రంగులు : - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


మనసులను పరవశపరచుటకు చల్లేదా రంగులు 
నేత్రాలను ఆకర్షించుటకు చూపేదా రంగులు 
 
వాడిపోయిన జీవితాలకి మధుమాసాన్ని తెచ్చి 
విరిసిన ఆశల పూదోటకు వేసేదా రంగులు 

చీకటిలో చిక్కుకున్న ప్రాణులకు వెలుగై నిలిచి
చిరునవ్వులు పెదవులపై పూయించేదా రంగులు

కళాకారుని చేతికుంచెకు కదలికను అందించి 
కాన్వాసుపై బొమ్మలకు అద్దించేదా రంగులు

ప్రకృతమ్మ ఒడిలో పచ్చదనం కాపాడి పెంచి 
అందాలు చూపించటానికి చిమ్మేదా రంగులు 

మనుషులలోని మంచితనానికి కిరీటాన్ని పెట్టి 
మానవత్వపు పతాకానికి పులిమేదా రంగులు 

కన్నీటితో తడిసిన కన్నులకు ఓదార్పునిచ్చి
కలతలను కడిగివేసేలా దిద్దేదా రంగులు

పండుగలేని గడపలకు ఆనందం పంచిపెట్టి 
ప్రతి ఇంటి ముంగిళ్లలో మెరిపించేదా రంగులు 

రాజేంద్రుని కలమునుండి కారే అక్షరాలతో 
రసహృదయుల గుండెలనందు నింపేదా రంగులు  

కామెంట్‌లు