ప్రేమ పతంగి...: - నాగమణి రావులపాటి...
 

మనసు మైదానంలో విరిసిన రంగుల వింత...
ఆశల గాలికి రెక్కలు విప్పిన ప్రేమ పతంగి...
నీలి నింగిలో విహరించే ఒక అందమైన కల...
కనురెప్పల చాటున దాచుకున్న నిలువెత్తు ఆశ...
నమ్మకమనే దారాన్ని ప్రాణంగా అల్లుకొని...
అభిమానపు గాలివాటంతో పైపైకి ఎగసి...
మేఘాల అంచులను తాకే ఊహల పల్లకి...
అంతులేని ఆకాశంలో అన్వేషణల సవ్వడి...
ఒక్కోసారి గాలి తుఫానులా ఎదురు తిరిగినా...
కన్నీటి జల్లులు రెక్కలను తడిపి ముంచినా...
ధైర్యం అనే తోకను ఊపుతూ నిలబడుతుంది...
నిజమైన అనుబంధం ఎప్పుడూ ఓడిపోనంటుంది...
నీ చూపుల సూర్యకాంతి తగిలిన ప్రతిసారి...
వర్ణరంజితమై వెలుగుతుంది నా ఈ పతంగి...
దూరం పెరిగే కొద్దీ దారం బలపడుతుందే కానీ...
ప్రేమ బంధం తెగిపోవాలని ఎప్పుడూ కోరుకోదు...
కంటికి కనపడని ఆత్మీయ భావాల ముడి ఇది...
గాలిలో తేలుతున్నా నేల మీద ఉన్న నీ పిడికిలిదే గెలుపు...
ఎన్ని పతంగులు ఎదురొచ్చి పంతం పట్టినా...
మన ప్రేమ పతంగి వినీలాకాశంలో ఓ అద్భుత కావ్యం...
కామెంట్‌లు