పాఠశాల విద్యార్థులను విహార యాత్రకు తీసుకెళ్లారు. చారిత్రాత్మక ప్రదేశాలకు తీసుకువెళ్లారు. విద్యార్థులు ఉపాధ్యాయులను సెల్ ఫోన్లు అడిగి ఆయా ప్రాంతాలలో చాలా ఫోటోలు తీసుకుంటున్నారు. రాజు చేతిలో డైరీ తీసుకొని, తాను చూసిన ప్రాంతాలు, అక్కడ విశేషాలను సవివరంగా రాసుకుంటున్నాడు. కొంతమంది విద్యార్థులు రాజును హేళన చేస్తున్నారు. అప్పుడప్పుడు రాజు వాళ్లతో కలసి ఫోటో దిగుతా అంటే వాళ్లు ఒప్పుకోవడం లేదు. అదేదో రాసుకుంటున్నావు కదా! రాసుకో అంటూ పగలబడి నవ్వుతున్నారు. రాజు మౌనంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతున్నాడు. విహారయాత్ర ముగిసింది. అందరూ పాఠశాలలకు వచ్చారు.
పరీక్షలు మొదలయ్యాయి తెలుగు పరీక్షలో మీరు చూసిన విహారయాత్ర విశేషాలను సవివరంగా రాయమని 10 మార్కులకు ప్రశ్న అడిగారు. రాజు వివరంగా రాస్తున్నాడు. నలుగురైదుగురు విద్యార్థులు రాజును తాను రాస్తున్నది చూపించమని బతిమాలినారు. "మీరు విహారయాత్రల్లో ఫోటోలు దిగుతూ మీతో కలిసి నేను కూడా దిగుతానని, బతిమాలితే పగలబడినవ్వి, నన్ను పక్కన పెట్టారు కదా! నేను మీకు ఎందుకు చూపించాలి? విహారయాత్రలలో మీరు ఏమేమి చేసినారో, ఎలా ఎంజాయ్ చేశారో గుర్తు తెచ్చుకొని సొంతంగా రాయండి. దయచేసి నన్ను అడగవద్దు." అన్నాడు రాజు. చాలామంది సరిగా రాయలేకపోయారు. మార్కులు తగ్గినాయి. రాజుకి మంచి మార్కులు వచ్చినాయి.
విహారయాత్రలో తాము చారిత్రాత్మక ప్రదేశాలలో దిగిన ఫోటోలను గురించి చెప్పుకుంటూ, రాజుకు అదృష్టం లేదని మళ్లీ పగలబడి నవ్వారు. అప్పుడు శేషు ఇలా అన్నాడు. "మీరంతా ఫోటోలు దిగుతూ, రాజును కలుపుకోనంత మాత్రాన రాజకు నష్టం ఏమీ జరగలేదు. రాజు విహారయాత్రలలో చూసిన విశేషాలను డైరీలో రాసుకోవడం ఉపాధ్యాయులకు బాగా నచ్చింది. అడపాదడపా ఆయా చారిత్రాత్మక ప్రదేశాల ముందు ఉపాధ్యాయులు కూడా ఫోటోలు దిగుతూ రాజును పిలిచి రాజుతో కూడా కొన్ని దిగారు. అలా ఉపాధ్యాయులతో చారిత్రాత్మక ప్రదేశాల ముందు ఫోటోలు దిగే అదృష్టం మీకు లేదు. రాజకు మాత్రమే ఉంది." అని.
మిగతా విద్యార్థులకు దిమ్మ తిరిగింది. రాజు డైరీ రాసుకోవడం చూసి, తాము హేళన చేశాము. కానీ ఆ పనికి ఉపాధ్యాయులు మెచ్చుకొని, ఆయా చారిత్రాత్మక ప్రదేశాల ముందు రాజుతో కలిసి ఉపాధ్యాయులు ఫోటోలు దిగారని వాళ్లకు అర్థమైంది. అదృష్టమంటే రాజుదే అనుకున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి