ఇచ్చిన హామీ : - యామిజాల జగదీశ్
 

ఒక మనిషికి ఇచ్చే నిష్ప్రయోజనమైన మాట, కల్పించే అబద్ధపు నమ్మకమో, లేదా ఆశ పెట్టి మరిచిపోవడమో ఎంతటి తీవ్రమైన పరిణామానికి దారితీస్తుందో చెప్పలేం....🥹
అది మంచు కురిసే చలికాలం. ఒక ధనవంతుడు తన కారులో ఇంటికి వచ్చాడు. అతడి ఇంటి దగ్గర ఒక ముసలాయన చలికి వణుకుతూ ఉన్నాడు.
అతడిని చూసి జాలిపడిన ధనవంతుడు "మీ దగ్గర మంచి వస్త్రం లేదా?" అని అడిగాడు. దానికి ఆ వృద్ధుడు "లేదయ్యా, ఈ చిరిగిపోయిన చొక్కా ఒక్కటే నా దగ్గర ఉంది" అని చెప్పాడు.😔
వెంటనే ఆ ధనవంతుడు "నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇంట్లోకి వెళ్ళి ఒక మంచి వెచ్చని వస్త్రం తీసుకువస్తాను" అని చెప్పి లోపలికి వెళ్ళాడు. అయితే లోపలికి వెళ్ళాక కొన్ని ఫోన్ కాల్స్ రావడంతో, ఆ ధనవంతుడు వృద్ధుడికి ఇచ్చిన మాట మరిచిపోయి ఫోన్లలో మునిగిపోయాడు. అలాగే నిద్రపోయాడు కూడా..
ఉదయాన్నే ఆ వృద్ధుడి గుర్తురాగానే కంగారుగా లేచి ఇంటి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశాడు. అక్కడ కనిపించిన దృశ్యం అతడిని తీవ్రంగా కలచివేసింది. ఆ ప్రదేశంలోనే ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయి పడి ఉన్నాడు...
అతడి చేతిలో ఒక ఉత్తరం ఉంది. ధనవంతుడు దాన్ని తీసుకుని చదివాడు. అందులో.....
"అయ్యా...! ఇన్నాళ్ళూ నా దగ్గర ఉన్న ఈ చిరిగిన చొక్కాతోనే కాలాన్ని వెళ్ళదీశాను. అది కష్టంగా ఉన్నా, చలిని తట్టుకోగలననే నమ్మకం నన్ను ధైర్యంగా నిలబెట్టింది. ఈ చొక్కాతోనే నన్ను నేను దృఢంగా ఉంచుకున్నాను. చలిని తట్టుకునే శక్తి కూడా నాలో ఉంది...
ఎప్పుడైతే మీరు వచ్చి వెచ్చని వస్త్రం ఇస్తానని చెప్పారో, ఆ క్షణం నుంచే నా మనసులోని ధైర్యం సడలిపోయింది. చలిని తట్టుకునే శక్తిని కూడా కోల్పోయాను" అని రాసి ఉంది....
మనం ఒకరికి ఇచ్చే మాట వాళ్ళలో కొండంత నమ్మకాన్ని నింపుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఆ మాట నిలబెట్టుకోకపోతే వాళ్ళ మనసు ముక్కలైపోతుంది. అబద్ధపు హామీలు ఇచ్చి ఎవరినీ నమ్మించి మోసం చేయకూడదని గ్రహిద్దాం.


--------
కామెంట్‌లు