దీపం; - మధుప్రియ - తొమ్మిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్-మెదక్ జిల్లా - 9666063963
      

   అనగనగా నాగపూర్ అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో భాను అని 12 సంవత్సరాల అమ్మాయి ఉండేది. భానుకు చదవాలని పెద్ద డాక్టర్ కావాలని ఆశ. కానీ వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉండేది కాదు. ‍ సాయంత్రం ఆరు దాటితే చీకటి ఉండేది.
                నాన్న రోజు కూలి పని చేసేవాడు. వచ్చే డబ్బుతో ఇల్లు గడవడమే కష్టం. లాంతరు కోసం కిరోసిన్ కొనడానికి కూడా డబ్బులు సరిపోయేవి కావు. భాను రోజు వీధి దీపం కింద కూర్చొని చదువుకునేది. దోమలు కుట్టినా, చలివేసిన లెక్కచేయకుండా పుస్తకాలు తెరిచేది. ఊర్లో వాళ్ళు ఇంత కష్టపడి ఏం లాభం. ఏం సాధిస్తావు నువ్వు ఆడపిల్లవు కదా అనేవాళ్లు. భాను నవ్వి ఊరుకునేది.
               ఒకరోజు స్కూల్లో సైన్స్ ఫెయిర్ పెట్టారు. విద్యుత్ లేని ఇళ్లకు ఉపయోగపడే చిన్న పరికరం చేయాలని టీచర్ చెప్పారు. అందరూ బ్యాటరీ లైట్, సోలార్ లాంతర్లు తీసుకొచ్చారు. భాను దగ్గర ఏమీ లేదు. 
ఆ రాత్రి చాలా సేపు ఆలోచించింది. ఇంట్లో ఉన్న ఖాళీ ప్లాస్టిక్ బాటిల్, కొంచెం నీళ్లు, ఒక చిన్న టార్చ్ లైట్ తీసుకుంది. నీళ్ల బాటిల్ ముందు టార్చ్ పెడితే వెలుగు నాలుగు రెట్లు ఎక్కువ అవుతుందని పేపర్లో చదివింది. అదే సందేశంతో ఒక వాటర్ బాటిల్ లైట్ చేసింది.
          మరుసటి రోజు సైన్స్ ఫెయిర్ లో అందరి ప్రాజెక్టుల కంటే భానుది చాలా సింపుల్ గా, ఆకర్షణీయంగా ఉంది. టీచర్స్ బాను ప్రాజెక్టు చూసి ఆశ్చర్యపోయారు. కరెంట్ లేకుండా, ఖర్చు లేకుండా ఇంత మంచి ఆలోచనని మెచ్చుకున్నారు. 
                  జిల్లా స్థాయి పోటీలకు భాను సెలెక్ట్ అయింది. అక్కడ  కూడా ప్రథమ బహుమతి 2000 రూపాయలు వచ్చింది. 
భాను ఆ డబ్బులతో ముందుగా ఇంటికి ఒక చిన్న సోలార్ లైట్ తీసుకుని, మిగిలిన డబ్బులతో ఊర్లో కరెంట్ లేని పది ఇండ్లకు వాటర్ బాటిల్ లైట్స్ చేసి ఇచ్చింది. 
కొన్ని సంవత్సరాల తర్వాత భాను నిజంగా డాక్టర్ అయింది. ఊరికి తిరిగి వచ్చి, ఒక చిన్న క్లినిక్ పెట్టింది. ఆ క్లినిక్ పేరు దీపం అని పెట్టడం జరిగింది.
            ఒక రోజు ఒక చిన్న పాప భాను దగ్గరకు వచ్చి అక్క రాత్రి చదువుకోవడానికి లైట్ లేదు అని అడిగింది. భాను నవ్వి తన చేతిలో ఉన్న టార్చ్, ఒక వాటర్ బాటిల్ ఆ పాపకు ఇచ్చింది. చీకటి లేకపోతే భయపడకు నువ్వే ఒక దీపం అవ్వుమని చెప్పింది. 
నీతి:  చిన్న ఆలోచన  పెద్ద వెలుగుని తీసుకురాగలదు. 


కామెంట్‌లు