శ్రుతి, లయలు చాలా తెలివైన అమ్మాయిలు. ఎప్పుడు ఎవరు మొదటి ర్యాంక్ వస్తారో చెప్పడం కష్టం. పోటాపోటీగా చదివేవారు. దాంతో లయకు ఈర్ష్యాభావం పెరిగి, శ్రుతితో మాట్లాడడం మానేసింది. శ్రుతి కూడా లయను పట్టించుకోవడం మానేసింది. శ్రుతి క్లాస్ ఫస్ట్ వస్తే, లయ కుళ్ళుకొని, ఎంతో బాధపడుతూ, ఆరోజు ఏది తినక పోయేది.
ఒకరోజు అన్ని సబ్జెక్టుల్లో కలిపి, ప్రత్యేకమైన పరీక్షను నిర్వహించారు. ఫస్ట్ వచ్చిన వాళ్లకు విలువైన బహుమతి ఉంటుంది. ఆరోజు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న శ్రుతి ఆ పరీక్ష రాసిన తర్వాత అనారోగ్య కారణంతో అనుమతి తీసుకొని, ఇంటికి వెళుతుంది.
రెండు రోజుల తర్వాత ఉపాధ్యాయులు ప్రత్యేకంగా శ్రుతిని పిలిపించారు. ఏం జరుగుతుందో చూద్దామని, వీరికి తెలియకుండా లయ అక్కడకు వెళ్ళింది. దొంగచాటుగా గమనిస్తుంది. ఉపాధ్యాయులు శ్రుతితో "నువ్వు ఎన్నడూ లేనిది పరీక్షలో మూడో స్థానంలోకి వచ్చావు. మీ అనారోగ్య కారణంగా ఇలా జరిగిందని మాకు తెలుసు. అందుకే నీకు కొన్ని మార్కులు కలిపి, నిన్ను ప్రథమ స్థానంలో నిలిపి, నీకు ప్రథమ బహుమతిని ఇవ్వాలని నిశ్చయించాము. ప్రథమ స్థానం వచ్చిన లయకు ద్వితీయ బహుమతిని ఇవ్వాలని నిశ్చయించాము. సంతోషమే కదా!" అన్నారు. "అస్సలు లేదండి. నేను ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన మొదటి స్థానం వస్తానన్న గ్యారెంటీ ఏమిటి? కాబట్టి ప్రతిభావంతులకు న్యాయం చేయండి సర్." అన్నది శ్రుతి. చాటుగా వింటున్న లయ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత శ్రుతితో స్నేహం చేసింది. కలసి చదువుకోవడం మొదలుపెట్టారు శ్రుతిలయలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి