ద్రోణ పర్వము పంచమాశ్వాసము-351 వ రోజు
ఘటోత్కచుని మరణానికి పాండవసేనలో స్పందన
ఘటోత్కచుడి మరణ వార్త విన్న పాండవులు కన్నీరు మున్నీరుగా విలపించారు. భీమసేనుడి దుఃఖముకు అంతు లేదు. కాని కృష్ణుడు రథము మీద నిలబడి నాట్యమాడసాగాడు. కేరింతలు కొట్టి సింహనాదం చేసి ఆనందంతో పాంచజన్యం పూరించారు. కృష్ణుడి విపరీత ప్రవర్తన చూసి అర్జునుడు ఆశ్చర్యపోతూ " కృష్ణా ! ఆపు ఏమిటిది మేమంతా ఘటోత్కచుడి మరణానికి విలపిస్తుంటే నీవు ఆనందంతో గంతులు వేస్తున్నావు. ఇక చాలు ఆపు ఎవరన్నా చూస్తే నవ్వుతారు " అన్నాడు ఈసడింపుగా. కాని కృష్ణుడు తన ఆనంద హేల ఆపక అలా పాడుతూ ఆనందంతో గెంతుతూ ఉన్నాడు. కాని అంతలో అర్జునుడు తెలివి తెచ్చుకుని కృష్ణునితో " కృష్ణా! నీవు అన్నీ తెలిసిన వాడివి. మహానుభావుడివి నీ వింత ప్రవర్తనకు ఏదో కారణం ఉంటుంది నాకు చెప్పవా " అన్నాడు. అని అనునయంగా అన్నాడు. కృష్ణుడు " అర్జునా! నీ తండ్రి నీ క్షేమము కోరి కర్ణుడి వద్ద నుండి కవచకుండలములు దానంగా పరిగ్రహించాడు. ఆ సమయంలో కర్ణుడికి ప్రతిగా ఒక మహత్తర శక్తిని కానుకగా ఇచ్చాడు. అది ఒక సారి ప్రయోగిస్తే ఒకరిని మాత్రమే చంపి తిరిగి ఇంద్రుని చేరగలదు. దానిని కర్ణుడు నిన్ను చంపడానికి మాత్రమే దాచాడు. కాని గత్యంతరం లేని పరిస్థితిలో దానిని కర్ణుడు ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. కనుక ఇక కర్ణుడు నిన్ను ఏమీ చేయ లేడు. అర్జునా! కర్ణుడు దైవాంశ సంభూతుడు సామాన్యుడు కాదు. అతడి వద్ద ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఉన్నంత వరకు నా సుదర్శన చక్రము కాని నీ గాండీవం కాని ఏమి చేయలేదు. నీ తండ్రి కర్ణుడి కవచ కుండలములు పరగ్రహించకున్న అతడిని నీవే కాదు ముల్లోకాలలో ఎవరూ ఏమీ చేయ లేరు. అతడిప్పుడు సాధారణ మానవుడయ్యాడు.కనుక అతడిని ఇక నీవు సులభంగా జయించ వచ్చు . ఇది నాకు సంతోషం కాదా! " అన్నాడు. నేను జరాసంధుని, శిశుపాలుని నీ కొరకు చంపించాను. వారు బ్రతికి ఉన్న సుయోధనుడితో చేరి నిన్ను ఎదుర్కొనేవారు. వారందరూ కర్ణుడితో కలిస్తే జయించుట అసాధ్యం. ఇక ఘటోత్కచుడు ఎంత భీముడి కుమారుడైనా రాక్షసవంశ సంజాతుడు. ధర్మద్వేషము, హరిద్వేషము అతడి నరనరాలలో జీర్ణించుకుని ఉంది. అతడు బ్రతికి ఉన్నా ఎప్పటికైనా నా మీద తిరగబడగలడు. అప్పుడు నేను చేయవలసిన పని ఇప్పుడు కర్ణుడు పూర్తి చేసాడు. నీవు నాకు అత్యంత ఆప్తుడవు నీ క్షేమమే నాకు ముఖ్యము. ఇక నీకు కర్ణుడు హాని చేయజాలడు. మన సైన్యములు అలసి ఉన్నాయి. వారికి కొంత విశ్రాంతినిచ్చి తిరిగి యుద్ధానికి ఉపక్రమించ వచ్చు " అన్నాడు.
ధృతరాష్ట్రుని సందేహం
సంజయుడు ఘటోత్కచుడు మరణించిన వృత్తాంతం చెప్పగానే ధృతరాష్ట్రునికి ఒక అనుమానం వచ్చింది. " సంజయా ! మరి అంతప్రభావం కలిగిన శక్తిని తన వద్ద పెట్టుకున్న కర్ణుడు ఇంత కాలము అర్జునుడిని చంపకుండా ఎందుకు వదిలాడు. ఒక్కరిని మాత్రమే చంపగలిగిన శక్తి ఆయుధాన్ని అర్జునుడి మీద వేసి చంపితే యుద్ధం ఎప్పుడో ముగింపుకు వచ్చేది కదా! పాండవులు ఎప్పుడో యుద్ధం నుండి విరమించే వారు. మనలనువిజయలక్ష్మి వరించేది. ఇంత జన నష్టం తప్పి పోయేది కదా! యుద్ధానికి పిలిస్తే అర్జునుడు కర్ణునితో యుద్ధం చేయకపోతాడా ! కర్ణుడు ఇంత బుద్ధిహీనుడుగా ఎందుకు ఉన్నాడు. నా కుమారుడు కర్ణునికి ఎరందుకు గుర్తు చేయ లేదు అన్నాడు. అక్కడే ఉన్న నీవు కూడా ఎందుకు గుర్తు చేయ లేదు. చేతిలో ఉన్న మామిడి పండు తినడం మరచినట్లు ఉంది కదా! దీనికి మరేదైనా కారణము ఉందా " అని ధృతరాష్ట్రుడు ఆత్రంగా సంజయుని అడిగాడు. సంజయుడు " మహారాజా ! మేము గుర్తు చేయకుండా ఎందుకు ఉంటాము. ప్రతి రోజు మేమంతా సుయోధనుడితో కలసి మరునాడు నీవు శక్తి ఆయుధమును ప్రయోగించి అర్జునుడిని చంపాలి అని చెప్తూనే ఉన్నాము. కర్ణుడు కూడా అలాగే చంపుతానని అంటుండే వాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి