నక్కగా నంది; - - యామిజాల జగదీశ్


నంది ఒకప్పుడు నక్కగా పుట్టాడాన్ని నమ్ముతారా? అవును, శివుడి వాహనమైన నంది ఒకప్పుడు నక్కగా పుట్టాడని పురాణాలు చెబుతున్నాయి.
దీనికి కారణం పార్వతీదేవి ఇచ్చిన శాపం. ఆ శాపం ఎందుకు వచ్చిందో తెలుసా? ఒకసారి పార్వతీదేవి గౌరీ రూపాన్ని పొందాలని కఠినమైన తపస్సు చేయడానికి బయలుదేరింది.
వెళ్లే ముందు కైలాస ద్వారం దగ్గర కాపలాగా ఉన్న నందిని పిలిచింది. "నేను తిరిగి వచ్చేవరకు ద్వారం దగ్గర జాగ్రత్తగా కాపలాగా ఉండు. నా రూపంలో ఎవరైనా సరే లోపలికి రాకుండా చూసుకో" అని చెప్పింది.
అలా పార్వతీదేవి తపస్సు చేయడానికి వెళ్ళగానే, ఆది అనే రాక్షసుడు అక్కడికి వచ్చాడు. నంది కాపలాగా ఉండటం చూసి, తెలివిగా మొదట పాము రూపం దాల్చి కైలాసంలోకి వెళ్ళాడు.
లోపలికి వెళ్ళగానే వాడు పార్వతీదేవి రూపంలోకి మారిపోయాడు. అదే రూపంలో వెళ్లి శివుడిని కలిశాడు. కానీ అసలు నిజం వెంటనే బయటపడింది. అప్పుడు ఆది అనే ఆ రాక్షసుడు తన నిజరూపంలోకి వచ్చి శివుడితో యుద్ధం చేశాడు.
చివరకు శివుడు ఆ రాక్షసుడిని సంహరించాడు. ఆ తరువాత పార్వతీదేవి కైలాసానికి తిరిగి రాగానే, జరిగిందంతా తెలుసుకుంది. తాను అప్పగించిన బాధ్యత నంది సరిగ్గా నెరవేర్చలేదని ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది.
వెంటనే నందికి శాపం ఇచ్చింది. "జాగ్రత్తగా ఉండాలని తెలిసి కూడా నీ బాధ్యతను నువ్వు మర్చిపోయావు. అందుకే నువ్వు భూమిమీద పన్నెండేళ్ల పాటు నక్కగా పుడతావు" అని శపించింది. ఆ శాపం కారణంగా నంది భూమిమీద నక్క రూపంలో పుట్టాడు. అయితే నక్కగా మారినా, అతడు శివుడిపై తన భక్తిని మాత్రం ఎప్పుడూ మర్చిపోలేదు.
ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి, ఎంతో భక్తిశ్రద్ధలతో శివుడిని పూజించాడు. పన్నెండేళ్ల తర్వాత అతని శాపం తొలగిపోయి, మళ్లీ తన దివ్యమైన రూపాన్ని చేరుకున్నాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం ఏమిటో తెలుసా?
 శరీరం లేదా మన రూపం మారొచ్చు. కానీ మనసులోని నిజమైన భక్తి మాత్రం ఎప్పటికీ మారదు.
 
కామెంట్‌లు