స్రవంతి ఈమధ్య దిగులుగా ఉంటుంది. ఎవరితోనూ సరిగా మాట్లాడడం లేదు. అన్నం సరిగా తినడం లేదు. తల్లిదండ్రులు, స్నేహితులు కారణం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఏమీలేదని మాట దాట వేస్తుంది. తల్లిదండ్రులకు దిగులు ఎక్కువైంది.
రాఖీపౌర్ణమి వచ్చింది. చెల్లెలికి రాఖీ కట్టడానికి, స్రవంతి పెద్దమ్మ కొడుకు విజయుడు వచ్చాడు. స్రవంతి దిగులుగా ఉంటున్న సంగతి తెలిసింది. కారణం ఏమిటో చెప్పమన్నాడు. లేకపోతే తన మీద ఒట్టు అన్నాడు. అప్పుడు స్రవంతి చెప్పింది. తన తరగతిలో తోటి పిల్లలలో చాలామంది పేర్లు మోడరన్ గా భలే ఉన్నాయని, తనకేమో తల్లిదండ్రులు చాలా పాతకాలపు పేర్లు పెట్టారని, తాను చాలా పాతకాలం దానినని, ముసలమ్మ అని, స్నేహితులు హేళన చేస్తున్నారని చెప్పి ఏడుస్తుంది. అప్పుడు విజయుడు "నీ పరిస్థితే ఇలా ఉంటే నా పరిస్థితి ఏమని చెప్పుకోను. నా పేరు కూడా చాలా పాతది. నాకు ఏదైనా మోడరన్ పేరు పెట్టి ఉంటే ఎంత బాగుండేది అని ఎప్పుడూ అనిపిస్తుంది." అని వాపోయాడు విజయుడు.
అప్పుడే అక్కడికి వచ్చిన స్రవంతి స్నేహితురాలు శ్రావణి "చూడు స్రవంతీ! మీ పేరులో ఉన్న గొప్పతనం నీకే తెలియదు. స్రవంతి ఇంగ్లీషులో రాస్తే SRAVANTI. అందులో ఉన్న అక్షరాలతో ఎన్నో పేర్లు తయారు చేయవచ్చు. తెలుసా? శ్రావణి, రాణి, వాణి, శ్రీవాణి, అనిత, వాసంతి, అవంతి, అనిత, వనిత అంటూ మొదలు పెట్టింది శ్రావణి. "ఆగాగు! నేను చెబుతా చూడు." అంటూ మరిన్ని పేర్లు చెప్పసాగాడు విజయుడు. "నేను చెపుతా" అంటూ మరికొన్ని పేర్లు చెప్పింది స్రవంతి. ఇలా అనంతంగా పేర్లు వస్తున్నాయి. అప్పుడు శ్రావణి ఇలా అన్నది.
"స్రవంతి అంటే నది అని అర్థం. నీ మనసు పవిత్రమైనది అయితే, నువ్వు పవిత్రమైన నది అన్నమాట. పేరుకు అర్థం తెలియని వేస్ట్ ఫెలోలు హేళన చేస్తూ ఉంటారు. వారిని పట్టించుకోనవసరం లేదు." "బాగా చెప్పావు." అన్నాడు విజయుడు.
"మరి నీ సంగతి చెప్తా చూడు. విజయుడు అంటే అర్జునుడు. అతనికి ఎక్కడా పరాజయం లేదు. కష్టపడి చదువు మంచి మార్కులు సంపాదిస్తే, నిన్ను ఓడించే వాడెవడు? స్రవంతీ! నువ్వు క్లాస్ ఫస్ట్ కదా! టీచర్లు ఎప్పుడూ నిన్నే మెచ్చుకుంటారు కదా! మరి నీకు మంచి పేరు ఉన్నట్లు కదా! స్రవంతి అంటే, మంచి విద్యార్థిని అని పాఠశాలలో మంచి పేరు ఉంది. ఇప్పుడు చెప్పు ఆ పేరు మార్చుకుంటావా?" అన్నది శ్రావణి. "అస్సలు మార్చుకోను. ఎవరినీ పట్టించుకోను." అన్నది స్రవంతి. "నేను కూడా పరీక్షల్లో బాగా చదివి, ఇప్పుడు విజయం సాధిస్తాను." అన్నాడు విజయుడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి