సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 

 సామెత -326: ఇద్దరు కొట్టుకుంటే మూడోడికి లాభం
***
"ఒరే బుడ్డోడా ఏందిరా లొల్లి! అక్కని ఒకటే సతాయిత్తున్నవ్?"
"అవ్వా! నేనేం సతాయిత్తల్లే! అక్కనే ఊకూకె నా జోలికొత్తుంది. బాపు గా నడ్మల పట్నం బొయ్యినప్పుడు బంగారం రంగుల మెరుత్తున్న పెన్ను బట్టుకొచ్చిండు గద. గది గావాల్నని నేను అక్క అడ్గితే ఎవ్వలు మంచిగ సద్వితే గాల్లకిత్తనని శెప్పిండు.గీ నడ్మల నేను మంచిగ సద్వుకుంటున్నవ్వా! మొన్న మా సార్లు పంతులమ్మలు పెట్టిన నెల పరీచ్చల్ల నేనే పస్టొచ్చిన.గందుకని బాపు నాకే ఇత్తడంటే అక్క సూడు ఎంత లొల్లి శేత్తుందో?"
"భూలచ్మీ! బుడ్డోడు శెప్పింది నిజవేఁనా?లొల్లొందుకు శేత్తున్నవ్? గాన్ని శికాకు జేత్తున్నవట ఎందుకు?''
 "అవ్వా! నేనేం జెయ్యట్లే.గాడే శికాకు శికాకు శేత్తుండు.ఒక్క పరీచ్చల్లనే గాదు మొన్న జెండా పండ్గదినాన సొతంత్రం గురించి జెండాలో మూడు రంగుల గురించి మాట్లాడాలని, రాయాలని పోటీ బెడితే గందుట్ల నేనే పస్ట్ వొచ్చిన.నీకు దెల్సుగత. శిన్నోళ్ళకు పెట్టిందాంట్లే నువ్వు సుత వుండురా అంటే వామ్మో! నాకు బయ్యమని ఒక్క దాంట్లే సుత ఉండలేదు.గిప్పుడేమో నాకు పోటీకొత్తుండు? "
"బాపు సద్వు ముచ్చెటి అన్నడు.గందుకని  గదే లెక్క.గిదెట్లయితదవ్వా? అక్కే అన్ని తొండి మాటలు శెప్తుంది."
 "సూశినవా అవ్వా!గిది సుత మాట్లాడ్డం రాట్లే ' తొండి ఆటలు ఉంటయి గని ఏడన్న తొండి మాటలుంటయా నువ్వే శెప్పు!"
" గింతకీ  మీ లొల్లంత గా బంగారం రంగుల  మెరుత్తున్న పెన్ను కోస్రమేనా! గందుకేనా మీరిట్ల పంచాతి పెట్టుకుంటున్నది. అస్లా పెన్నూ..."
"అవ్వా! గా పెన్ను ఏమైంది?ఎవలికన్న ఇచ్చిర్రా ఏంది?"
"ఒక్కటే పెన్ను.దాని కోస్రం మీరు గిట్లనే తన్నుకుంటరు,లొల్లి చేత్తరని దాన్ని మొన్న     మీ బడి మొత్తంల పదిల పట్టొచ్చింది సూడు చిట్టెక్క. గా అక్కని పిల్శి నిన్ననే యిచ్చిండు. అయిన గని గా పెన్ను తెచ్చిన కానించి నాకే అయితది నాకే యిత్తడని యాదికొచ్చినప్పుడల్ల లొల్లి జేత్తిరి. గట్ల ఇద్దరు కొట్టుకుంటే మూడోడికి లాభమని.గది కాత్త ఆ అక్కకి బొయ్యిందా. మా అక్కేగా? మా తమ్ముడేగా అన్కుంటే గా పెన్ను మీ తాన్నే ఉండేదిగా. ఎన్కట రెండు పిల్లులు మీ లెక్కనే పంచాతి బెట్కుంటే మూడోల్లకి లాభమైనదట."
"అవ్వా! అవ్వా! గా కత శెప్పవా?"
" శెప్త శెవులు బెట్టి యినుర్రి మరి. మీ లెక్కనే ఎన్కట ఓ రెండు పిల్లులు ఉండేయి.గవీటికి ఓ దినాన  ఓ శెట్టు కింద మూటల  పెద్ద రొట్టె దొర్కింది.ఉన్నది ఒక్కటి మొదగాల గా మూటని నేనే జూసిన నాకే గా రొట్టె మొత్తం అని ఓ పిల్లి.లేదు మూట యిప్పింది నేను నాకే కావాలే అని యింకో పిల్లి పెద్ద పెద్దగ అర్సుకుంటూ లొల్లి జేత్తుంటే గా పైన శెట్టు మీదున్న కోతి సూశింది. యిష్యం ఏందని అడిగింది."
"గప్పుడు! గా పిల్లులు రొట్టె ముచ్చెటి శెప్పినయి. "మీరిట్ల లొల్లి పెట్టుకోకుండ్రి.నేను మీకు శెరి సగం శేసిస్త" అంటే గా పిల్లులు సరే అన్నయి. గప్పుడా కోతి తన తాన ఉన్న తరాజు పట్కొచ్చి రొట్టెని సమానం జెయ్యకుండ ఓ దాంట్లె పెద్ద ముక్క, ఇంకో దాంట్లె శిన్న ముక్క ఏశి,అయ్యో సమానంగ లేదు అన్కుంట తుంపుకోని తినుడు మొదలువెట్టింది. గట్ల అటు లేదు ఇటు లేదు అన్కుంట మొత్తం తిని ఎగిరి శెట్టెక్కి కూసుంది.గా రెండు పిల్లులు తెల్ల మొగాలేసుకుని మనమే శెరింతని పంచుకుంటే మంచిగుండేది. మనిద్దరి కొట్లాట గా కోతికి లాభమైంది అన్కొని ఏడ్పు మొగంతో ఇంటికెళ్ళిపోతయి. కత అర్తమైందా?"
"అర్తమైందవ్వా! మా పంచాతి జేబట్టే బాపు గా పెన్ను యేరేటోళ్ళికిచ్చిండు.యింగెప్పుడు గట్ల పంచాతి పెట్టుకోం.మా యిద్దట్ల ఎవలకేదిచ్చినా ఏవఁనం.బుద్ధిగుంటమవ్వా!"
 "గందుకే పెద్దోళ్ళు ఊకెనే అన్లే"ఇద్దరు కోట్లాడుకుంటే మూడోడికి లాభమైతదని.గదండీ సంగతీ!"
కామెంట్‌లు