సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 కర్ణ పర్వము ప్రథమాశ్వాసము: 371 వ రోజు


సుయోధనుడు ధర్మజుడిని ఎదుర్కొనుట
సుయోధనుడు ధర్మరాజును ఎదుర్కొని ధర్మరాజు మీద తొమ్మిది బాణములు ప్రయోగించి ఒక బాణంతో సారథిని కొట్టాడు. అందుకు ధర్మజుడు కోపించి సుయోధనుడి హయములను, సారథిని కొట్టి, పతాకమును విరిచి, సుయోధనుడు పట్టుకున్న ఖడ్గమును విరుగ కొట్టాడు. సుయోధనుడు రథము దిగి యుద్ధము నుండి తొలగిపోయాడు. అది చూసి కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ ఇతర రాజులు సుయోధనుడికి సాయం వచ్చారు. భీమార్జున నకుల సహదేవులు ధర్మరాజుకు సాయం వచ్చారు. అప్పటికి అపహార్ణం అయింది. యయోధులంతా ఒక చోటుకు చేరుకుని ఒకరిని ఒకరు ఉత్సాహపరుస్తూ యుద్ధము చేస్తున్నారు. యుద్ధము భయంకరంగా జరుగుతూ ఉంది " అని చెప్తున్న సంజయుడి మాటలకు అడ్డు తగిలిన ధృతరాష్ట్రుడు " సంజయా ! అందరి గురించి చెప్తున్నావు మా సుయోధనుడు ఏమయ్యాడు " అని అడిగాడు. సంజయుడు " ధృతతాష్ట్ర మహారాజా ! సుయోధనుడు విరధుడు అయ్యాడే కాని యుద్ధము నుండి పారి పోలేదు. వేరొక రథము సమకూర్చుకుని ధర్మరాజును ఎదుర్కొన్నాడు. ధర్మరాజు సుయోధనుడిని దూరము నుండి చూసి సారథితో సుయోధనుడి రథము ముందుకు పోనిమ్మని చెప్పాడు. మహా కోపంతో సుయోధనుడు ధర్మరాజు విల్లు విరిచాడు. ధర్మరాజు మరొక విల్లందుకుని నీ కుమారుడి విల్లు తుంచాడు. నీ కుమారుడు మరొక విల్లందుకొని ధర్మరాజు పై బాణములు గుప్పించాడు. ఒకరి మీద ఒకరు బాణములు గుప్పించి తీవ్రంగా గాయపరచుకున్నారు. సుయోధనుడు విసిరిన బల్లెమును తుంచి ధర్మరాజు ఒక శిలీఖముతో సుయోధనుడిని శరీరం చీలేలా కొట్టాడు. సుయోధనుడు గదతో కిందికి దిగి ధర్మరాజు మీదకు రాసాగాడు. ధర్మరాజు శక్తి బాణమును సుయోధనుడి మీదకు వేసాడు. సుయోధనుడు తిరిగి రథము ఎక్కి ధర్మజుని మీద బాణప్రయోగం చేసాడు. కాని అప్పటికే సుయోధనుడికి బాగా రక్త స్రావం అయింది కనుక ఒకింత మూర్ఛిల్లాడు. అది చూసి కృతవర్మ ధర్మరాజును ఎదుర్కొన్నాడు. భీన్మసేనుడు కృతవర్మను అడ్డుకున్నాడు. అప్పుడు కౌరవ సైన్యము కృతవర్మకు సాయంగా వచ్చాడు.
కురు పాండవుల సమరం*
 సుయోధనుడు తేరుకుని ఎదురుగా కనిపించిన అర్జునుడి మీద పదునైన బాణములు వేసాడు. వెంటనే అర్జునుడు సుయోధనుడి పతాకమును తుంచి సారథిని హయములను కొట్టాడు. అశ్వత్థామ ఆ బాణములను మధ్యలోనే కొట్టాడు. అశ్వత్థామ ఆబాణములను మధ్యలో తుంచాడు.అర్జునుడు సుయోధనుడిని వదిలి అశ్వత్థామను ఎదుర్కొని అతడి విల్లు విరిచి హయములను సంహరించాడు. ఇంతలో కృపాచార్యుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు కృపాచార్యుని ధనస్సును ఖండించాడు. కృతవర్మ అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు కృతవర్మ విల్లు ఖండించి పతాకమును పడేలా కొట్టి హయములను చంపాడు. ఇంతలో తనను ఎదుర్కొన్న దుశ్శాసనుడిని అర్జునుడు ఎదుర్కొని అతడి విల్లు రెండుగా ఖండించాడు. అర్జునుడు వీరిని వదిలి కర్ణుడి వైపు తన రథము పోనిచ్చాడు. అది చూసి కర్ణుడు అర్జునుడిని మూడు బాణములతోను కృష్ణుడిని ఇరవై బాణములతోను శరీరం చీరుకు పోయేలా కొట్టాడు. కర్ణుడు అప్పటి వరకు సాత్యకితో యుద్ధము చేస్తూ అర్జునుడు రాగానే ఇరువురిని ఎదుర్కొన్నాడు. అది చూసి యుయుత్సుడు, శిఖండి, చేకితానుడు, నకుల సహదేవులు, ద్రౌపదేయులు, ధృష్టద్యుమ్నుడు, ఉత్తమౌజుడు, ప్రభద్రకము, ఛేది, కరూశ, మాత్స్య, కేకయ రాజకుమారులు అర్జునుడికి సాయంగా వచ్చికర్ణుడు మీద పలు అస్త్ర, శస్త్రములు ప్రయోగించారు. కాని కర్ణుడు అత్యంత చాకచక్యముతో ఆ అస్త్రములను తిప్పికొట్టి పాండవ యోధులను వారి సైన్యాలను కకా వికలు చేసాడు. అది చూసి అర్జునుడు, కర్ణుడు ప్రయోగించిన అస్త్రములను అన్నింటినీ నిర్వీర్యము చేసి తన శిలీఖములతో కౌరవసేనను చెదరగొట్టాడు. అప్పటికి సాయం సమయం అయింది నలుపక్కలా చీకట్లు కమ్మాయి. అర్జునుడి ధాటికి ఆగలేక కౌరవ సేనలు పారి పోయాయి. పాండవసేనలు తమ విడిదికి చేరాయి. ఇలా కర్ణుడి మొదటి రోజు యుద్ధము ముగిసింది " అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు