పండిత పాద స్పర్శా పునీత.: - డా. సి. వసుంధర, చెన్నై


అయ్యయో!! 
అటు వెళ్ళ వద్దది ముళ్ళ డొంక 
కంటకాలు మీ కాల్దిగు. 

స్నేహ బృందమా! రండు గొని పోయెద 
మీరేగవలసిన సాహిత్య సస్య క్షేత్రం 
సుందర భావనా లతలకు భోగ భూమి
నవనీత నిభమైన కవుల స్పందనలకు 
కావ్య నిధులకు పుట్టినిల్లు
దాని  రహదారి ఇదిగో ఇటు రండు 
నడుచుచు చెప్పేద నచటి వైభవమ్ము 

అటు చూడుడు చుక్కల నంటిన 
మేటి దివ్య నైగమంబు (పట్టణం) 
అచ్చోటకు
పోవుదము ఈ రహదారిన నడుచుకొనుచు 
కనువిందుగ ప్రకృతి సౌందర్యమును గాంచుచూ
చెవులకింపైన ముచ్చట్లు చెప్పుకొనుచు.
 
సాహిత్య నృత్య గాన సద్భక్తికిన్ 
సత్పురుషుల సందడికెత్తిస్మరించ దగ్గదీ దారి,
 ఇట నడచువారి 
అడుగులు ఆనందాల మడుగులౌను.

ఆదికవి నన్నయ్య అవతరించిన చోటికి 
పోవలె నీదారి నుండే...
తియ్యని తెనుగు కవిత్వ యజమాని
తిక్కన ఊరికి దారి ఈ రహదారి నుండే.

భారతాంబుధి రెండంచులు కలిపిన 
ఎర్రనార్యుని స్మరింప వలె నీదారిన నడచువారు

వివిధ వర్ణ పద పుష్పవిరాజిత 
కవి పోతన్న  ఇటువైపు వాడే.

శ్రీనాథ శృంగార భావ తరంగములకు
 సెలయేరు రంగమయ్యే

ఆముక్తమాల్యదలోని అద్భుత సుగంధ మందించు 
నిక్కడి లతాంతములు ఆచ్చెరువు గాదే !

ప్రాచీన వైభవోన్నుతులకు దీటుగా నాటిరి 
సరికొత్త ఆధునిక వృక్ష జాతులె న్నో. 

ఈ రహదారి చరించు వారి కిచ్చునవి చల్లని నీడ,
అంతియే కాదు జ్ఞాన ఫలములు, 
మృదులతర భావ సుమాల నెన్నో.

రహదారి నడచి గడిపిన సమయము 
ఒక కల యంతగా  స్ఫురించె నాకు 

చేరితిమి తెలుగు భాషామతల్లి వర్ధిల్లు ఇల్లు
వెలుగుల పుట్టిల్లు 
జిగేలుమనెను నా కళ్ళు

సాహితీ రస స్రవంతి సభ 
ఇచటనే, క్రోసెడు దూరాన నుండు
అచటనే యున్నది జాంబూనదంబుచే 
మెరియు తెలుగు తల్లి బొమ్మ 
చూద్దాము నడువుడూ జన్మ తరించు మనకు.
కామెంట్‌లు