అతిగా ఆశపడితే ; - సరికొండ శ్రీనివాసరాజు
  

  ఆ అడవిలో అందమైన జింక ఉండేది. అది చాలా వేగంగా కూడా పరిగెత్తగలదు. దాని అందానికి చాలా జంతువులు ఆశ్చర్యపోతూ, గుడ్లప్పగించి చూస్తాయి. దాంతో ఆ జింకకు గర్వం పెరిగింది. పరుగు పందానికి చాలా జంతువులను పిలిచి, వాటిని ఓడిస్తూ, హేళన చేస్తుంది జింక. 
      ఆ అడవిలో విజయ అనే గుర్రం ఉంది. శరవేగంగా పరుగెత్తడం దాని ప్రత్యేకత. ఒకరోజు అడవికి రాజైన సింహం దాని పుట్టినరోజు సందర్భంగా అడవిలోని జంతువులకు పరుగు పందెం నిర్వహించింది. గెలిచిన జంతువుకు అంతులేని బహుమతులను ఇస్తానని ప్రకటించింది. జింక తనదే గెలుపు అని తెగ ప్రచారం చేసుకుంటుంది. శ్రేయోభిలాషులు హెచ్చరించాయి . అతిగా ఆశ పడితే నిరాశ తప్పదని హెచ్చరించాయి. 
       పరుగు పందెం రోజు రానే వచ్చింది. పరుగు మొదలైంది. విజయ అనే గుర్రం శరవేగంగా పరిగెత్తుతూ ఎవరికి అందనంత దూరంగా వెళ్ళింది. జింక బాగా వెనకబడింది. ‌ ఇంతలో విజయకు ప్రమాదవశాత్తు బండరాయికి తగిలి, దెబ్బలు తగిలి కొట్టుకుంటున్న కుందేలు కనిపించింది. గుర్రం ఆగి, దానికి సహాయం చేయాలని చూస్తుంది. జింకకు వైద్యం తెలుసు. గుర్రం పరుగెత్తుతున్న జింకను ఆపాలని ప్రయత్నించింది. కానీ జింక తాను ఎక్కడ ఓడిపోతానో అని ఆగకుండా పరిగెత్తుతుంది. గుర్రం కుందేలు మరో వైద్యుని దగ్గరికి తీసుకెళ్లింది. కుందేలును కాపాడింది. 
      పరుగు పందెంలో అన్నింటికంటే ముందు జింక గమ్యాన్ని చేరింది. తాను గెలిచినట్లు ప్రకటించమని రాజును కోరింది. ఎప్పుడు ఫస్ట్ వచ్చే విజయ ఎటు పోయిందని దిక్కులు చూస్తుంది సింహం. జరిగిన విషయం పూస గుచ్చినట్లు చెప్పింది రామచిలక. తన స్వార్థం చూసుకోకుండా తోటి జీవి ప్రాణాన్ని నిల్పిన విజయను విజేతగా ప్రకటించింది సింహం. ఇది అన్యాయమని అరుస్తుంది జింక. వెంటనే సింహం "ఈ స్వార్ధ జీవికి ఈ అడవిలో నుంచి బహిష్కరణే తగిన శిక్ష. వెళ్లనని మొండికేస్తే దీనిని నాకు ఆహారంగా పంపండి." అని అన్నది. చేసేది లేక జింక కాలికి బుద్ధి చెప్పింది.
కామెంట్‌లు