సామెత -329 : "ఇచ్చినోడే మెచ్చినోడు.చచ్చినోడే అచ్చినోడు"
****
"గస్మంటోళ్ళు ఉండబట్టే గీ లోకం గిట్లన్న నడుత్తుందవ్వా!ఎవలి కట్టం సూశినా గాళ్ళకే వొచ్చినంత ఇదైపోయి సాయం చేత్తరు.నూటికో కోటికో ఒకలిద్దరు ఉండుట్ల గీ లోకం గీ మాత్తరమన్నుంది. లేకుంటెనా"ఎంచేపు నాది నావోళ్ళు అన్న మాటనే గని అయ్యో పలానోళ్ళ పరిత్తితి బాగా లేదు.బతికి శెడ్డోళ్ళు.ఎవ్వలి తాన శేతులు సాపడానికి మొగమాటం అడ్డొచ్చి సావలేక బతుకు తున్నరు.గాళ్ళకి గింత సాయం జేద్దమన్న బుద్ధే ఉండదు కొందర్కి"
" ఏంది శెల్లోవ్! ఎవలన్న సార్తపర్లు ఎదురయ్యిండ్రా? లేకుంటే మంచోళ్ళు ఎవలన్న నిన్ను కదిలిచ్చిర్రా? గాళ్ళని ,గీళ్ళని కల్పి శెబుతున్నవ్. ముందుగాల గాల్లెవలో గీల్లెవలో అయిరాన పడకుండా శెప్పు."
"గదే అవ్వా! నువ్వే శానా త్యేపల మంచోళ్ళని మర్శిపోవద్దు- శెడ్డోల్ల శెకలను సూశి సూడనట్టు పోవొద్దు. పొల్లుబోకుండ అన్ని మన్సు, కండ్లు బెట్కొని సూత్తుండాలే అంటవు సూడు. గందుకే గస్మంటి మంచి మడిషిని సూశిన.గా యిష్యమే నీకు శెప్దామని వొచ్చినవ్వా!"
"గట్లనా శెల్లే! గంత మంచి మడిషి ఎవలో శెప్పు.మనూల్లె నాకు తెల్వని మడిషెవలో యినాలనుంది."
"గదేనవ్వా !ఉప్పలయ్య అన్నయ్య. శిన్నతనాన గీ వూల్లె నుంచి పెద్దమ్మ,పెద్దబాపు వూల్లె సాగుబాటు లేక పట్నం బత్కబోయిండ్రు సూడు.కన్నమ్మ కట్టాలు బడి అన్నని మంచిగ సద్విచ్చిర్రు. గిప్పుడు గాల్ల కట్టాలు తీరుడే గాదు. ఎవలికన్న కట్టమొత్తె గాల్లోనే శాతనైనంత సాయం శేత్తుర్రు. గట్ల ఉప్పలయ్య అన్న పుట్టి పెరిగిన ఊరని ఊల్లె మంచి పన్లకి,సద్వుకున్న శిన్న బడికి సాయం జేత్తుండు.ఊల్లే మొత్తం రొండు రకాల్గ ఎదిగిన గా అన్న ముచ్చెటినే అనుకోవడం. ఇంకా శానా శేత్తుండవ్వా! అందరు ఒక్క తీర్గ మెచ్చుకుంటుర్రు."
"గదే శెల్లే! " ఇచ్చినోడే మెచ్చినోడు" గిప్పుడు అందరు మెచ్చే తాయికి ఎద్గిండు. శానా గొప్ప గద శెల్లే!"
"అవునవ్వా!అవ్వా జంగయ్య తాత నవిశి నవిశి సచ్చిపోయిండట. గింతకి ముందే తెల్సింది.నువ్వు సుత వొత్తవేమోనని పిల్శేందుకు,గా యిష్యం శెప్పేందుకు వొచ్చినవ్వా!"
"గట్లనా శెల్లే! నేను సుత వొత్త తీ! గా జంగయ్య తాత ముచ్చెటీలే అనుకుర్రు.గా మావకి ఉల్లె అస్సలు మంచి పేరు లేదు కద శెల్లే! "
"అవునవ్వా!గస్మంటోన్ని మెచ్చుకోనే కూడదు గని.ఊల్లె జనం "అయ్యో పాపం జంగయ్య! అని జిర్రున ముక్కు శీదుకుంట ఏవేవో శెప్తుంది.
"అవునా?సచ్చినోడు అచ్చినోడని ఊకెనే అన్లే శెల్లే. గాళ్ళు ఎన్ని పాపాలు శేసానా ఏదైన మంచి దొరుకుద్దేమో నని ఎతికి పట్టి గిట్ల తలుత్తరు శెల్లే!" మొత్తంగ ఇచ్చినోడే మెచ్చినోడు- సచ్చినోడే అచ్చినోడు ( మంచోడు) అన్నట్టు
"గంతేనంటవా అవ్వా?"
" ఔ మల్ల"
"గదండీ సంగతి "ఇచ్చినోడే మెచ్చినోడు - సచ్చినోడే అచ్చినోడు" అంటే గిదే మరి"

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి