"ఏయ్, మొద్దూ! నిద్రలేస్తావా? నీతో మాట్లాడాలి" అన్నది ధరణి వేణు వీపుమీద ఒక్కటి చరుస్తూ.
"అమ్మా, ఎవరు మీరు? ఎందుకు అలా కొడతున్నారు? నిద్రపోనివ్వరా ఏంటి?" అన్నాడు వేణు.
"నిద్రపోయింది చాలు, మంచం విరిగిపోతుంది నీ మొద్దు నిద్రకి ఇక లేవాలి" అన్నది ధరణి.
"సరే లేచాను, ఎవరు మీరు అమ్మా! మీ రూపం ఇంత దీనంగా ఉన్నది. నేనేం చేయగలను మీకోసం చెప్పండి" అన్నాడు వేణు.
"నా పేరు ధరణి. నేను మానవ మనుగడకు ఆధారాన్ని" అని చెప్పింది కళ్ళు తుడుచుకుంటూ.
"ఈ చెట్లు, మొక్కలు, కొండలు, లోయలు, నదులు, సముద్రాలు, అడవులు, జంతువులు సమస్తం నేను లేకపోతే వాటి ఉనికిని కోల్పోతాయి. ఆ సృష్టికర్త మానవుల కోసం ఇవన్నీ భరించమని నాకు చెప్పారు. మీరంతా నా పిల్లలని భావించి, మీకు ఉపయోగపడదామని మీరు నన్ను బాధపెడుతున్నా కూడా మీకు మేలు చేస్తున్నాను."
"అమ్మా మీరు భూమాతా! నమస్కారం తల్లీ! పచ్చని మొక్కలతో కొండలు, నదులతో కళకళలాడుతూ ఉంటావని ఊహించుకున్నానమ్మా భూమాతని! మీరేంటి ఇంత దీనావస్థలో ఉన్నారు?" అని అడిగాడు వేణు ఆశ్చర్యపోతూ.
"ఇలా కాక ఎలా ఉంటాను కుమారా? మనుషులు చేసే నీచమైన పనులకు, చెప్పు?" అన్నది ధరణి కన్నీరు తుడుచుకుంటూ.
"అమ్మా, నిద్ర మత్తు పోయిందమ్మా! నన్నేం చెయ్యమంటారు మీ ఆనందం కోసం చెప్పండి? చేస్తాను" అన్నాడు స్థిరంగా కూర్చుంటూ వేణు.
"కొందరు స్వార్థపరులు అడవులను కనుమరుగు చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో 'యూజ్ అండ్ థ్రో' వస్తువులను వినియోగిస్తున్నారు. కొండలను కూడా తవ్వేసి ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు. ఖనిజ సంపద కోసం తవ్వి తవ్వి, నా గర్భంలో మీ అందరి కోసం దాచిన నిధులను కొందరు స్వార్థంతో దోచుకుంటున్నారు.
నాలోని సారాన్నంతా ధాన్యంగా మార్చి మీకు ఇస్తున్నాను కదా! ఐనా జ్ఞానహీనులు అధిక రసాయనాలతో నన్ను కలుషితం చేసేస్తున్నారు.
నేను పచ్చని పంటలనిచ్చే మాగాణిని. నల్ల బంగారాన్నిచ్చే సింగరేణిని. నాలో ఉన్న, నాపైన ఉన్న, నాతో ఉన్న సమస్తాన్ని కలుషితం చేస్తున్నారు మానవులు. అందుకే ఇలా ఉన్నాను" అన్నది కంటినీరు తుడుచుకుంటూ.
"అమ్మా అర్థమైంది నా కర్తవ్యం. తల్లీ నీ మట్టి బంగారం, అది మానవుల నుదుట మెరిసే సిందూరం. అమ్మా! నీవు పంచే అనురాగం కమ్మని తియ్యని సమభావం. మా తప్పులు క్షమించమ్మా! నీ ఒంటిపై చితులు మండిస్తున్నా చల్లని దీవెనలే ఇస్తున్నావు అమ్మా! నేనేం చెయ్యాలో బోధపడింది తల్లీ. నన్ను క్షమించమ్మా. నిన్ను కళకళలాడే తల్లిగా చూస్తానమ్మా. నన్ను నమ్మమ్మమ్మా! అంటున్నాడు" సాష్టాంగ నమస్కారం చేస్తూ మంచం మీదనుండి కిందకుదిగి.
"ఏమైందిరా వేణూ? రోజూ చస్తున్నాం నీ కలవరింతలతో! ఏంటిరా ఇలా కింద పడ్డావు" అంటూ హైమవతమ్మ వేణుని కిందనుండి లేపుతూ అడుగుతోంది.
"అమ్మా!" అంటూ తనకొచ్చిన కల చెప్పాడు..
"ఆలస్యం ఎందుకురా! ఈరోజు రిపబ్లిక్ డే. ఇంతకన్నా మంచి రోజు ఉంటుందా! ఈరోజు నుండి నీ స్నేహితులు రఘు, రాము, రాజు, మురళి, కుమార్, మనింట్లో వాళ్ళం అందరం ప్రతి ఆదివారం మొక్కలు నాటడం, వీధులు శుభ్రపరచడం, వ్యర్థాలను డ్రైన్లలో వేయవద్దని ప్రతి వీధికీ తిరిగి చెబుదాం, అవకాశం దొరికినప్పుడు పాఠశాలల్లో పిల్లలకు అవగాహన కల్పిద్దాం. ఇంకా ఇలా ఆలోచించే మన ఊర్లో నాగార్జున మెడికల్ షాపు శివ స్మశానం బాగుచేయిస్తానన్నారు తెలుసా! మొన్న మనింటికొచ్చినప్పుడు చెప్పారు"అని తల్లి చెప్పింది.
"అమ్మా! నువ్వు టీచర్‌వని నిరూపించావ్. అలాగే చేద్దామమ్మా" అంటూ ఇంట్లో ఉన్న ఐదుగురూ ఆమె నిర్ణయానికి సంతోషపడ్డారు.
'అమ్మా ధరణీ, అలా దోచుకోవడమేనా అని బాధపడకమ్మా! నీ మనసు గెలుచుకునేలా చేస్తామమ్మా!'అంటూ మనసులోనే ధరణికి, అదే భూమాతకి మాట ఇచ్చాడు వేణు, కార్యాచరణ కూడా జరుగుతున్నది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి