సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం


 సామెత -322: ఇనుము విరిగితే అతకొచ్చు గని - మనసు విరిగితే అతకలేం అంటే
***
"నువ్వెన్నన్న శెప్పవ్వా! ఒక్కపాలి ఏదన్న తేడా వత్తే గది మల్ల బోదు. గా తేడా ఎప్పుడూ మన్సును పీకుతనే వుంటది. గట్లెందుకయ్యింది? గట్లెట్ల జర్గింది? గట్ల గాకుంటె బాగుండు గద అన్పిస్తది అవ్వా!"
"ఏంది శెల్లే! ఏవైంది? నీ మాటల్ల శానా రంది అగవడ్తోంది.ఎందుకంత బుగులు వడ్తున్నవ్? ఎవల్తోనన్న పంచాతి అయ్యిందా? గాల్లేవన్నా నీ మన్సు కట్టబెట్టేటతట్టు అన్నరా? ఏందో శెల్లే నువ్వెప్పుడూ గిట్లుండంగ సూల్లే? అస్లు నువ్వెవలి జోలికి పోవుగద! నీతో పంచాతేందే శెల్లే!"
 "గదే అవ్వా! ఎవ్వలి జోలికి పోను.ఎవ్వలి యిష్యం పట్టిచ్చుకోను. గా మిషిని కుట్టుకుంట నా బత్కేదో నేను బత్కుతుంటే గట్ట బట్ట గాల్శి మీదేత్తే  ఎంత బాదయితవ్వా? గిన్నాల్ల సంది సూత్తున్నవ్. నేనెవలినన్న నల్లనంగ,తెల్లనంగ సూశినవా శెప్పు?"
 "నిన్నన్నోళ్ళకే పాపం తలుగుద్ది శెల్లే!గటు పుట్టింటి నోళ్ళనే,గిటు అత్తింటోళ్ళనే ఏ యిష్యంలనయినా వొక్క మాటనంగ,గింత సాయమడ్గంగ సూల్లే. రెక్కల కట్టం మీద యిద్దరు పిల్లగాండ్లని సక్కగ సద్విచ్చినవ్! గాల్లెంత బుద్ధివంతులు. నీది,మర్దిది కట్టం అర్తం శేస్కొని సక్కంగ సద్వి ఉజ్జోగాలు శేస్కుంటుర్రు.గాల్లయన్నీ ఫిరీ సీటులే."
"అవునవ్వా! పాపం నా బిడ్డలు ఒక్కత్యేపన్న ఎద్రికిచ్చి మాట్లాల్లే! పెట్టింది తిన్నరు,తెచ్చింది కట్కుకుర్రు. గాల్లంతట గాల్లే తోటి పొల్లగాండ్లకి టూషన్లు  శెప్పి పైన కర్సులు ఎల్లదీస్కుర్రు. సుట్టుపక్కన ఉన్నోళ్ళు గిప్పటి దన్క మీ పిల్లల ముచ్చెటి మర్వనే లేదు శెల్లే!"
"అగ్గో! మీ అందర్కి తెల్సుగద అవ్వా! గిప్పుడు పిల్లగాండ్లు మనింటి సుట్టు శానా పెద్ద జాగుంది గద.గా బెంగులూరు పెంకింట్ల ఎందుకుండాలె.కోతులొచ్చి పెంకుల మీద ఎగురవట్టి ఇల్లంత పొటుకు బెట్టె ఆనొత్తె ఇంట్లె గిన్నలన్ని గా కారేతాన బెట్టుడు. అద్దమ్మ రేతిరి ఆనొత్తె గా నీళ్ళు ఎత్తిపోసుడే.ఇంటి నల్గురికి కంటిమీద రెప్ప వడేది కాదు. గట్ల బత్కినం.పిల్లలు శేతికొచ్చి శిన్నదో పెద్దదో ఉజ్జోగం జేస్కుంట పైసలు లోన్లడిగి గడికింత కడ్తమని తెచ్చి గాళ్ళ పైసల్తో ఇల్లు కట్టినం. గస్మంటిదీ మా అత్తోల్లంత మాకేదో మూటలు మూటలు గట్టి మాకు,మా పిలగాండ్లకే పెట్టిర్రనీ ఆడిపోస్కుంటె  మత్తు బాదైతందవ్వా!"
అవును శెల్లే! నువ్విప్పుడు పచ్చనోటొతికె రెపరెపలాడ్తుంటే కండ్లల్ల నిప్పులు బోస్కుంటుర్రన్న మాట."
"అవునవ్వా! గప్పటి సంది మాటల్లేవ్.ఎవలి మానాన ఆళ్ళం బత్కుతున్నం. గస్మంటిది గియ్యాల వాళ్ళ పొల్ల లగ్గం కుదిరిందని.బొట్టుశెప్ప వొచ్చిర్రు. నాకైతే గయ్యాల అన్న మాటలే కండ్లల్ల మెదుల్తున్నయ్.ఎన్ని సాపెన్లు పెట్టిర్రో తల్సుకుంటే వొంటి మీద ఎంట్రికలు నిక్కబొడుత్తయి తెల్సా అవ్వా! "
 అవును శెల్లే గందుకే మన పెద్దోళ్ళు "ఇనుము విరిగితే అతకొచ్చు గని మన్సు యిరిగితే అతుకుతదా? " అన్నట్టుంది శెల్లే!"
 " నువ్వన్నది అచ్చరాల నిజ్జం అవ్వా! గందుకే అస్సలు మాట్లాడ బుద్ధవ్వట్లే.
'అవును శెల్లే! నిజం. ఇన్ప ముక్కల్ని ఏడెక్కిచ్చి ఒకటిగ చెయ్యొచ్చు గని,మన్సు యిరిగితే ససేం శెయ్యలేం.ఏమన కవి సుత గిస్మంటి పజ్జేలు శానా రాశి మనకి అందిచ్చిండు."
"అవునవ్వా!"
 "గదండీ సంగతి! "ఇనుము విరిగితే అతకొచ్చు గని మన్సు యిరిగితే  అత్కదు".గందుకే గీ సామెత పుట్టింది."
కామెంట్‌లు