డైరీలో ఓ పేజీ: - - తమిళం: విజయభాస్కర్-- స్వేచ్ఛానువాదం - జగదీశ్ యామిజాల
 

ఓ నాన్న తన పాత డైరీలోని ఒక పేజీని ఇచ్చి చదవమన్నారు కొడుకుని. అది ఆ కొడుకు గురించి నాన్న రాసిన మాటలు.... కొడుకు చదవసాగాడు...
"నా కొడుకును భీష్ముడి కథ చెప్పమని అడిగాను. భీష్ముడి పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. ఊరికే అలా పుస్తకంపై చెయ్యి ఉంచి కథ చెప్పడం మొదలుపెట్టాడు. "భరత" రాజుల వంశంలో పుట్టినవాడు శంతనుడు అన్నాడు.
ఆ భరత రాజు ఎవరు అని అడిగాను.
శకుంతల కొడుకు, విశ్వామిత్రుడి మనవడు అన్నాడు.
సరే తరవాత ఏమైంది అన్నాను... కథ కొనసాగించాడు.
వేటకు వెళ్లిన శంతనుడు గంగను చూశాడు.......... కథ అలా ప్రవాహంలా సాగిపోయింది. అర్జునుడు భీష్ముడికి అంపశయ్య ఏర్పాటు చేయడం, భూమిని బాణంతో తొలిచి గంగమ్మ నీటిని రప్పించి ఆ గంగ పుత్రుడి దాహం తీర్చడం, పరశురాముడి వద్ద విద్య నభ్యసించిన భీష్ముడి పరాక్రమానికి శిఖండి అడ్డుగా నిలిచి పార్థుడికి సాయపడటం వరకు అంతా చెప్పాడు.
ఒక గొప్ప పండితుడిలా అతడు చెప్పిన కథలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. ఇంత చిన్న వయసులో (పదేళ్ల వయసు, ఐదో తరగతి లోపే) పురాణ కథలపై ఇన్ని విషయాలు తెలుసా అని నాకే ఆశ్చర్యం వేసింది. అంత స్పష్టంగా చెప్పాడు కథను.
ఎప్పుడూ చదువే. పురాణ కథలు చదవడం అతడికి చెరకు తిన్నంత తీపి. ఒక పుస్తకం చేతికి దొరికితే అది పూర్తి చేసే దాకా వదలడు. అతడి వేగానికి తగినట్లు పుస్తకాలు కొని ఇవ్వడం నా వల్ల కాలేదు. 
పదేళ్ల వయసులో క్రికెట్ ఆడేవాడు. రోజుకో బొమ్మ వేసేవాడు. మిగిలిన సమయమంతా చదువుతూనే ఉండేవాడు...
తన గురించి తండ్రి రాసిన ఈ మాటలు చదివిన కొడుకు ఆశ్చర్యపోయాడు. తననెంతలా గమనిస్తున్నారో నాన్న అని అనుకున్నాడు మనసులో.
కామెంట్‌లు