పట్టుదలకు మారుపేరు ఆమె!!: - - యామిజాల జగదీశ్


 అప్పుడామెకు పన్నెండు సంవత్సరాలు మాత్రమే. నల్లజాతి యువతి. తన తల్లితో పాటు వెళ్ళి ఓ ఇంట శ్వేత జాతీయుల బట్టలు ఉతికింది.
అయితే ఓమారు ఆమె దాదాపు మాయాజాలంలా అనిపించిన ఒక విషయాన్ని చూసింది. అది, పుస్తకాలతో నిండిన గది.
అది ఒక లైబ్రరీ.
విశాలమైన కళ్ళతో, ఆమె పుస్తకాన్ని తాకడానికి చేయి చాపింది. అయితే ఇంతలో యజమాని కుమార్తె ఆమెకు అడ్డుపడింది. "నువ్వు పుస్తకం తాకడానికి వీల్లేదు" అని గట్టిగా అరిచింది. ఈ మాటలు ఆమెను గాయపరిచాయి.
“నువ్వు నల్లజాతివి. నల్లజాతీయులకు ఎలా చదవాలో తెలియదు.” అన్న ఆ శ్వేతజాతీయురాలి మాటలు ఆమెను ఆలోచనలో పడేశాయి. నేను చదివే తీరుస్తాను అని గట్టిగా అనుకుంది. 
ఈ సంకల్పం ఆమెను ఊరుకో నివ్వలేదు. 
అది ఆమె జీవిత గమనాన్ని మార్చింది. ఇంతకు ఆమె పేరు చెప్పలేదు కదూ...
ఆమె పేరు మేరీ మెక్లియోడ్ బెతున్!
1875లో దక్షిణ కరోలినాలో జన్మించింది, గతంలో బానిసలుగా ఉన్న తల్లిదండ్రుల కుమార్తె, పదిహేడు మంది పిల్లలలో పదిహేనవది. ఆమె పేదరికం, బహిష్కరణ పోరాటంలో పెరిగింది. కానీ ఆ క్షణంలో, చట్టం కాదు - పక్షపాతం ఆమెకు పుస్తకాన్ని నిరాకరించినప్పుడు, ఆమె శక్తివంతమైనదాన్ని అర్థం చేసుకుంది. ఆమె మేని రంగు తెల్లజాతి నుండి వేరు చేసింది. విద్యను పొందడంలో ఆమడదూరంలో నిలిపింది. అయితే ఆ అడ్డంకిని బద్దలు కొడతానని ప్రమాణం చేసింది.
ప్రతిరోజూ ఆమె నల్లజాతి పిల్లల పాఠశాలకు వెళ్లడానికి 16 కిలోమీటర్లు నడిచింది.
ఆమె చదవడం నేర్చుకుంది. చదవడం ఆమె ఆయుధంగా మారింది.
ఆమె తన తల్లిదండ్రులకు, తన తోబుట్టువులకు, తన పొరుగువారికి, క్షేత్రస్థాయి కార్మికులకు నేర్చుకోవాలనుకునే ఆసక్తి ఉన్నవారిని గుర్తించి అక్షరాన్ని పరిచయం చేసింది. క్రమంగా నల్లజాతీయులలో
అక్షరాస్యత శాతాన్ని పెంచింది. ఆమె పట్టుదల ఓ నిశ్శబ్ద విప్లవంగా మారింది.
ఆమె ప్రతిభ ఆమెకు స్కాలర్‌షిప్‌లను సంపాదించిపెట్టింది. ఆమె ఉపాధ్యాయురాలిగా, తరువాత స్థాపకురాలిగా మారింది. ఆమె డేటోనా బీచ్‌లో తన సొంత పాఠశాలను ప్రారంభించింది. అనంతరం అది బెతున్ కుక్‌మాన్ విశ్వవిద్యాలయంగా మారింది. ఆమె జైళ్లలో బోధించింది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చింది. ఒకప్పటి నిషేధించిన ప్రదేశాలలోనూ ఆమె చదవటం నేర్పింది. విద్యార్థులు డిగ్రీలు పొందడానికి, చరిత్రను తెలుసుకోవడానికి, చాలా కాలంగా మూసివేసిన తలుపులు తెరవడానికి, చాలా కాలంగా తిరస్కరించిన హక్కులను పొందటానికి ఆమె సహాయసహకారాలు అందించింది.
ఆమె స్వరం మరింత ముందుకు సాగింది. ఆమె సెనేటర్లకు సలహా ఇచ్చింది. ఆమె అధ్యక్షులతో చర్చించింది.  ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ ఆమెను జాతి వ్యవహారాలపై అధ్యక్ష సలహాదారుగా నియమించారు. ఆమె కనిపించకుండా ఉండాలనుకునే యుగంలో ఓ నల్లజాతి మహిళగా  విప్లవాత్మక పాత్ర పోషించింది. ఆమె సాహసోపేతం అందరినీ ఆకట్టుకుంది.
ఆమెను "పోరాట ప్రథమ మహిళ" అని పిలిచారు. ఆమె బిరుదుల కోసం వెతుకుతున్నందుకు కాదు, రోసా పార్క్స్ తన స్థానాన్ని తిరస్కరించడానికి లేదా మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ తన స్వరాన్ని పెంచడానికి చాలా కాలం ముందే ఆమె మార్గాలను రూపొందించడంతో ఆమెను ఉన్నత స్థానంలో చూశారు.
ఆమె 5,000 మందికి పైగా చదవడానికి నేర్పించిందని చెబుతారు. ఆమె మేల్కొన్న మనస్సులను, ఆమె రేకెత్తించిన కలలను, ఆమె పరివర్తన చెందిన భవిష్యత్తులను మనం లెక్కించినట్లయితే ఆమె వారసత్వం అపరిమితమైనది.
ఆమె 1955లో మరణించింది. అదే సంవత్సరం రోసా పార్క్స్ ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ ధిక్కార చర్యను చూడటానికి మేరీ జీవించలేదు. కానీ అది సాధ్యం చేసే మూలాలను ఆమె నాటింది.
ఎందుకంటే ఒక నల్లజాతి మహిళ ఒక పుస్తకాన్ని చదవాలనుకుని చేయి చాచినప్పుడు, ఏ గొలుసు, ఏ చట్టం, ఏ పక్షపాతం ఆమెకు అడ్డుపడిందో వారు ఆమె పట్టుదలను చూసి కంగుతిన్నారు. తన చదువుసంధ్యలతో ప్రపంచాన్ని తిరగరాసింది.
 మేరీ మెక్లియోడ్ బెతున్ కథ దృఢ సంకల్పం కలిగిన స్త్రీ తిరుగులేని శక్తిని మనకు గుర్తు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా, ఆమెలాంటి స్త్రీలెందరో పుస్తకాల ద్వారా, కళ ద్వారా, ధైర్యం ద్వారా ఎన్నో అడ్డంకులను బద్దలు కొట్టారు. చరిత్రను తిరగ రాశారు. మనం అనుసరించడానికి ఒక బాటను వదిలి వెళ్ళారు.
కామెంట్‌లు