ద్రోణ పర్వము పంచమాశ్వాసము: 361 వ రోజు
సుయోధనుడు నారాయణాస్త్రాన్ని తిరిగి ప్రయోగించమని అశ్వత్థామకు చెప్పుట
అప్పుడు సుయోధనుడు " గురు పుత్రా ! నారాయణాస్త్రమును తిరిగి ప్రయోగింపుము " అన్నాడు. అశ్వత్థామ సుయోధనా ! రారాజా ! ఈ నారాయణాస్త్రం ఒక్క సారే ప్రయోగించాలి రెండవ సారి ప్రయోగిస్తే ప్రయోగించిన వారిని సంహరిస్తుంది. నారాయణుడు నా తండ్రికి ఈ అస్త్రమును ఇచ్చినప్పుడు అలాగే ఆదేశించాడు. యుద్ధములో వాహనములు దిగి ఆయుధములు కింద పెట్టడం మరణించుటతో సమమే కదా! అందుకని వాహనములు దిగి ఆయుధములు కింద పెట్టిన వారిని ఆ అస్త్రం ఏమీ చేయదు. శ్రీకృష్ణుడికి ఆ విషయం తెలుసు కనుక తన వారిని రక్షించుకున్నాడు. ఇక మనమేమి చేయగలము చెప్పు " అన్నాడు. సుయోధనుడు " అశ్వత్థామా ! పోనీలే. నారాయణాస్త్రం నిరుపయోగమైనంత మాత్రాన నిరుత్సాహపడవలసిన పని లేదు. మన వద్ద ఇంకా దివ్యాస్త్రాలు ఉన్నాయి కదా! వాటిని ఉపయోగించి పాండవులను గెలుస్తాము " అన్నాడు. అశ్వత్థామ అవును సుయోధనా ! అలాగే చేద్దాము.
అశ్వత్థామ పాండవులను ఎదుర్కొనుట
అని పాండవుల మీదకు యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధభూమిలో అశ్వత్థామకు ధృష్టద్యుమ్నుడు కనపడగానే కోపంతో ఊగిపోయాడు. తన నిశిత బాణాలతో ధృష్టద్యుమ్నుడి రథమును కూల్చి, అశ్వాలను చంపాడు. అతడి విల్లు తుంచి, కేతనమును విరిచాడు. ఇంతలో సాత్యకి ధృష్టద్యుమ్నుడికి సాయం వచ్చాడు. అశ్వథ్థామ ఒకే బాణంతో సాత్యకిని మూర్ఛపోయేలా కొట్టాడు. తరువాత ధృష్టద్యుమ్నుడిని మూర్ఛిల్లజేసి విజయోత్సాహంతో సింహనాదం చేసాడు. అది చూసి భీమార్జునులు అశ్వత్థామను ఎదుర్కొన్నారు. వారికి తోడుగా చేది దేశపురాజు సుదర్శనుడు, వృద్ధక్షత్రుడు వారికి సాయంగా వచ్చారు. అశ్వత్థామ తన పదునైన బాణాలతో వృద్ధక్షత్రుడిని, సుదర్శనుడిని తలలు నరికివేసాడు. అశ్వథ్థామ ఎక్కడ చూసినా తానే అయి యుద్ధము చేస్తున్నాడు. అశ్వత్థామ పరాక్రమానికి పాండవ సేనలు పారిపోతున్నాయి. భీమార్జునులు తమ శాయశక్తులా పాండవ సేనలకు ధైర్యం చెప్తున్నారు. అర్జునుడు అశ్వత్థామ మీద నిశిత శరములు ప్రయోగించాడు. అశ్వత్థామ కోపించి ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుడి మీద ప్రయోగించాడు. ఆ అస్త్రం అగ్ని జ్వాలలను విరజిమ్ముతూ అర్జునుడి మీదకు వచ్చి త్రుటికాలంలో పాండవుల సైన్యం ఒక అక్షౌహినిని నాశనం చేసింది. కౌరవ ప్రముఖులంతా కృష్ణార్జునులతో సహా ఆగ్నేయాస్త్రానికి బలి కాగలరు అనుకుని జయజయధ్వానాలు చేసారు. కాని అర్జునుడు తన వద్ద ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆగ్నేయాస్త్రాన్ని నిర్వీర్యం చేసాడు. కృష్ణార్జునులు శంఖనాదం చేసారు. పాండవ సేనలు జయజయధ్వానాలు చేసారు. అప్పటి వరకు జయధ్వానాలు చేసిన కౌరవసేనలు ఇది చూసి పారిపోయాయి. అశ్వత్థామ పరాభవంతో తలదించుకున్నాడు. తన చేతిలోని దివ్యాస్త్రాలను కింద వేసి. నాకు దివ్యాస్త్ర బలం లేదని తెలిసి పోయింది. సిగ్గు మాలి ఇంకా ఎందుకు యుద్ధం చేయడము. వెంటనే యుద్ధం మాని వేస్తాను " అని మనసులో అనుకుని రథము దిగి పాదచారి అయి యుద్ధభూమిని విడిచి పోతున్నాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి