కవిత్వం (గజల్) ; - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


కవులు దాచే అక్షరసంపదలురా కవిత్వం
పఠకులు మెచ్చే పదాలపసందురా కవిత్వం॥

దాహమార్చే జీవజలంబై జాలువారుచూ
నింగి పుడమిపై రాల్చే చినుకులురా కవిత్వం॥

దుర్మార్గుల గుండెల్లో నిప్పులై దూసుకెళ్తూ 
దొంగలమీద పేల్చే తూటాలురా కవిత్వం॥

రైతు చెమటకు ప్రతిఫలమై వెలిసే భాగ్యంలా
పచ్చని పొలాల్లో పండే పంటరా కవిత్వం॥

ఆత్మీయత రుచులను అందరికీ అందించుతూ 
వివాహవిందుకు వండే వంటలురా కవిత్వం॥

పరిమళాలతో మనసులను పరవశింపజేయుచూ
పూతోటల్లో విరిసే పువ్వులురా కవిత్వం॥

ఆశాకిరణాలై చీకట్లను తొలగించుచూ
తళుకుబెళుకులు చిమ్మే తారకలురా కవిత్వం॥

ఎండిన హృదయాలకు చల్లదనాన్ని పంచుతూ
ఆకాశంలో తేలే మబ్బులురా కవిత్వం॥

నిశిలోకానికి నెమ్మదిని నింపి వెలుగులిస్తూ
వెండిజాబిల్లి చల్లే వెన్నెలరా కవిత్వం॥

విషాదం పారద్రోలి సంతోషం పంచుతూ
చిరుచిరునవ్వులు చిమ్మే మోములురా కవిత్వం॥

'రాజేంద్ర' హృదయంలో రాగమై రవళిస్తూ  
ప్రకృతిమాత చూపే అందాలురా కవిత్వం॥

కామెంట్‌లు