పిల్లి: - యామిజాల జగదీశ్


 మనలో చాలా మందికి కుక్కలను పెంచుకోవడం అలవాటు. అయితే, మన పెద్దలు ఇళ్లలో పిల్లులను  పెంచేవారు. దాని వెనుక ఉన్న ఒక ఆధ్యాత్మిక, మానసిక రహస్యం ఒకటుంది. ఇది తెలిస్తే మీరు కూడా వెంటనే ఒక పిల్లి కూనను వెతుక్కుం టూ వెళ్తారు!
చాలా ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం, మానసిక పరిశోధనల ప్రకారం పిల్లులకు "చెడు శక్తిని (నెగెటివ్ ఎనర్జీ)" లాక్కునే అద్భుతమైన శక్తి ఉంటుంది. మీ ఇంట్లో ఎవరైనా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నా లేదా ఇంట్లో ఏదైనా గందరగోళ వాతావరణం ఉన్నా, పిల్లిని పసిగట్టవచ్చు.
అంతేకాదు, ఆ నెగెటివ్ ఎనర్జీని తనలోకి తీసుకుని, ఇంట్లో మంచి వాతావరణాన్ని (పాజిటివ్ వైబ్స్) నింపుతుంది. అందుకే మీరు బాధలో ఉన్నప్పుడు మీ పిల్లి మీ తొడలపై వచ్చి కూర్చున్నప్పుడు ఒకలాంటి శబ్దం చేస్తూ ఉంటుంది. ఇది మీ బాధను తగ్గించడానికి ప్రకృతి ఇచ్చిన ఒక అద్భుతమైన ఔషధం.
జంతు శాస్త్రవేత్తల ప్రకారం, పిల్లులకు మనుషుల కంటే వినికిడి శక్తి, ఊహించే శక్తి (సిక్స్త్ సెన్స్) చాలా ఎక్కువ. మనం చూడలేని చిన్న చిన్న కదలికలను, ప్రకంపనలను కూడా అవి స్పష్టంగా గమనించగలవు. కొన్నిసార్లు మీ పిల్లి ఖాళీగా ఉన్న ప్రదేశాన్ని చూస్తూ ఉండటం లేదా హఠాత్తుగా ఏదో ఒక వైపు చూసి భయపడటం మీరు చూడవచ్చు!
పాతకాలంలో మనవాళ్లు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడేవారు. దాచి ఉంచిన ధాన్యాన్ని ఎలుకల బారి నుండి కాపాడుకోవడానికే ఇళ్లలో పిల్లలను పెంచడం మొదలుపెట్టారు. కాలక్రమేణా ఆ పిల్లలు మనుషుల భావోద్వేగాలను అర్థం చేసుకునే కుటుంబ సభ్యుల్లా మారిపోయాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే... కుక్కలు ఇంటికి కాపలా ఉంటే, పిల్లలు ఇంట్లో ఉండేవాళ్ల మనసుకు కాపలా ఉంటాయి!
ఇది రాస్తుంటే ఒక విషయం గుర్తుకొచ్చింది. మద్రాసులో మేము వివేకానందా స్ట్రీటులో ఉన్న రోజులవి. మా ఇంటికి నడక దూరంలోని రంగరాజపురంలో ప్రముఖ రచయిత చలంగారి కుమార్తె చిట్టిపాప (ఈమెను పకపకా అని చంపకా అని కూడా అంటారు)గారి కుటుంబం ఉండేది. మా రెండు కుటుంబాల మధ్య బాగా రాకపోకలు ఉండేవి. వారింట పిల్లులు ఉండేవి. ఓమారు వాటి సంతతి ఎక్కువవడంవల్లనో ఏమో బ్లూక్రాస్ వారికి ఇచ్చెయ్యాలని అనుకున్నారు. ఆ విషయం నాతో చెప్పగా బజుల్లా రోడ్డు (ఇప్పుడక్కడ ఉందో లేదో తెలీదు. నేనిప్పుడు హైదరాబాదులో ఉంటున్నాను) లో బ్లూక్రాస్ శాఖ ఉంటే వారి వద్దకు వెళ్ళి పిల్లులను ఇస్తే తీసుకుంటారా అని అడిగాను. తప్పకుండా తీసుకుంటామని చెప్పారు. ఈ విషయం చిట్టిపాపగారికి చెప్తే అర డజన్ పిల్లులను ఓ సంచిలో ఉంచి బ్లూక్రాసుకి ఇవ్వమన్నారు. సరేనని వాటిని జాగర్తగా తీసుకెళ్ళి బ్లూక్రాస్ వారికి ఇచ్చేశాను. బలే ఉండేవా పిల్లి పిల్లలు.
కామెంట్‌లు