ అక్షర శరసంధానం,
    మహాప్రస్థానం!
 కృష్ణశాస్త్రి అక్షరం,
 సౌందర్య గవాక్షం!
 సినారె కలం కవితాధార,
    విశ్వంభర!

గత వైభవం,
 మన వారసత్వం కావాలి! 
తెనుగు యువత,
         ముందుకు రావాలి! 
గిడుగు ఉద్యమం,
   పునరావృతం చేయాలి! 
తెలుగు అనాలి, వినాలి, 
        చదవాలి, వ్రాయాలి!
 తెలుగు వెలుగులు,
   విశ్వమంతా విస్తరించాలి!
________

కామెంట్‌లు