లాస్ట్ పంచ్ మనదైతే: - కొత్త విరిత
 

ప్రతి విషయానికీ ప్రతి ఒక్కరి దగ్గర ఒక వివరణ ఉంటుంది.
ముఖ్యంగా, ప్రతి ఒక్కరికీ చివరి మాట తమదే కావాలని ఉంటుంది.
కూరలో ఉప్పు ఎందుకు ఎక్కువ అయింది అని అడగటానికి భర్త దగ్గర ఒక కారణం ఉంటుంది.
రోజంతా ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు, వంట పనుల మధ్య పొరపాటున ఉప్పు ఎందుకు ఎక్కువ అయిందో చెప్పటానికి భార్య దగ్గర కూడా ఒక కారణం ఉంటుంది.
అక్కడ అసలు విషయం ఉప్పు కాదు.
ఎవరి వివరణ బలంగా ఉందన్నదే ముఖ్యం అవుతుంది.
చివరికి ఎవరిది చివరి డైలాగ్ అయితే, వారే గెలిచినట్లు భావిస్తారు.
ఆఫీసులో కూడా ఇదే కథ.
రిపోర్ట్ చూసి "ఎందుకు ఆలస్యమైంది?" అని అడగటానికి మేనేజర్ దగ్గర ఒక కారణం ఉంటుంది.
సమయానికి పని పూర్తి కావాలని అతని బాధ్యత.
అదే సమయంలో, టెక్నికల్ సమస్యలు, డిపెండెన్సీలు, అనుకోని అడ్డంకుల వల్ల పని ఎందుకు ఆలస్యం అయిందో వివరించటానికి ఉద్యోగి దగ్గర కూడా ఒక కారణం ఉంటుంది.
ఇక్కడ కూడా అసలు సమస్య కంటే, ఎవరి వాదన చివరి వరకు నిలబడుతుందన్నదే పెద్ద విషయం అవుతుంది.
ఇలా చూస్తే జీవితమంతా కారణాల చుట్టూనే తిరుగుతుంది.
భర్తకు ఒక కారణం, భార్యకు ఒక కారణం.
మేనేజర్‌కు ఒక కారణం, ఉద్యోగికి ఒక కారణం.
తల్లిదండ్రులకు ఒక కారణం, పిల్లలకు ఒక కారణం.
ఎవ్వరూ తమను తాము తప్పు అని అనుకోరు.
ఎందుకంటే ప్రతి మనిషి తన కోణంలో సరైనవాడే.అందుకే చాలాసార్లు చర్చలు సమస్యను పరిష్కరించటానికి కాకుండా, చివరి మాట చెప్పటానికి సాగుతాయి.
సినిమాల్లో హీరో అందరూ మాట్లాడాక ఒక పంచ్ డైలాగ్ చెబితే థియేటర్ మొత్తం చప్పట్లతో మారుమోగుతుంది.
"లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరబ్బా!" అనిపిస్తుంది.
కానీ నిజ జీవితంలో ప్రతి వాదనను గెలవాల్సిన అవసరం లేదు.కొన్ని సందర్భాల్లో చివరి మాట కంటే, ఎదుటివారి మాట వినడమే గొప్ప విజయం.ఎందుకంటే సంబంధాలను నిలబెట్టేది వాదనలో గెలుపు కాదు, పరస్పర అవగాహన.
"చివరి మాట చెప్పడంలో కిక్ ఉంటుంది... కానీ అవసరం లేని చోట ఆగిపోవడంలో క్లాస్ ఉంటుంది."

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Awesome
అజ్ఞాత చెప్పారు…
Super writeup 👌