విలువలేని విద్య – ఈనాడు ఒక విషాద ప్రశ్న! :- కలకుంట్ల జలజరావు-ఉపాధ్యాయురాలు.
 

పాఠశాల గడప దాటితే
పుస్తకాల పరిమళం రావాలి…
కానీ పానశాలల మత్తు వాసన వస్తే
ఆ విద్యకు అర్థమేంటి?
చేతిలో పుస్తకం ఉండాలి…
మనసులో మానవత్వం ఉండాలి…
చదువు అక్షరాలు నేర్పడమే కాదు,
ఎదుటివారిని గౌరవించడం నేర్పాలి!
తల్లిదండ్రులు కన్నీటితో పెంచిన పిల్లలు,
వారి కళ్లలో కన్నీళ్లు తెప్పించకూడదు…
వృద్ధులైన పెద్దల పాదాలకు నమస్కరించి,
వారి అనుభవాలను ఆశీర్వాదాలుగా స్వీకరించాలి.
గురువు అంటే కేవలం,పాఠాలు చెప్పే వ్యక్తి కాదు…
చీకటిలో దారి చూపే దీపం,జీవితాన్ని తీర్చిదిద్దే శిల్పి!
అలాంటి గురువునే
విద్యార్థి చేతిలో కోల్పోవాల్సి వస్తే…
అది ఒక్క కుటుంబం విషాదం కాదు,
మొత్తం సమాజం గుండెలపై పడిన ప్రశ్న!
ఎక్కడ తప్పిపోయింది మన విద్య?
ఎక్కడ మాయమైంది మన సంస్కారం?
మార్కుల కోసం పరుగెత్తే చదువులో
మానవత్వం ఎందుకు వెనుకబడింది?
మనసులో వినయం ఉండాలి…వికారం కాదు!
నోట గౌరవం పలకాలి గాయపరిచే మాటలు కాదు!
విద్య అంటే ఉద్యోగం కాదు…విద్య అంటే జీవితం.
విద్య అంటే విజ్ఞానం కాదు.
విజ్ఞానంతో పాటు విలువలు.
తల్లిదండ్రులను గౌరవించు…పెద్దలను ఆదరించు…
గురువులను గౌరవించు…తోటి మనిషిని ప్రేమించు…
అప్పుడే నీ చేతిలోని పుస్తకం
నీ జీవితానికి వెలుగవుతుంది!
నీ విద్య
నీ తల్లిదండ్రులకు గర్వకారణం కావాలి…
నీ గురువుకు ఆనందకారణం కావాలి…
నీ సమాజానికి ఆదర్శం కావాలి!
అక్షరాలతో పాటు ఆత్మను చదువు…
పుస్తకాలతో పాటు మనుషులను చదువు…
విద్యతో పాటు విలువలను నేర్చుకో…
అప్పుడే నీవు నిజమైన విద్యార్థివి!
                     : 
కామెంట్‌లు