చింటూ అనే ఉడుతకు ముందు చూపు ఎక్కువ. వానాకాలంలో తనకి ఆహారం దొరకక ఇబ్బంది పడకూడని ముందుగానే కొంత ఆహారాన్ని తన ఇంట్లో నిలువ చేసుకోసాగింది . చింటూ ఆహారాన్ని తన ఇంట్లో నిలువ చేసుకోవడం మూషికేష్ అనే ఎలుక చూసింది. "ఓయ్ చింటూ! ఏంటి మొత్తం ఆహారం అంతా నువ్వే దాచేసుకుంటున్నావ్? ఇంక మేము ఏం తినాలి?" చింటూ కి అడ్డుగా నిలిచి నిలదీస్తూ అడిగింది. "మూషికేష్! నేను నాకు సరిపడా ఆహారాన్ని తీసుకు వెళుతున్నాను.అయినా నేను ఎంత తీసుకొని వెళ్ళగలను చెప్పు! వినయంగా అంది చింటూ." సరే వెళ్ళు" అని దురాలోచనతో వదిలేసింది మూషికేష్.
మూషికేష్ ఎలుకల దండుకి నాయకుడు. తను, ఇంకా తన దండు నిలువ చేసుకున్న ఆహారాన్ని తినకుండా దాచుకుని, దొరికినంత వరకు పరాయి వాళ్ళు నిలువ చేసుకున్న ఆహారాన్ని తినడమే అలవాటు మూషికేష్ కి . చింటూ ఆహారం కోసం బయటికి వెళ్ళినప్పుడు దాని ఇంట్లోకి ప్రవేశించి అది దాచుకున్న ఆహారాన్ని మొత్తం తినేసి బయటికి వస్తూ చింటూ కళ్ళబడింది ." మూషికేష్! ఇదేమైనా న్యాయంగా ఉందా? నేను కష్టపడి ఆహారాన్ని ముందుచూపుగా నిలువ చేసుకుంటూ ఉంటే అది మొత్తం నువ్వు తినేస్తే ఎలాగా? నువ్వు కూడా కష్టపడి ఆహారాన్ని సంపాదించుకో" వేడుకోలుగా అంది చింటూ. "ఏయ్! ఏమిటి నాకే ఎదురి నిలిచి మరి ప్రశ్నిస్తున్నావ్? నేను ఎలుకల దండుకి నాయకుణ్ని. మేమంతా కలిసి ఒక్కసారిగా నీ మీద దాడి చేస్తే నువ్వు ఏమైపోతావో ఆలోచించు!" అని బెదిరించి, మూతి తుడుచుకుంటూ వెళ్ళిపోయింది మూషికేష్.
చింటూ ఆలోచనలో పడింది.' మూషికేష్ ఎలుకల దండుకి నాయకుడు. దానిని ఎదుర్కోవాలంటే తన శక్తి చాలదు ఏం చేయాలా?' అని ఒక పరిష్కారం కనుగొంది. వెంటనే అడకి వెళ్ళి అక్కడ ఉన్న తన స్నేహితుడు లక్కీ అనే పిల్లి కోసం వెతికితే అది చెరువు దగ్గర నీళ్ళు త్రాగుతూ కనిపించింది.
'నన్ను ఈ ఆపద నుంచి కాపాడగలిగిన వాడు నా స్నేహితుడు లక్కీ ఒక్కడే' అని అనుకుని గబగబా చెరువు వద్దకు పరిగెత్తింది. రొప్పుతూ నిలబడ్డ చింటూని చూసిన లక్కీ "ఏం చింటూ! ఎందుకంత గాబరాగా ఉన్నావు? అని ప్రశ్నించింది. "లక్కీ బావ! మూషికేష్ అనే ఎలుక నేను నిల్వ చేసుకున్న ఆహారాన్ని తినేస్తోoది! నేను నిలదీస్తే, "నేను ఎలుకల దండుకి నాయకుణ్ని అందరం కలిసి నీ మీదకి దండెత్తితే నీ పనేమవుతుందో ఆలోచించు" అని బెదిరిస్తోంది. ఈ అపాయం నుంచి నన్ను తప్పించగలిగినవాడివి నువ్వు ఒక్కడివే బావ" అంటూ చేతులెత్తి మ్రొక్కి వెక్కివెక్కి ఏడ్చింది చింటూ." అరే!ఏడవకు చింటూ! ఇద్దరం కలిసి వెళ్ళి నీ ఇంటి దగ్గర కాపు కాసి, ఆ మూషికేష్ పనిపడదాం! సరేనా?" ధైర్యం చెప్పి భుజం తట్టి చింటూని తీసుకుని బయలుదేరింది లక్కీ .
చింటూ ఇంటి వద్ద చెట్ల చాటున లక్కీ, చింటూ రెండు మూషికేష్ కోసం కావలి కాస్తున్నాయి. రోజూ లాగానే చింటూ దాచుకున్న ఆహారం తినడానికి వచ్చిన మూషికేష్ ని గభాలున చెట్టు చాటు నుంచి వచ్చి పట్టుకుంది లక్కీ. "ఏయ్ మూషికేష్! ఏమిటి చింటూ దాచుకున్న ఆహారాన్ని దొంగతనంగా తింటున్నావా? పైగా అడిగితే బెదిరిస్తున్నావా?తప్పు కదా! నీకు కావలసిన ఆహారం నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి అంతేగాని ఇతరుల ఆహారాన్ని అలా తినొచ్చా?నేను తలచుకుంటే ఇప్పటికిప్పుడు నిన్ను చంపగలను. కానీ నీకు బుద్ధి చెప్పాలని వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలాంటిపని చేస్తే ఈసారి వదలను! చంపేస్తాను! ఇకమీదట ఎప్పుడైనా సరే కష్టపడి బ్రతుకు ఫో" అని మూషికేశ్ ని వదిలేసింది లక్కీ . హఠాత్తుగా తనపై జరిగిన దాడికి గజగజా వణికిపోయిన మూషికేష్ లక్కీ వదిలేయగానే "బ్రతుకు జీవుడా!" అని ఒక్క ఉదుటున పారిపోయింది. ఆ తర్వాత నుంచి లక్కీకి భయపడి ఇక ఎప్పుడూ చింటూ జోలికి రాలేదు. అప్పటినుంచి చింటూ అనే ఉడత హాయిగా జీవించసాగింది.
========================================
నీతి :పరాయి వాళ్ళ సొమ్ముని ఆశించకూడదు. కష్టపడి బ్రతకాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి