సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 

 సామెత-324:-ఇంట్లో పస్తు- బయట దస్తు
**
"అవ్వా! కొంత మందిరికి ఎన్కటి ఆసన్లు పోవట్టుంది. 'మా తాతలు నేతులు తాగిండ్రు - మా మూతులు ఆసన సూడ్రి' అన్న తీర్గ శేత్తుంటరు.గట్ల జేసుట్ల ఏం పాయిదుంటదో  మరి నాకైతే సమజవ్వట్లే అవ్వా!"
 ' నువ్వు శెప్పేది నాకు సుత అటీటుగ సమజైంది. గింతకీ ఎవలాయిన శెల్లే!శెడి బతికినోళ్ళ తీరు ఒక లెక్క, బతికి శెడ్డోల్ల తీరు మరో లెక్క ఉంటది శెల్లే! నువ్వు శెప్పింది బతికి శెడ్డోల్ల ముచ్చెటినేనా?"
 "అవునవ్వా! నువ్వు బలే పశిగడ్తవు.ఒకప్పుడు ఊల్లె ఎకరాలకు ఎకరాల బూవిఁ ఉండేదట.జీతగాండ్లు నాతగాండ్లు; నౌకర్లు శాకర్లతో, ఇంట్లెకి వొచ్చిపోయేటోళ్ళతో ఇల్లు నిత్తె కల్యాణం పచ్చతోర్నం లెక్క కళకల్లాడుతుండేదట.ఎప్పుడూ దినాం ఇంట్లోళ్ళు గాక నలబై,యాబై యిస్తళ్ళు లేశేయంట. మా నాయిన్ని అడిగితే గంత ఆత్తికి తగ్గట్టే మంచి మన్సు ఉండేదనీ,ఊల్లె ఎవలికి ఏకట్టమొచ్చినా సాయాన్కి ముందొర్సలో వుండేటోళ్ళని శెప్పిండవ్వా!''
 "ఓషోష్! నువ్వు శేప్పేది యాదయ్య తాతోల్ల ముచ్చెటినేనా?"
 "అవునవ్వా! గాయినే గిప్పటికి సుత ఊల్లె ఏ ఆడివిల్ల లగ్గమైనా పుత్తె మెట్టెలు శేపిచ్చి పెడ్తడు. ఎవలో శెప్పిర్రు ఇంట్లె తింటానికి లేదంట.మరి గిస్మంటి కర్సులు ఎందుకు చెయ్యాలనె శెప్పు?"
 ఇగ్గో శెల్లే! కొందరి దాన గుణం గిట్లనే ఉంటది.గా బుద్ధి మానుకో లేరు. గీ నడ్మల ఎవలికో కట్టమొచ్చిందంటే యాదయ్య తాత అవ్వ మెడలున్న  పుత్తెల తాడు అమ్మి  సాయం జేశిండట.గా అవ్వ సుత తాతకి తగ్గదే.ఇంట్లె ఎన్ని పస్తులున్నా,పైసలకి కట్టమున్నా గియ్యాల్టి దన్క గుట్టు బయిటికి రానియ్యంగ సూడలే!''
గాళ్ళకే గంత కనా కట్టంగ బతుకెళ్ళుతుంటే ఇంగ బయిట గా సాయాలు,దాన ధర్మాలు ఎందుకు శెయ్యాలె శెప్పవ్వా? గందులోనూ ఇంకా రాజిర్కం ఉట్టిపడ్తున్నట్టు,బాగా ఉన్నోడి లెక్క తిర్గుతుంటే ఆచ్చిరంగుంటదవ్వా !" 
గదే శెల్లే "పెట్టే శెయ్యి,తిట్టే నోరు ఊకోదన్నట్టు" గా యాదయ్య తాతది పెట్టే శెయ్యి. ఇంట్లె ఏవీ లేక తిండికి కట్టమైనా మంచిల్లన్న తాగి వుంటడు. తన పరిత్తితి సూశి ఎవ్వలూ జాలి పడుడు,దయ సూసుడు యిట్టపడడు . ఇంకా శానా ఆత్తులు ఉన్నోడోలే "పెయ్యి మీద పట్టు బట్టలు నల్గనీయడు. సూత్తుంటేనే శెయ్యెత్తి మొక్కాలనిపిత్తది శెల్లే!?"
"గాళ్ళని సూత్తుంటే ఎప్పుడూ ఓ సామెత యాదికొత్తుంటది శెల్లే!"
 గంత సూటిగ గాళ్ళకి కల్శేటట్టుందా ఏంది గా సామెత? అయితే శెప్పవ్వా!"
"గదే శెల్లే"ఇంట్లో పస్తు -బయట దస్తు" అనే  సామెత అచ్చంగ గీల్లకి సరిపోద్ది."
 "దస్తంటేందవ్వా? అర్తం మన్సుకెక్కలే మల్లోపాలి శెప్పు".
దస్తు అంటే శానా అర్తాలు వున్నయిలే శెల్లే! ముందుగాల అర్తమైతే దస్తు అంటే సొమ్ము,ఆత్తి, బట్టలు,అందమని గట్ల శానా అర్తాలు సుత ఉన్నయ్ తీ''
అవునా అవ్వా! గిప్పుడు నువ్వు శెప్పిన సామెత యాదయ్య తాతోల్లకి బలే సూటివెట్టినట్టుగుందవ్వా!"
"అవును శెల్లే! గస్మంటోళ్ళని సూశే ఎన్కట గిస్మంటి సామెత పుట్టింది శెల్లె."
ఇన్నరు గదురుల్లా " ఇంట్లో పస్తు -బయట దస్తు"  అంటే ఏందో మడుసుల కట్ట సుఖాల నించే గిస్మంటి సామెతలు పుడ్తుంటయ్."
కామెంట్‌లు