పట్టుదల : - సరికొండ శ్రీనివాసరాజు


 ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. మన జట్టు ఫైనల్ కు చేరుకున్నది. ఫైనల్లో ప్రత్యర్థి టీం భయంకరమైన టీం. ఆ జట్టును ఓడించడం ఏ దేశానికి సాధ్యం కాదు. టాస్ గెలిచి ఆ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నది. 50 ఓవర్లలో 444 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనకు మన జట్టు బరిలోకి దిగింది. మహేశ్, వాసు ఓపెనర్లుగా దిగారు. మహేశ్ చాలా జిడ్డుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 90 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. "ఇలా ఆడితే ఓడిపోతాం." అనే వాసు హెచ్చరిస్తుంటే, "ఎలాగో ఓడిపోయే ఆటలో ఎందుకు కష్టపడాలి?" అన్నాడు మహేశ్. ఆ తర్వాత మహేశ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగుకు వచ్చిన సురేశ్ వాసుతో, "ఎలాగూ ఓడిపోయే ఆటనే కదా! తొందర తొందరగా ఆట ముగిస్తే, తర్వాత సమయం చాలా ఉంటుంది. నగరమంతా తిరిగివద్దాం. షాపింగ్స్ చేద్దాం. మంచి పార్టీ చేసుకుందాం." అన్నాడు. వాసు తల పట్టుకున్నాడు. ఆ తర్వాత సురేశ్ ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రాజేశ్ ఇలా వచ్చి, అలా ఔటయ్యి వెంటనే పెవీలియం ముఖం పట్టాడు.
        వాసు అడపాదడపా భారీ షాట్లు కొడుతున్నాడు. ఆ తర్వాత వచ్చిన గణేశ్ "ఎలాగూ ఓడిపోయే మ్యాచ్ కదా! ఎందుకు కష్టపడతావు?" అన్నాడు. వాసు పట్టించుకోలేదు. ఆ తర్వాత గణేశ్ చెత్త షాట్ ఆడి ఔటయినాడు. మన జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 102 పరుగులు సాధించింది. ఆ తర్వాత బ్యాటింగుకు వచ్చాడు సతీశ్. "సతీశ్! నీకు ఒక బంపర్ ఆఫర్! నాతో పాటు నువ్వు, అన్ని ఓవర్లు పూర్తయ్యేదాకా బ్యాటింగ్ చేస్తే, నీకు ఊహించని బహుమతులు ఇస్తా." అన్నాడు. సతీశ్ సింగిల్స్ తీస్తూ వాసుకు స్ట్రెకింగ్ ఇస్తున్నాడు. వాసు సిక్సర్లు ఫోర్లతో విరుచుకు పడుతున్నారు. వాసు బ్యాటింగ్ చూస్తూ కాసేపటి తర్వాత సతీశ్ కూడా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. సునాయాసంగా మన జట్టు విజయం సాధించింది. ప్రపంచ కప్ గెలిచింది. అప్పుడు వాసు సతీశ్ తో ఇలా అన్నాడు‌. "పట్టుదలతో గెలిచాను కాబట్టి సరిపోయింది. ఓడిపోతే మిగతా వాళ్లది కాదు తప్పు, బాగా ఆడిన వాళ్ళదే తప్పు, సెంచరీల కోసమే ఆడినాడని నిందలు వేయడం జనానికి పరిపాటి." అని 
   ఈ ఆటను మొత్తం చూసి వాసు కొడుకు శ్రీకాంత్ 'నేను చదువును చాలా నిర్లక్ష్యం చేస్తూ ఆటపాటలతో టైం వేస్ట్ చేస్తున్నా. ఉపాధ్యాయులు చెప్పినవి, నాకు అర్థం కావడం లేదని, కొండంత భారం అనిపిస్తున్న చదువు చదవడం నావల్ల ఏమవుతుందని పూర్తిగా వదిలేశా. ఇప్పుడు నాన్న ఆట చూస్తే నాకు కనువిప్పు కలిగింది. ఇకనుంచి కష్టపడి చదివి, మంచి మార్కులు సాధించాలి.' అనుకున్నాడు. ఎంత కష్టమైన లక్ష్యాన్ని అయినా సడలని పట్టుదలతో ఛేదించవచ్చునని తెలుసుకున్నాడు శ్రీకాంత్.
కామెంట్‌లు