నీవు సృష్టికర్తవు: - వరలక్ష్మి యనమండ్ర


మగువా ఓ మగువా... నీవేగా ఇంటికి ఉషోదయం  
చీకటిని తొలగించి వెలుగుకు దారి చూపే కిరణం  

నీ సున్నిత హృదయం ఒక అమృత కలశం  
అందులో ప్రేమతో బాధలకు తీరును దాహం  

పిల్లల కలలకు నువ్వేగా పదిలమైన గూడు  
వారి ఆశలకు రెక్కలిచ్చి ఎగిరేలా చేసే తోడు 

భర్త కలలకు నువ్వు సార్థకతను చేకూర్చే వారధి  
అలసినప్పుడు ఆదర్శమై నిలిచి ఊతనిచ్చే సారధి

తల్లిదండ్రుల స్వప్నాలకు నువ్వు నెరవేరిన ఆకారం
వారి కన్నులో మెరిసే గర్వానికి నువ్వే సదా  కారణం  

కుటుంబం అనే నావకు నువ్వు తెరచాపవి  
ఎదురుగాలికైనా దిక్కు మళ్ళించగల సరంగువి  

సమాజ స్వపైనానికి నువ్వు మట్టిలో కలిసిన విత్తనం  
నేడు చిన్నదిగా కనిపించినా రేపు అయ్యేను మహావృక్షం

కష్టమొస్తే వజ్రంలా  నిరంతరం తట్టుకుంటావు  
బాధొస్తే నదిలా స్వీకరించి మున్ముందుకు సాగుతావు  

కరుగుతూ  వెలుగునిచ్చే కొవ్వొత్తివోలె త్యాగమయివి
మమత పంచుతూ మంచితనంతో మ్రోగే రాగమయివి 

నీ ధైర్యం పిడుగుపడ్డా చెక్కుచెదరని పర్వతసమం
నీ ఓర్పు సముద్రమంత లోతైనది కొలవలేని నిజం

ఆకలితో ఉన్నా చివరిగా తినేది నువ్వేనమ్మా  
నిద్ర కరువైనా మొదట లేచేది నువ్వేగా పూరెమ్మా 

అందరి ఆశల ఆలంబనవు వారిభయాలకు ధైర్యం
నీ మాటలో ఓదార్పు చేతల్లోనే ఉంటుంది ఊతం

ఎందుకంటే నువ్వు కేవలం కాదు కాపలాదారువు 
నువ్వు కలకు అండగా నిలిచిఊపిరిపోసే సృష్టికర్తవు


కామెంట్‌లు