భక్తి పారవశ్యం!: - పాలగుమ్మి జ్యోతి.


స్కూటర్ పై వెళుతున్న ఆనందరావుకు దారిలో ఆవు నిలబడి కనిపించింది. గోమాత మీద అమితమైన భక్తిశ్రద్ధలు పుట్టుకొచ్చి వెంటనే బండిని గోమాతకు కొంచెం దూరంలో ఆపి 'అసలే ఇవాళ మంచి కార్యo నెరవేరాలని బయలుదేరుతున్నాను, అదృష్టవశాత్తు గోమాత కనిపించింది. గోమాతను పూజించి వెళదాం! అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది' అనుకొని తన దగ్గర ఉన్న అరటి పళ్ళు నాలుగు తీసి తినిపించాడు. గోమాత మంచి ఆకలి మీద ఉందేమో శుభ్రంగా ఆరగించింది.  ఇంకా ఏదైనా పెడదామని  అటు ఇటు చూసాడు. అక్కడే కిరాణా కొట్టు కనిపించింది. అక్కడికి వెళ్ళి బెల్లం కొన్నాడు. గోమాత వద్దకు వచ్చి  బెల్లం పెట్టాక పృష్ఠ భాగానికి  మ్రొక్కాడు. అక్కడే ఉన్న కిరాణా కొట్టులో కొబ్బరికాయ కొనడానికి వచ్చిన పంతులుగారు ఇదంతా గమనిస్తున్నారు.
                    ఆనందరావు భక్తిలో మునిగిపోయాడు. ఇంకా కూడా గోమాత పృష్ఠ భాగానికి దండాలు మీద దండాలు పెడుతూనే ఉన్నాడు. ఇక ఉండ బట్టలేక  పంతులుగారు ఆనందరావు వద్దకు వచ్చి "అయ్యా! మీరు అమెరికాలో పుట్టి పెరిగి ఇక్కడికి వచ్చారా ?" అని అడిగారు. "లేదండి ఇక్కడే ఉంటాను ఎందుకు?" అన్నాడు ఆనందరావు. "గోపూజ మొదటిసారి చేస్తున్నారా?" అనుమానంగా అడిగారు. "లేదండి పంతులుగారూ!ఎప్పుడు రహదారిలో గోమాత కనిపించినా ఇలా భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటాను" భక్తిపారవశ్యంతో లెంపలేసుకుంటూ అన్నాడు ఆనందరావు. "అంతా బాగానేవుంది! మీ భక్తి కూడా మెచ్చదగినదే! కానీ గోమాతను పూజించండి అయ్యా! పుణ్యం వస్తుంది ఎద్దుని కాదు"పంతులుగారు నవ్వుతూ అన్నారు. అప్పుడు గమనించిన ఆనందరావు నాలుక కరుచుకొని  ఏం మాట్లాడాలో తెలియక తల గోక్కుం టూ అక్కడ నుంచి బండి ఎక్కి వేగంగా వెళ్ళిపోయాడు.
                ###################################################### 
కామెంట్‌లు