సామెతల ఊట- సునందమ్మ నోట; - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 

 సామెత -334; ఇక్కడ మునిగి అక్కడ తేలేవాడు
**
"హవ్వ! సూశినవా అవ్వా! గాని యవ్వారం. నేను మొదటి సంది సూత్తనే వున్నా. గాడు శిన్న సన్నోడు గాదు. గాని బుద్దులు మామూలు బుద్దులు గావని. ఇంటోళ్ళతో శెప్తెనే" ఎహే! నోర్మూసుకో. ఎవలన్న ఇంటే నిన్నే తప్పుబడ్తరు " అంటే బయమయ్యి ఊకున్న. గింత కాడికొచ్చినంక శెప్తేమైతదని దైర్నంగ నీ తానికి వొచ్చి శెప్తున్న అవ్వా!
 " ఎవలు శెల్లే! గంత పేరు శెప్పడాన్కి సుత బయం పడినవ్? ఎవలా పెద్దమడిషి! నా తాన నీకేం బయం నాకు ఏ ముచ్చెటి శెప్పినా బాయిలేశినట్టే.గట్ల దాస్కుంట తెల్సుగద. పాతాళ గరిగేసి గెల్కినా పట్టు దొర్కనంత దాప్రికంగ ఉంట. ఎవలో శెప్పు శెల్లే. "
పలానాయినకి బగ్గ పేరుంది.ఎక్కడ సూశినా గాయినే. ఎవలిద్దర్కన్న తేడాలొత్తే పిల్శి తప్పున్నోళ్ళని దుమ్ము దుల్పినట్టు దుల్పుతడని అంటరు.గట్లెట్ల అందరి నోళ్ళల్ల నానిండో గని పతొక్కలు అబ్బో శానా మంచోడు అనుడే అవ్వా! "
 'ఎవలో గని గా మడిషి శానా మంచోడని  నీ మాటల్లనే తెలుత్తుంది శెల్లే!"
" అగ్గో అవ్వా! నేను సుత గట్లనే అన్కున్న గని  గాయన పైనో తీరు లోపలో తీరని ఆటెంక తెల్శి అద్రిపోయిన. జెగ్గయ్య, కొండయ్య కవల పిల్లలొతికె ఎంత మంచిగుండేటోళ్ళో మనూల్లె పతొక్కలికి తెల్సుగద. గాల్ల  నడ్మల గిప్పుడు పచ్చిగడ్డేత్తే బగ్గుమంటుంది గది సుత తెల్సుగద అవ్వా? గంత అతకం పతకంగ ఉండేటోళ్ళు గట్లెట్ల యిడిపోయిర్రు? ఏమైందని అందరం అన్కోబట్టినం.గెట్ల కాడనా ?శేని కాడనా? పంచాతి యాడొచ్చుంటదని అన్కున్నం గద. గీ దానంతట్కి కార్నం గా పెద్ద మడిషేనట.ఉన్నయి లేనియి షికాయితులు శెప్పి యిద్దర్ని యిడదీశి మెల్లగ జారుకుండు."
 "గిదంత నీకెట్ల తెల్సు శెల్లే? ఊకెనే బట్ట కాల్శి మీదెయ్య కూడదంటరు గద!లేన్పోని పాపం మనకంటుకుంటది జెర జాగర్త మరి."
" అవ్వా! నాకెందుకు ఊరి మీది ముచ్చెట్లు అన్కున్న గని, శివరాకరికి మా అన్నకి నాకు కయ్యం బెట్టాలని సూశిండు. సొయామూ, కుద్ధుగ మా వొదినే శెప్పింది గాబట్టి తెల్శింది. ఆత్తంత మా అన్నే అనుబగిత్తుండు. నాయినాత్తిల నాకు సుత బాగమొత్తదని గాయిన తాన నేను మొర బెట్కున్ననట.గట్ల మా అన్న వొదినెల్తో శెప్పిండంటవ్వా;"
" మా అన్న గయ్యాల్టి సంది మన్సిప్పి మాట్లాడట్లే.  "ఏందన్నా! అంటే ఏం లేదు శెల్లే అని పోను పెట్టేత్తుండు. ఏందీ అన్నకేమన్న పెయ్యి బాగలేదా? అని వొదిన్ని అడ్గితే" నువ్వేమన్కోవు గద! గీ దానంతట్కి నువ్వే కార్నం అంది. అస్లిష్యం ఏందో అడగంగ అడగంగ శెప్పిందవ్వా! "
 " నన్ను సాకి పెద్ద జేశి మంచి సంవందం యిచ్చి పెళ్ళి జేశిండు మా యన్న.ఏనాడు పుట్టింటి పెట్టుబోతల్కి గింత తేడా రానీలే. గస్మంటి అన్నని గిన్ని అడ్గుతన, గట్లంటనా అవ్వా? నువ్వే శెప్పు."
 " ఓషోష్ గిక్కడ మున్గి  గక్కడ తేలిండన్న మాట.నిన్నే బద్నాం జేయాలనుకుండు  గని గాయినే బద్నం అయ్యిండు గద !ఇగ సాలదా శెప్పుతోటి గొట్టినట్టయ్యింది. గాని నోరు వడ గిట్ల ఇంకెందరి నడ్మల శిచ్చు బెట్టి గాని పబ్బం గడ్పుకుంటడు? గిన్నాళ్ళు గందుకేనా నీ ముకంల కళ లేంది. గట్లాంటోళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు బాగనే తాకిడి తలిగిద్ది.గప్పుడు ఎవలికి శెప్పుకోలేక గిలగిల్లాడి పోతడు సూడు."
" గట్లనే కావాలె! తెల్శి రావాలె అవ్వా!"
 " గదండీ సంగతి!"ఇక్కడ మునిగి అక్కడ తేలేవాడు"  అంటే గిదే మరి.గిస్మంటోళ్ళతో శానా జాగర్తగ ఉండాలె."
కామెంట్‌లు