తమిళం కు స్వేచ్ఛానువాదం : - యామిజాల జగదీశ్
 

తంజావూరు దగ్గర ఒక ఊరు. అక్కడ మాధవన్ అనే రైతు ఉన్నాడు.
నేల ఉంది, నీళ్లు ఉన్నాయి, కష్టపడే ఓపిక కూడా ఉంది. కానీ మూడేళ్ల నుంచి అస్సలు పంట పండడం లేదు.
ఊళ్లో ఉన్న జోతిష్యుడి దగ్గరికి పరిగెత్తాడు. జాతకం చూసిన జోతిష్యుడు, "నీకు రాహు దోషం ఉందయ్యా. రాహువు నీ పొలాన్ని ఆవహించాడు. 50,000 రూపాయలతో పరిహార పూజ చేయించాలి" అని చెప్పాడు.
మాధవన్ తన దగ్గర ఉన్న కాస్త నగలూ అమ్మేసి పూజ చేయించాడు. మరుసటి సంవత్సరం కూడా పంట పండలేదు.
కోపంతో ఇంకో పెద్ద జోతిష్యుడి దగ్గరికి వెళ్లాడు. ఆయన, "ఇది రాహువు కాదు, కేతువు నీ పొలాన్ని పట్టుకున్నాడు. ఇంకో పరిహారం చేయాలి" అన్నాడు.
మాధవన్‌కు విసిగొచ్చింది.
నేరుగా ఏటిగట్టున నిలబడి ఉన్న ఒక వృద్ధ పూజారి దగ్గరికి వెళ్లాడు. ఆయన జాతకాలు చూడడు, మనుషులను మాత్రమే గమనిస్తాడు.
మాధవన్ అరిచాడు, "స్వామీ, నా జాతకంలో ఏ దోషం ఉందో చూసి చెప్పండి. రాహువా, కేతువా?"
పూజారి అతడి జాతకం తీసుకున్నాడు. ఒక చూశాడు. మరుసటి నిమిషమే దాన్ని రెండు ముక్కలుగా చింపి నదిలో పారేశాడు.
మాధవన్‌కు కళ్లముందు లోకమంతా చీకటైపోయింది. "ఏంటి స్వామి ఇలా చేశారు!" అని అడిగాడు.
పూజారి నవ్వి, "దోషం జాతకంలో లేదయ్యా, నీ అలవాట్లలో ఉంది" అన్నాడు.
"మూడేళ్ల నుంచి నువ్వు ఏం చేస్తున్నావ్? కొత్త కొత్త విత్తనాలు కొంటున్నావ్, యూట్యూబ్ చూసి కొత్త మందులు కొడుతున్నావ్, జోతిష్యుల చుట్టూ తిరుగుతున్నావ్. కానీ నీ పక్క పొలం రాము ఏం చేస్తున్నాడో తెలుసా? రోజూ ఉదయం 5 గంటలకే పొలానికి వెళ్తున్నాడు. మట్టిని తాకి చూస్తున్నాడు. గట్లను బాగు చేసుకుంటున్నాడు."
"రాహువు నీ పొలాన్ని కప్పేయలేదు. నీ తొందరపాటే నీ కళ్లను కప్పేసింది. కేతువు నీ పొలాన్ని పట్టుకోలేదు, నువ్వు నలుగురి మాటలు విని తీసుకుంటున్న నిర్ణయాలే నీ పొలాన్ని పాడుచేస్తున్నాయి."
"జోతిష్యం అనేది వాతావరణ నివేదిక లాంటిది. వర్షం వస్తుందని చెబితే నువ్వు గొడుగు తీసుకెళ్లాలి. అంతేగానీ వర్షాన్ని ఆపడానికి పూజలు చేయకూడదు" అని చెప్పారు.
ఆ రోజు మాధవన్‌కు విషయం అర్థమైంది. పరిహారాల కోసం తిరగడం ఆపేశాడు.
తరువాత 6 నెలలు జోతిష్యం, యూట్యూబ్ ఏవీ చూడలేదు. రోజూ పొలంలోనే గడిపాడు. మట్టి గుణాన్ని అర్థం చేసుకున్నాడు.
ఆ సంవత్సరం ఆ ఊళ్లోనే అందరికంటే ఎక్కువ పంట అతడికే పండింది.
జాతకం చింపేసిన పూజారి దగ్గరికి పరిగెత్తుకెళ్లి, "స్వామి, రాహు దోషం పోయింది!" అని చెప్పాడు.
పూజారి నవ్వి, "రాహువు ఎక్కడికి పోలేదయ్యా, అక్కడే ఉన్నాడు. అతడు నీకు దోషం ఇవ్వడానికి రాలేదు, పాఠం నేర్పడానికి వచ్చాడు. నువ్వు ఆ పాఠం నేర్చుకున్నావ్, అంతే" అన్నాడు.
కామెంట్‌లు