దేవుడా... ? యముడా...?: - " కావ్యసుధ "


ప్రాణాన్ని కాపాడితే
దేవుడు అంటారు డాక్టర్ని 
నిజం వైద్యో నారాయణో హరి:
డాక్టర్ చేతిలో స్టెతస్కోప్ కాదు
సాక్షాత్తూ నారాయణుడి శంకమే                                                             
 అతడిచ్చే మాత్ర అమృత బిందువు 
అతడి చూపే ఆయుష్షు పోసే దీవెన.
అందుకే తల్లి తర్వాత......
స్థానం డాక్టర్ కే ఇచ్చారు.

కానీ, కొందరు డబ్బుకు
కక్కుర్తి పడి ప్రాణాలు తీస్తున్నారు.
అమృతం పోయాల్సిన చేతులు
విషం పోస్తున్నాయి.
కాపాడాల్సిన కత్తి......!
కోసి చంపుతుంది.....!!
అవసరం లేని టెస్టులు...
అవసరంలేని ఆపరేషన్లు...
కమిషన్ కోసం మందులు...
బెడ్ దొరకదని.....
వెంటిలేటర్ తీయమని
బిల్లు కట్టలేదని........
శవాన్ని ఇవ్వమని......
అసలు ఇది వైద్యమా ? 
లేక వ్యాపారమా ? 
సేవా ? సంపాదనా ?

ఇదేమి మానవత్వం !
ఇది మానవత్వం కాదు 
ఇది దానవత్వం
ఇది కలియుగ రాక్షసత్వం
ధన్వంతరి వారసులే.....
యమధర్మరాజు 
దూతలవుతున్నారు 
ప్రాణం పోసే బ్రహ్మ..
ప్రాణం తీసే రుద్రుడౌవుతున్నాడు.

ఇప్పుడు వైద్యం విద్య కాదు
వ్యాపారమైంది 
కోట్లు పెట్టి సీటు కొంటే....
వాడు రోగిని కాదు..... 
కస్టమర్ ని చూస్తాడు.

సేవా భావం పోయింది
డిగ్రీ ఉంది... దయ లేదు !
తెల్ల కోటు ఉంది..
తెల్ల మనసు లేదు.

ధర్మం మరిచారు...
హిపోక్రటిక్ ప్రమాణం...
కేవలం పుస్తకాలలో
అక్షరమయింది 
"నేను రోగిని దేవుడిలా చూస్తాను"                               
అన్నమాట....
"నేను రోగిని ఏటీఎంలా చూస్తాను "                                                             
అయింది.

ఓ డాక్టర్లారా.....
గుర్తుంచుకోండి !
మీరు వేసుకున్నది.... 
తెల్లకోటు కాదు 
అది ప్రజల నమ్మకం !
మీ చేతిలో ఉన్నది....పెన్ను కాదు
ఒకరి ప్రాణం....ఒక కుటుంబం....
డబ్బు......శవం వెంటరాదు
కానీ పాపం.....నిన్ను వదలదు
శివుడి మూడో కన్ను.....
అన్నీ చూస్తోంది.

ఓ ప్రభుత్వమా  ! మేలుకో...
వైద్యం హక్కు కావాలి !
వ్యాపారం కాదు.
ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి....
అడ్డుకట్ట వేయాలి.

ఓ ప్రజలారా ! ప్రశ్నించండి !!
డాక్టర్ దేవుడే, కానీ 
గుడ్డిగా నమ్మకండి !
ఎందుకు ఈ టెస్టులు ?
ఎందుకు ఈ ఆపరేషన్ ?
అడగండి ? రెండో 
అభిప్రాయం తీసుకోండి !
మీ ప్రాణం.....మీ హక్కు!

నిజమైన డాక్టర్లకు.....
శిరస్సు వంచి నమస్కారం !
కలియుగంలో కూడా....
జీతం తీసుకోకుండా
సేవ చేసే దేవుళ్ళుఉన్నారు.
కరోనాలో ప్రాణాలు ఇచ్చిన                                                           
 వైద్యులు ఉన్నారు.
పల్లెల్లో ఉచితంగా 
వైద్యం చేసే తల్లులు ఉన్నారు.
వారి పాదాలకు వందనం.

వైద్యుడు దేవుడు అయినప్పుడు.....
గుడి కట్టి మొక్కుతాం..
వైద్యుడు వ్యాపారి అయినప్పుడు....
గుండె పగిలి ఏడుస్తాం...
స్టెతస్కోప్ పాశుపతాస్త్రo కావాలి.
ప్రాణాలు కాపాడడానికి 
అది యమపాశం కాకూడదు.
ప్రాణాలు తీయడానికి..

ఇది మానవత్వం కాదు
ఇది కలిమాయ ! ధన మాయ !
ఈ మాయను తొలగించాలి !
వైద్యాన్ని సేవగా మార్చాలి !!
===============================
" కావ్యసుధ "
''వాజ్ఞ్మయ భూషణ''
 హైదరాబాద్
 9247313488
కామెంట్‌లు